పోలీస్‌స్టేషన్‌లోనే యువకుడిని చెప్పుతో కొట్టిన మహిళ
Spread the love

ఓ సినీ కో-ఆర్డినేటర్‌ తనపై లైంగిక దాడి చేశాడని ఆరోపిస్తూ ఓ జూనియర్‌ ఆర్టిస్ట్‌ పోలీస్‌స్టేషన్‌లోనే అతడిని  చెప్పుతో  కొట్టింది. ఆమెకు మద్దతుగా మరికొంతమంది మహిళలు నిలిచారు. బంజారాహిల్స్‌ ఠాణాలో పోలీసుల సమక్షంలోనే గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… ఇందిరానగర్‌కు చెందిన శ్రీశాంత్‌రెడ్డి సినీ కో-ఆర్డినేటర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి ఓ జూనియర్‌ ఆర్టిస్ట్‌తో పరిచయం అయింది. ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది. తనను బోరబండకు తీసుకెళ్లి కూల్‌డ్రింక్‌లో మత్తురసమిచ్చి అత్యాచారానికి పాల్పడటమే కాకుండా, ఆమె ఇంట్లోంచి నగలు, డబ్బుతో ఉడాయించి, ఆపై పెళ్లి చేసుకుంటానని నమ్మించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ కో-ఆర్డినేటర్‌ శ్రీశాంత్‌రెడ్డిని బాధితురాలు ఆరోపిస్తూ సోషల్‌ మీడియాలో పోస్టు చేసింది. దీనిపై బంజారాహిల్స్‌ పోలీసులకు గురువారం ఫిర్యాదు చేయనున్నట్టు వాట్సాప్‌ గ్రూప్‌లో పోస్ట్‌ చేసింది.

విషయం తెలుసుకున్న అతడు స్టేషన్‌కు వెళ్లాడు. జూనియర్‌ ఆర్టిస్ట్‌ తన పరువు తీసేలా సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తోందంటూ ఎస్‌ఐ వద్ద కూర్చొని ఫిర్యాదు రాస్తున్నాడు. ఇంతలో జూనియర్‌ ఆర్టిస్ట్‌, సినీనటి శ్రీరెడ్డి మరికొంతమంది మహిళలతో కలిసి పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. తనపై సినీ కో-ఆర్డినేటర్‌ లైంగిక దాడి చేశాడని ఫిర్యాదు చేసేందుకు వచ్చినట్టు పోలీసులకు తెలిపింది. పోలీసులు వివరాలు అడుగుతుండగానే మహిళలు శ్రీశాంత్‌రెడ్డిని చూశారు. అందరూ కలిసి మూకుమ్మడిగా అతడిపై దాడి చేశారు. జూనియర్‌ ఆర్టిస్ట్‌తోపాటు మిగతా వారు కూడా కొట్టారు. ఓ మహిళ ఎస్‌ఐ టేబుల్‌ పైకెక్కి చెప్పుతో దాడి చేసింది. పోలీసులు వారిని ఆపేందుకు ప్రయత్నించారు. శ్రీశాంత్‌రెడ్డికి రక్షణగా నిలిచారు. నేర నిర్ధారణ అయ్యే వరకు ఆగాలని సూచించారు.

కానీ మహిళలు ఊరుకోలేదు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దుర్భాషలాడి వారిపై కూడా చేయిచేసుకున్నారు. చివరకు పోలీసులు వారిని నిలువరించారు. స్టేషన్‌ నుంచి బయటకు వచ్చిన మహిళలు ధర్నాకు దిగారు. శ్రీశాంత్‌రెడ్డిని తమకు అప్పగించాలని కోరుతూ ఆందోళన చేశారు. స్టేషన్‌లోకి దూసుకువెళ్లేందుకు ప్రయత్నించారు.

సీఐ శ్రీనివాస్‌ మాట్లత్డుతూ ఫిర్యాదు ఇవ్వకుండా ఇలా దాడులకు పాల్పడటం చట్ట రిత్యా నేరము అని వారిని అడ్డుకున్నారు. జూనియర్‌ ఆర్టిస్ట్‌ పోలీసులకు ఫిర్యాదు చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. శ్రీశాంత్‌రెడి కూడా ఫిర్యాదు చేశాడు. లైంగిక దాడి విషయంలో కేసునమోదు చేసిన ఘటన బోరబండలో జరిగింది కాబట్టి సంజీవరెడ్డినగర్‌ పీఎస్‌కు కేసు బదిలీ చేయనున్నట్టు బంజారాహిల్స్‌ పోలీసులు తెలిపారు. స్టేషన్‌లో శ్రీశాంత్‌రెడ్డిపై దాడిచేసినందుకు, విధుల్లో ఉన్న పోలీసులపై దురుసుగా ప్రవర్తించినందుకు శ్రీరెడ్డితోపాటు మిగతా మహిళలపై కేసులు పెట్టేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. సీసీ ఫుటేజీని సేకరిస్తున్నారు.