గూగుల్‌పై భారీ జరిమానా….
Spread the love

అమెరికా టెక్నాలజీ దిగ్గజం, ఇంటర్నెట్ సెర్చింజన్ గూగుల్‌పై యూరోపియన్ యూనియన్  భారీ జరిమానా విధించింది. ఏకంగా 5 బిలియన్ డాలర్ల 4.34 బిలియన్ యూరోలు లేదా రూ.34,000 కోట్లు  ఫైన్ వేసింది. మార్కెట్‌లో తమ ఆధిపత్యం కొనసాగడానికి అక్రమ మార్గాలను గూగుల్ అనుసరించిందని సుధీర్ఘ విచారణ అనంతరం యూరోపియన్ కమిషన్ బుధవారం తేల్చింది. ఈయూ అవిశ్వాస నిబంధనలను మీరినందుకుగాను గూగుల్‌పై 4.34 బిలియన్ యూరోల జరిమానాను వేయాలని నిర్ణయించాం అని ఇక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో ఈయూ కాంపిటీషన్ కమిషనర్ మార్గ్‌రెథె వెస్టాగర్ ప్రకటించారు. గూగుల్ తమ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ను అక్రమంగా వినియోగించిందని పేర్కొన్నారు.

ఇంటర్నెట్ సెర్చ్‌లో ప్రస్తుత నెంబర్ 1 స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికే గూగుల్ అవినీతికి పాల్పడిందన్నారు. తమ సొంత సెర్చింజన్, బ్రౌజర్ల వినియోగానికి వీలుగా పావులు కదిపిందన్నారు. ప్రపంచ మొబైల్, టాబ్లెట్ మార్కెట్ లో దూసుకెళ్తు న్న సామ్‌సంగ్, హు వావీసహా పలు ప్రముఖ సంస్థలను తమ వెబ్ బ్రౌజర్ క్రోమ్, గూగుల్ సెర్చ్ యాప్ ప్రీ-ఇన్‌స్టాల్ కోసం బలవంతంగా ప్రేరేపించిందని స్పష్టం చేశారు. ప్లే యాప్ స్టోర్ అనుమతికి ప్రీ-ఇన్‌స్టాల్ తప్పనిసరి చేసిందన్నారు. ఈ రకమైన విధానాలు మార్కెట్లోని ఆపిల్ ఐవోఎస్, మైక్రోసాఫ్ట్ విండోస్ తదితర ప్రత్యర్థి సంస్థల నూతన ఆవిష్కరణలకున్న అవకాశాలను దెబ్బతీస్తాయని, ఫలితంగా వినియోగదారులు నష్టపోతారన్నారు. ప్రీ-ఇన్‌స్టలేషన్లతో ఈయూ దేశాల్లో అమ్ముడవుతున్న మొబైల్స్‌ల్లో గూగుల్ సెర్చ్, క్రోమ్ కీలకంగా మారిందని, యూజర్లకు అవితప్ప వేరే మార్గం లేకుండా పోయిందని కమిషన్ వ్యాఖ్యానించింది. కాగా, మూడేండ్లపాటు ఈ కేసు దర్యాప్తు జరుగగా, అమెరికా తమ దేశంలోకి దిగుమతి అవుతున్న యూరోపియన్ ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులపై సుంకాలు విధించిన నేపథ్యంలోనే తుది తీర్పు రావడం ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకున్నది.

గూగుల్‌ షాపింగ్‌ ఫైల్స్, ఆండ్రాయిడ్‌ దుర్వినియోగంపై జరిమానాలు పక్కన పెడితే.. యాడ్‌సెన్స్‌ అడ్వర్టైజింగ్‌ వ్యాపారంపై కూడా ప్రస్తుతం ఈయూ కమిషన్‌ విచారణ జరుపుతోంది. మరోవైపు, వివాదాస్పద డీల్‌తో ఎగవేసిన పన్నులకు సంబంధించి ఐర్లాండ్‌కు 13 బిలియన్‌ యూరోలు చెల్లించాలంటూ  2016లో యాపిల్‌ను ఈయూ కమిషన్‌ ఆదేశించింది. అటు అమెజాన్, ఫేస్‌బుక్, మైక్రోసాఫ్ట్‌లకు కూడా ఇలాంటి జరిమానాలు తప్పలేదు.