యాపిల్‌, శామ్‌సంగ్‌ సంస్థలకు ఫేస్‌బుక్‌ యూజర్ల డేటా..!
Spread the love

అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్‌ కోసం పనిచేసిన కేంబ్రిడ్జ్‌ అనలిటికా అనే సంస్థ ఫేస్‌బుక్‌ నుంచి 8.7కోట్ల మంది యూజర్ల డేటాను దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలను ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ కూడా అంగీకరించారు. తమ వల్ల పొరబాటు జరిగిందని బహిరంగంగా క్షమాపణలు కూడా చెప్పారు. యూజర్ల వ్యక్తిగత డేటాను తెలుసుకునేందుకు దాదాపు 60 మొబైల్‌ తయారీ సంస్థలకు ఫేస్‌బుక్‌ యాక్సెస్‌ ఇచ్చినట్లు వార్తలు వెలువడుతున్నాయి. దీంతో ఫేస్‌బుక్‌ ప్రైవసీ ప్రొటెక్షన్‌ పాలసీలపై మళ్లీ ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఫేస్‌బుక్‌ తమ యూజర్ల డేటాను మొబైల్ తయారీ సంస్థలకు ఇస్తున్నట్లు అమెరికాకు చెందిన న్యూయార్క్‌ టైమ్స్‌ తమ కథనంలో పేర్కొంది. ఇందుకోసం యాపిల్‌, శామ్‌సంగ్‌, మైక్రోసాఫ్ట్‌, బ్లాక్‌బెర్రీ లాంటి 60 మొబైల్‌ తయారీ సంస్థలతో డేటా-షేరింగ్‌ పార్టనర్‌షిప్‌ను రూపొందించినట్లు తెలిపింది. దీని ద్వారా సదరు మొబైల్‌ తయారీ సంస్థలు ఫేస్‌బుక్‌ యూజర్లు, వారి స్నేహితుల వ్యక్తిగత డేటాను తెలుసుకోవచ్చని చెప్పింది. మెసేజింగ్‌, లైక్‌ బటన్, అడ్రస్‌బుక్‌ లాంటి ఫేస్‌బుక్‌ ఫీచర్లను తమ ఫోన్ల ద్వారా వినియోగదారులకు అందించేందుకు ఈ డేటా ఆయా మొబైల్‌ సంస్థలకు ఉపయోగపడుతోందని పేర్కొంది.

Facebook gave Acess of user data to Apple and Samsung Companies

‘యూజర్ల అనుమతి లేకుండా వారి వ్యక్తిగత, వారి స్నేహితుల డేటాను మొబైల్‌ కంపెనీలు తెలుసుకునేందుకు ఫేస్‌బుక్‌ అనుమతినిచ్చింది. యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని బయటివ్యక్తులతో పంచుకోమని చెప్పినప్పటికీ ఫేస్‌బుక్‌ ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించింది’ అని న్యూయార్క్‌ టైమ్స్‌ తన కథనంలో తెలిపింది. అయితే ఈ ఆరోపణలను ఫేస్‌బుక్‌ తోసిపుచ్చింది. తమ ప్రైవసీ పాలసీల్లో ఉన్న ప్రకారమే తాము నడుచుకుంటున్నట్లు చెబుతోంది.

‘యాప్‌ డెవలపర్లు మా ప్లాట్‌ఫాంను ఉపయోగించే విధానానికి భిన్నంగా ఈ పార్టనర్‌షిప్‌లు పనిచేస్తున్నాయి. యాప్‌ డెవలపర్ల మాదిరిగా కాకుండా.. మొబైల్‌ తయారీ సంస్థలు వారి వినియోగదారులకు మంచి పేస్‌బుక్‌ ఫీచర్లను అందించేందుకే ఈ డేటాను ఉపయోగించుకుంటున్నాయి’ అని ఫేస్‌బుక్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఐమీ ఆర్షిబాంగ్‌ చెప్పారు.

Leave a Reply