ప్రతి రోజూ మిలియన్ల కొద్దీ ఫేస్‌బుక్‌ ఖాతాలు తొలగిస్తాము
Spread the love

ఇటీవల కేంబ్రిడ్జ్‌ అనలిటికా అక్రమంగా ఫేస్‌బుక్‌ యూజర్ల డేటాను పొందిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ పెద్ద ఎత్తున్న డేటా స్కాం విమర్శలు పాలైంది. ఈ స్కాండల్‌ అనంతరం ఫేస్‌బుక్‌ బిలియన్ల కొద్దీ మార్కెట్‌ విలువను కోల్పోయింది. తాము తప్పు చేసినట్టు జుకర్‌బర్గ్‌ సైతం ఒప్పుకుని, ఫేస్‌బుక్‌ యూజర్లకు క్షమాపణ చెప్పారు. ప్రస్తుతం ఆ తప్పును సరిదిద్దు​కోవడానికి ఫేస్‌బుక్‌ ప్లాట్‌ఫామ్‌ను అ‍త్యంత సురక్షితంగా రూపుదిద్దుతున్నారు.

డేటా లీక్‌ నేపథ్యంలో సోషల్‌ మీడియా దిగ్గజం  ఫేస్‌బుక్‌ భారీ ఎత్తున ఫేక్‌ అకౌంట్లను తొలగించింది. కేవలం మూడు నెలల్లోనే  ఈ ఖాతాలకు  చెక్‌ పెట్టింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో  58.3కోట్ల నకిలీ ఖాతాలను తొలగించినట్టు తెలిపింది.  అంతేకాదు  ఫేస్‌బుక్‌లో లక్షలాది నకిలీ ఖాతాలను రూపొందించే  పయత్నాలను నిరోధిస్తున్నామని వెల్లడించింది. భారీ  ఎత్తున డేటా బ్రీచ్‌ ఆరోపణలతో  యూజర్ల  గోప్యత ప్రశ్నార్థకంగా మారడంతో తన ఫ్లాట్‌పాంలో సెక్యూరిటీ అంశాలను సమీక్షిస్తోంది.

ఇందులో భాగంగా నకిలీ అకౌంట్లను ఏరివేసేందుకు సన్నద్ధమైంది. ఈ సమీక్షలో భాగంగా తొలి స్టేజీలో 200 యాప్స్‌ పై ఫేస్‌బుక్‌ వేటు వేసింది. యూజర్లకు చెందిన డేటాను దుర్వినియోగ పరిచారో లేదో తెలుసుకునే క్రమంలో 200 యాప్స్‌ను  సస్పెండ్‌ చేస్తున్నట్టు ఫేస్‌బుక్‌ ప్రొడక్ట్‌ పార్టనర్‌షిప్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఇమి ఆర్చిబాంగ్ తెలిపారు. ఈ విచారణలో భాగంగా వేలకొద్దీ యాప్స్‌ను ను పరిశీలిస్తున్నట్టు కూడా చెప్పారు.  యూజర్ డేటా దుర్వినియోగం విచారణలో భాగంగా తమ ప్లాట్‌ఫాంపై దాదాపు  200 యాప్స్‌ను తొలగించినట్టు  ప్రకటించిన ఫేస్‌బుక్‌  తాజాగా  ఈ చర్య తీసుకోవడం విశేషం.

2018 మొదటి మూడునెలల్లో 583 మిలియన్ల నకిలీ ఖాతాలను రద్దు చేసింది. ఈ మేరకు  ఫేస్‌బుక్‌  మంగళవారం ఒక ప్రకటన జారీ చేసింది.  లైంగిక వేధింపులు, హింసాత్మక చిత్రాలు, తీవ్రవాద ప్రచారాలు లేదా ద్వేషపూరిత ప్రసంగం  లాంటి కమ్యూనిటీ ప్రమాణాలను దృష్టిలోవుంచుకుని ఆయా ఖాతాలను డిలిట్‌ చేసినట్టు వెల్లడించింది. దీంతోపాటు  837 మిలియన్ల పోస్టులను తొలగించామని వివరించింది. కేంబ్రిడ్జ్ ఎనలిటికా డేటా  బ్రీచ్‌ కుంభకోణం తరువాత  ఫేస్‌బుక్‌ దిద్దుబాటు చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే.  ఈ నేపథ్యంలో ప్రతి రోజూ మిలియన్ల కొద్దీ  నకిలీ ఖాతాలను  నిరోధిస్తున్నట్టు చెప్పింది. అయినప్పటికీ  నకిలీ ప్రొఫైల్స్  బెడద భారీగా ఉందని చెప్పింది. ఇది యాక్టివ్‌ అకౌంట్లను 3-4 శాతం  ప్రభావితం చేస్తున్నట్టు పేర్కొంది.