మరో వివాదంతో వార్తల్లోకెక్కిన ఫేస్‌బుక్‌…
Spread the love

కేంబ్రిడ్జ్‌ అనలిటికా వివాదం నాటి నుంచి ఫేస్‌బుక్‌ చిక్కుల్లో పడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఫేస్‌బుక్‌లో తలెత్తిన ఓ లోపం కారణంగా కొందరు హ్యాకర్లు యూజర్ల వ్యక్తిగత డేటాను హ్యాక్‌ చేశారు. తాజాగా ఫేస్‌బుక్‌ మరోసారి వార్తల్లోకెక్కింది. అది ఏంటంటే ఫేస్‌బుక్‌లో ఉన్న లోపం కారణంగా దాదాపు 68లక్షల మంది యూజర్ల ఫొటోలు ఓ థర్డ్‌పార్టీ అప్లికేషన్‌ ద్వారా బహిర్గతమయ్యాయి. దాదాపు 12 రోజుల పాటు ఈ బగ్‌ యాక్టివ్‌లో ఉందని, ప్రస్తుతం దాన్ని సరిచేసినట్లు ఫేస్‌బుక్‌ వెల్లడించింది. ఇందుకు గానూ యూజర్లకు క్షమాపణలు కూడా తెలిపింది.

సాధారణంగా ఫేస్‌బుక్‌ ఫొటోలను యాక్సెస్‌ చేసుకునేందుకు యూజర్లు యాప్‌లకు అనుమతి ఇచ్చినప్పుడు కేవలం యూజర్లు టైమ్‌లైన్‌లో షేర్‌ చేసిన‌ ఫొటోలను మాత్రమే యాక్సెస్‌ చేసుకునేందుకు మాత్రమే మేం వీలు కల్పిస్తాం. అయితే ఫేస్‌బుక్‌లో తలెత్తిన బగ్‌ కారణంగా మార్కెట్‌ప్లేస్‌ లేదా ఫేస్‌బుక్‌ స్టోరీస్‌లో షేర్‌ చేసిన ఫొటోలను కూడా యాప్‌లు యాక్సెస్‌ చేసుకోగలిగాయి అని సంస్థ ఇంజినీరింగ్‌ డైరెక్టర్‌ తోమర్‌ బార్‌ ఓ ప్రటకనలో వెల్లడించారు. సెప్టెంబరు 13 నుంచి 25 వరకు ఈ బగ్‌ యాక్టివ్‌లో ఉందని, ఆ సమయంలో దాదాపు 68లక్షల మంది యూజర్ల పోస్టు చేయని ఫొటోలు బహిర్గతమైనట్లు బార్‌ పేర్కొన్నారు. ఈ విషయమై ఇప్పటికే సదరు యూజర్లకు నోటిఫికేషన్‌ పంపించినట్లు తెలిపారు. బగ్‌ ప్రభావిత యూజర్ల ఫొటోలను ఫేస్‌బుక్‌ నుంచి డిలీట్‌ చేసే పనిలో ఉన్నట్లు ఆయన తెలిపారు.