ఆన్లైన్  షాపింగ్  చేసేటప్పుడు జాగ్రత్త సుమి !! !!
Spread the love

పండగల సీజన్‌ వచ్చేసింది. ఆన్‌లైన్‌లో పలు రకాల వెబ్‌సైట్‌లు డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లతో ఆకర్షిస్తుంటాయి. ఇటీవల ఆన్‌లైన్‌ షాపింగ్‌ చాలామందికి క్రేజీగా మారింది. బిజీలైఫ్‌లో సమయం లేక నట్టింట్లో కూర్చుని షాపింగ్‌ చేస్తుంటారు. పలు కంపెనీలు ఇస్తున్న ఈఎంఐ ఆఫర్స్‌ కోసం ఆన్‌లైన్‌ షాపర్స్‌ ఆసక్తి కనబరుస్తున్నారు. దసరా, దీపావళి పండగలను పురస్కరించుకుని ప్రముఖ ఈ–కామర్స్‌ వెబ్‌సైట్‌లు సరికొత్త ఆఫర్లు ప్రకటించనున్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండకపోతే ఆన్‌లైన్‌ వినియోగదారులు నష్టపోయే ప్రమాదం పొంచి ఉంది.

సాధారణంగా ఆన్‌లైన్‌ షాపింగ్‌ పండగల సమయాల్లో ఎక్కువగా జరుగుతుంటాయి. ఇదే సమయంలో హ్యాకర్స్‌ చేతివాటం ప్రదర్శిస్తుంటారు. ఆన్‌లైన్‌ షాపర్స్‌ను మాయ చేసి పేమెంట్‌ వివరాలను దొంగిలించే క్రమంలో హ్యాకర్లు రకరకాల ఎత్తుగడలతో ముందుకు వస్తున్నారు. తాజాగా వారు అనుసరిస్తున్న వ్యూహాల్లో ’ఫామ్‌జాకింగ్‌’ ఒకటి. ప్రముఖ సైబర్‌ సెక్యూరిటీ కంపెనీ నార్టాన్‌ వెల్లడించిన వివరాల ప్రకారం దసరా, దీపావళి పండగల రద్దీని పురస్కరించుకొని హ్యాకర్లు ఆన్‌లైన్‌ షాపర్స్‌గా మారి ‘ఫామ్‌జాకింగ్‌’ దాడులకు పాల్పడబోతున్నారు. ఈ ప్రమాదకర హ్యాకింగ్‌ దాడి నుంచి ఏ విధంగా బయటపడవచ్చనే దానిపై నార్టాన్‌ సెక్యూరిటీ రీసెర్చర్లు కొన్ని కీలక సూచనలు చేశారు.

ఇలా తస్కరణ…
’ఫామ్‌జాకింగ్‌’లో భాగంగా హ్యాకర్లు ఓ ప్రమాదకర జావా స్క్రిప్ట్‌ను ఈ–కామర్స్‌ వెబ్‌సైట్‌లకు సంబంధించిన చెక్‌ అవుట్‌ వెబ్‌ పేజీలలో లోడ్‌ చేస్తారు. దీంతో ఈ పేజీలలో ఎంటర్‌ కాగానే నగదుకు సంబంధించిన వివరాలు హ్యాకర్ల సర్వర్స్‌లోకి వెళ్లిపోతాయి. ఈ హ్యాకింగ్‌ ఉచ్చులో బ్రిటిష్‌ ఎయిర్‌వేస్, టికెట్‌ మాస్టర్‌ వంటి ప్రముఖ వెబ్‌సైట్‌లు చిక్కుకున్నాయి. పర్యవసానంగా 3.8 లక్షల యూజర్లకు సంబంధించిన క్రెడిట్‌ కార్డుల వివరాలు హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లిపోయాయి.

పాస్‌వర్డ్స్‌ ముఖ్యం…
’ఫామ్‌జాకింగ్‌’ దాడుల నుంచి ఆన్‌లైన్‌ అకౌంట్లను కాపాడుకునే క్రమంలో శక్తిమంతమైన, విభిన్నమైన పాస్‌వర్డ్‌లను సెట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎంపిక చేసుకునే పాస్‌వర్డ్‌లో అప్పర్‌కేస్, లోయర్‌ కేస్‌ సింబల్స్‌ ఇంకా నెంబర్స్‌ తప్పకుండా ఉండేలా చూసుకోవాలి. ఒకే రకమైన పాస్‌వర్డ్‌ను మల్టీపుల్‌ అకౌంట్‌లకు ఉపయోగించవద్దు.

అవి క్లిక్‌ చేయొద్దు…
పరిచయం లేని వ్యక్తుల నుంచి వచ్చే మెసేజెస్‌ లేదా అటాచ్‌మెంట్స్‌ను ఓపెన్‌ చేసే ముందు ఒకటికి రెండుసార్లు క్రాస్‌ చెక్‌ చేసుకోవాలి. ఇదే సమయంలో ర్యాండమ్‌ లింక్స్‌పై క్లిక్‌ చేయొద్దు. సైబర్‌ నేరగాళ్లు మీ మిత్రులకు చెందిన ఈ–మెయిల్‌ లేదా సోషల్‌ మీడియా అకౌంట్స్‌ ద్వారా కూడా మాలీషియస్‌ లింక్స్‌ను పంపించే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా వెబ్‌ లింక్‌పై క్లిక్‌ చేసే ముందు ఒకటికి రెండుసార్లు చెక్‌ చేసుకోవటం మంచిది.

వైర్‌లెస్‌ కనెక్షన్స్‌తో జాగ్రత్త…
కొత్త నెట్‌వర్క్‌ కనెక్టెడ్‌ డివైస్‌ను ఇన్‌స్టాల్‌ చేస్తున్నపుడు డీఫాల్ట్‌ పాస్‌వర్డ్‌ను కొత్త పాస్‌వర్డ్‌తో అప్‌డేట్‌ చేసుకోవాలి. ఇదే సమయంలో మీ వైర్‌లెస్‌ కనెక్షన్‌లను శక్తిమంతమైన పాస్‌వర్డ్‌లతో ప్రొటెక్ట్‌ చేసుకోవడం ఎంతో మంచిదని రీసెర్చర్స్‌ సూచిస్తున్నారు.