గూగుల్ తో…. జాగ్రత్త..!
Spread the love

స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి… ఎందుకంటే గూగుల్ సంస్థ దొంగచాటుగా మన కదలికలను రికార్డు చేస్తోంది. ఈ రోజుల్లో గూగుల్ లేనిదే ఇంటర్నెట్ లేదన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయి!  జీపీఎస్ ఆఫ్ చేసినా.. లొకేషన్ హిస్టరీ క్లోజ్ చేసినా.. హిస్టరీ క్లియర్ చేసినా.. సెట్టింగ్స్ ఆఫ్ చేసినా ఫలితం ఉండ టం లేదు. మన ఫోన్ లోని మిగతా గూగుల్ యాప్స్ సహాయంతో మనం ఎప్పుడు.. ఎక్కడికి వెళ్తున్నామో రికార్డు చేస్తోంది. ఆండ్రాయిడ్ ఫోన్ లతోపాటు ఐఫోన్ లపైనా గూగుల్ ఐ నిరంతరం కొనసాగుతోంది. ఈ మేరకు సంచలన పరిశోధన నివేదిక వెలువడింది.

అమెరికా శాన్ ఫ్రాన్సిస్కోలోని అసోసియేటెడ్ ప్రెస్(ఏపీ) పరిశోధనలో కఠిన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. వినియోగదారులకు గూగుల్ కనీస గౌరవం ఇవ్వడం లేదని చెప్పింది. అసోసియేటెడ్ ప్రెస్ విన్నపం మేరకు ప్రిన్స్టన్ యూనివర్సిటీలోని కంప్యూటర్ సైన్స్ విభాగం పరిశోధకులు పరిశోధన జరిపారు. యూనివర్సిటీకి చెందిన ఒక పరిశోధకుడు తన ఆండ్రాయిడ్ ఫోన్ లో లొకేషన్ హిస్టరీని ఆఫ్ చేసి వివిధ ప్రాంతాలకు ప్రయాణించారు. ఆ తర్వాత ఫోన్ లో ఉన్న సమాచారాన్ని  విశ్లేషించగా…. ఆయన న్యూయార్క్-ప్రిన్ స్టన్ మధ్య రెండుసార్లు రైలులో తిరిగినట్టు – హైలైన్ పార్క్ – చెలెసా మార్కెట్ – హెల్స్ కిచెన్ తదితర ప్రాంతాల్లో తిరిగినట్టుగా నమోదై ఉంది. ఆయన తన ఇంటికి – ఆఫీస్ కు ఎన్నెన్నిసార్లు వెళ్లారో కూడా రికార్డయ్యింది. గూగుల్ మ్యాప్స్ – సెర్చ్ వంటి యాప్స్ వాడుతున్న ఐఫోన్ లలోనూ వివరాలు రికార్డయినట్టు గుర్తించారు. దీంతో ఈ వివరాలను ఆయన ఏపీతో పంచుకున్నారు.

వినియోగదారులు పాజ్ ఆప్షన్ ను ఎంపిక చేసుకుంటే వినియోగదారుల కదలికలను రికార్డు చేయమని – హిస్టరీని క్లియర్ చేస్తే ఆ వివరాలన్నింటినీ తుడిచి వేయొచ్చని గూగుల్ చెప్పుకొచ్చింది. అయితే అది నిజం కాదని పరిశోధకులు చెప్తున్నారు. లొకేషన్ హిస్టరీని పాజ్ చేసినా.. మనం ఏ క్షణంలో ఎక్కడ ఉన్నామో.. ఇతర యాప్స్ సాయంతో గూగుల్ రికార్డు చేస్తుందని చెప్తున్నారు. ఉదాహరణకు మనం ప్రయాణిస్తున్నప్పుడు ప్లేస్టోర్ ఓపెన్ చేసినా – మ్యాప్స్ ఓపెన్ చేసినా మన కదలికలు రికార్డ్ అవుతున్నాయి. గూగుల్ సెర్చ్ లో ఏదైనా స్టోర్ లేదా ఇతర సమాచారం కోసం వెతికితే మనం ఎక్కడున్నామో అక్షాంశాలు రేఖాంశాల వివరాలతో సహా నమోదవుతోంది. ఇక వాతావరణ వివరాలు అందించే యాప్ గూగుల్ మ్యాప్స్ తో సంబంధం లేకుండా మనం ఏ ప్రాంతంలో ఉన్నామో గుర్తుపట్టేస్తోంది. ఈ వివరాలన్నీ మన గూగుల్ ఖాతాలో నిక్షిప్తం అవుతున్నాయని ప్రిన్ స్టన్ కంప్యూటర్స్ కు చెందిన శాస్త్రవేత్త జోనాథన్ మేయర్ పేర్కొన్నారు. మైయాక్టివిటీ.గూగుల్.కామ్ లో వివరాలను చూసుకోవచ్చని చెప్పారు. గూగుల్ కు మన సమాచారాన్ని సేకరించేందుకు పలు మార్గాలు ఉన్నాయన్నారు. లొకేషన్ హిస్టరీ – వెబ్ అండ్ యాప్ యాక్టివిటీ – డివైజ్ లెవల్ లొకేషన్ సర్వీసెస్ వంటి ఆప్షన్ల ద్వారా ఎక్కడున్నారో గుర్తిస్తున్నదన్నారు. వీటిని ఆఫ్ చేయడంతోపాటు హిస్టరీ మొత్తం ఒకదాని తర్వాత ఒకటి ఎంపిక చేసుకొని తొలిగిస్తేనే నిఘా ఆగుతుందని చెప్పారు. అయితే ఇది శ్రమ కాలంతో కూడిన పని అని చెప్పారు. మొత్తంగా గూగుల్ మన కదలికలను తన ఆదాయ వనరుగా మార్చుకుంటుందన్నదని వివరిస్తున్నారు.