ఒక్కటైనా విరోధులు
Spread the love

కర్ణాటక హెచ్‌డీ కుమారస్వామి బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. కేంద్రంలో ఎన్డీయే కూటమికి వ్యతిరేకంగా విపక్షాల ఐక్యకూటమి వేసిన తొలి అడుగుగా భావిస్తున్న ఈ కార్యక్రమానికి కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, సోనియా సహా పలు రాష్ట్రాల సీఎంలు, ప్రాంతీయ పార్టీల అధినేతలు హాజరయ్యారు. కన్నడ సీఎం ప్రమాణ స్వీకారోత్సవం ప్రాంతీయ పార్టీల మేళాను తలపించింది. దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీయేతర పక్షంలో ఉన్న దాదాపు అన్ని పార్టీల నేతలు వేదికపై కనిపించారు. కర్ణాటక విధానసౌధ ఆవరణలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. సైద్ధాంతిక వైరుధ్యాలను పక్కనపెట్టి వీరంతా ఒకే వేదికను పంచుకున్నారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఆత్మీయ ఆలింగనాలు చేసుకున్నారు. సోనియా, మమతలు ఒకరినొకరు ప్రేమగా పలకరించుకోవడం, తేజస్వీ యాదవ్‌ మమత, మాయావతి, సోనియాల పాదాలకు నమస్కరించటం అందరి దృష్టిని ఆకర్షించాయి.

రాహుల్ను ప్రశంసించిన బాబు

ప్రమాణస్వీకారం పూర్తయ్యాక రాహుల్‌ దగ్గరికెళ్లిన చంద్రబాబు భుజం తట్టి అభినందించారు. చేయి కలిపి శుభాకాంక్షలు తెలిపారు. కర్ణాటకలో బీజేపీయేతర ప్రభుత్వ ఏర్పాటులో కాంగ్రెస్‌ కృషిని బాబు ప్రశంసించారు. సాధారణంగా రెండు వేళ్లు పైకెత్తి విక్టరీ సింబల్‌తో అభివాదం చేసే చంద్రబాబు.. ఈ వేదికపై మాత్రం చెయ్యి ఊపుతూ అభిమానులను పలకరించటం ఆసక్తిరేపింది. మమత, మాయావతి, అఖిలేశ్‌లతోనూ కబుర్లు చెప్తూ కనిపించారు. కార్యక్రమంలో చంద్రబాబు ఎక్కువసేపు మమతా బెనర్జీతో మాట్లాడుతూ కనిపించారు. మాజీ ప్రధాని, జేడీఎస్‌ చీఫ్‌ దేవెగౌడ వేదికపైకి వచ్చిన అతిథులకు స్వాగతం పలికారు.

హాజరైన ప్రముఖులు
కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్, యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా, ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి, పంజాబ్‌ సీఎం అమరీందర్,  ఏపీ సీఎం చంద్రబాబు, కేరళ సీఎం విజయన్, పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఎస్పీ చీఫ్‌ అఖిలేశ్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, సీపీఎం, సీపీఐల ప్రధాన కార్యదర్శులు ఏచూరి, సురవరం సుధాకరరెడ్డి, శరద్‌ యాదవ్, జార్ఖండ్‌ మాజీ సీఎం హేమంత్‌ సొరేన్, డీఎంకే నేత కనిమొళి, ఆర్‌ఎల్‌డీ చీఫ్‌ అజిత్‌ సింగ్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్, డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌ ఈ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ మంగళవారం సాయంత్రమే కుమారస్వామిని కలిసి అభినందించి వెళ్లారు.

వేదికపై అపురూప దృశ్యాలు

శరద్‌ పవార్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, సీతారాం ఏచూరి వేదిక చివర్లో కూర్చుని మాట్లాడుకోవటం, అఖిలేశ్, మాయావతిల కబుర్లు, మాయావతి, సోనియా ఆత్మీయ ఆలింగనం వంటి ఆసక్తికర దృశ్యాలన్నీ వేదికపై కనిపించాయి. ఈ ప్రాంతీయ పార్టీల నేతలంతా కార్యక్రమానికి ముందు.. ప్రమాణస్వీకారం తర్వాత ఆప్యాయంగా పలకరించుకున్నారు. ‘అన్ని ప్రాంతీయ పార్టీలతో మేం టచ్‌లో ఉంటాం. తద్వారా దేశాభివృద్ధికి, ప్రజాసంక్షేమానికి మేం కలిసి పనిచేసేందుకు వీలుంటుంది’ అని మమత అన్నారు.

ముభావంగా వజూభాయ్‌!
కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత నెలకొన్న పరిస్థితుల్లో బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించటం ద్వారా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న గవర్నర్‌ వజూభాయ్‌  వాలా కార్యక్రమంలో ముభావంగా కనిపించారు. కార్యక్రమం ముగిసిన వెంటనే వేదిక దిగి వెళ్లిపోయారు. కుమారస్వామి గవర్నర్‌కు వీడ్కోలు చెప్పలేదు.