
జనసేన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నంద్యాల పార్లమెంటుని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేస్తామని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్‌కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు. ప్రత్యేక జిల్లా అయితే గానీ నంద్యాల అభివృద్ది సాధ్యపడదని అభిప్రాయపడ్డారు. రాయలసీమలో మార్పు వచ్చి అభివృద్ధి కావాలి అంటే జనసేన రావాలనీ, డబ్బుతో సంబంధం లేని, బాధ్యతతో కూడిన రాజకీయ వ్యవస్థను తీర్చిదిద్దుతామన్నారు.
నసేన పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం కర్నూలు జిల్లా నంద్యాలలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. సభకి హాజరైన ప్రజలను ఉద్దేశించి శ్రీ పవన్‌కళ్యాణ్ గారు మాట్లాడుతూ… “మండుటెండలో మలమల మాడుతూ నా కోసం వచ్చిన మీ జీవితాల్లో వెన్నెల కురిపించేందుకే జనసేన పార్టీ పెట్టాను. జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో కుందూ నదిపై వంతెన నిర్మాణం చేపడతాం. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస వైద్య పరికరాలు అందుబాటులో లేవు. వైద్యులు అందుబాటులో లేరు. జనసేన ప్రభుత్వంలో వైద్యులకు ఇచ్చిన హామీ మేరకు వారు నివాసం ఉండేందుకు సకల సౌకర్యాలతో వసతులు ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ ఆసుపత్రులతో సమంగా వసతులు కల్పిస్తాం. ప్రభుత్వ ఆసుపత్రుల్ని బలోపేతం చేస్తాం. విద్యార్ధుల సౌకర్యార్థం ప్రతి మండలానికి ఒక డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తాం. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తాం. జనసేన ప్రభుత్వంలో విద్యార్ధులకు ఉచిత బస్సు, రైల్వే పాసులతో పాటు ప్రతి ప్రభుత్వ కళాశాలలో ఉచిత క్యాంటీన్లు ఏర్పాటు చేస్తాం. విజయవాడ-నంద్యాల మధ్య ఒక రైలు కావాలన్నది ఈ ప్రాంతం వాసుల కల, ఆ కల సాకారం కావాలి అన్నా, ఏపీ ఎక్స్‌ప్రెస్ రాయలసీమలో ఆగాలన్నా పార్లమెంటులో మన తరఫున పోరాటం చేసే ఎస్పీవై రెడ్డి లాంటి వ్యక్తులు రావాలి. ఆడపడుచుల కోసం ఆదాయంతో సంబంధం లేకుండా కుటుంబ సభ్యల సంఖ్య ఆధారంగా ఏడాదికి 6 నుంచి 10 గ్యాస్ సిలిండర్లు జనసేన ప్రభుత్వం ఉచితంగా అందిస్తుంది. రేషన్‌కి బదులుగా నెలకి రూ. 2500 నుంచి రూ. 3500 వరకు మహిళల ఖాతాల్లో జమచేస్తాం. ప్రతి కుటుంబానికి పది లక్షల రూపాయిల ఆరోగ్య భీమా కల్పిస్తాం. రోడ్ల పక్కన వ్యాపారాలు చేసుకునే చిరు వ్యాపారులకు రూ. 5000 నుంచి రూ. 10 వేల వరకు ఎలాంటి పూచీకత్తు లేకుండా పావలా వడ్డీ రుణాలు ఇస్తాం. ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రవేశ పరీక్షలకి ఏడాదికి ఒక్కసారి ఫీజు చెల్లిస్తే అది అన్నింటికీ వర్తించేలా చర్యలు తీసుకుంటాం. పరిశ్రమల ఏర్పాటుకు అవరోధాలు కల్పించే పరిస్థితులు రాయలసీమలో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్ని రూపుమాపేందుకు జనసేన పార్టీకి బలాన్ని ఇవ్వండి.
పారిశ్రామిక ప్రగతి అవసరం
జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాయలసీమని కరవు ప్రాంతంగా ప్రకటిస్తాం. పదేళ్ల పాటు ప్రత్యేక శ్రద్ద పెట్టి రూ. 50 వేల కోట్ల పెట్టుబడులు వచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. రాయలసీమ నుంచి వలసలు అరికడతాం. వలసలు అరికట్టాలంటే ఉద్యోగాలు రావాలి. ఉద్యోగాలు రావాలి అంటే పారిశ్రామిక ప్రగతి అవసరం. పవన్‌కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే ఉద్యోగాలు వస్తాయన్న నమ్మకంతో యువత ఉన్నారు. ప్రతి మీటింగ్‌లో ప్లకార్డులు కూడా ప్రదర్శిస్తున్నారు. మీ ఆశయం నెరవేరాలి అంటే స్థానికంగా బలమైన అభ్యర్ధులు గెలవాలి.
యువత ఓటుకి డబ్బులు తీసుకోదు
రాయలసీమ అంటే ఫ్యాక్షన్, వర్గ పోరాటాలు పెంచి పోషించే నాయకులే కాదు, శ్రీ ఎస్పీవై రెడ్డి లాంటి మంచివారు కూడా ఉన్నారు. కేవలం రూపాయికి పేద కడుపు ఆకలి తీరుస్తున్న వ్యక్తి ఆయన. ఎంతటి కీర్తి లేకపోతే మూడుసార్లు ఎంపిగా ఎన్నికయ్యారు. ఈ వయసులో నేను మా రాయలసీమకు, నంద్యాలకు అండగా ఉంటానంటూ జనసేన పార్టీలోకి వచ్చిన ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎంపిగా ఉన్నప్పుడు వంద శాతం నిధుల్ని ఆయన ప్రజల అవసరాలు తీర్చేందుకు వినియోగించారు. ప్రతి నియోజకవర్గానికి ఎస్పీవై రెడ్డి గారి లాంటి నాయకుల అవసరం ఉంది. యువతని ఆదుకోవాలన్న నా అశయాన్ని ముందుకు తీసుకువెళ్లాలంటే ఎస్పీవై రెడ్డి గారి అడుగుజాడల్లో ముందుకు వెళ్తున్న శ్రీధర్‌రెడ్డి లాంటి నాయకులకు మద్దతు పలకాల్సిన అవసరం ఉంది. అలాగే పాణ్యం, శ్రీశైలం, డోన్, బనగానపల్లెల్లో జనసేన, మిత్రపక్షాల తరఫున బరిలోకి దిగుతున్న అభ్యర్ధులను గెలిపించండి. యువతలో నాకు నచ్చిన అంశం ఓటు కోసం ఎవరి దగ్గరా డబ్బు తీసుకోరు. జనసేనకే మా ఓటు అని తెగేసి చెప్పేస్తారు. జాతీయ జెండా రెపరెపలు కొనసాగాలంటే డబ్బుకి లొంగని ఎన్నికల వ్యవస్థ కావాలి. జనసేన అభ్యర్ధుల్ని బలంగా అసెంబ్లీకి పంపితే 18 నెలల్లో రాయలసీమ సాగునీటి అవసరాలు, ఆరు నెలల్లో తాగునీటి అవసరాలు తీరుస్తాం. రాయలసీమని రతనాల సీమగా మారుస్తాం” అని మాటిచ్చారు.