కరుణానిధి ఆరోగ్యంపై గందరగోళం
Spread the love

డీఎంకే అధినేత ఎం.కరుణానిధి ఆరోగ్యంపై రకరకాల వార్తలు వెలువడుతుండడంతో రాష్ట్ర ప్రజల్లో ఉద్వేగం, డీఎంకేలో ఉద్రేకం, ఆవేదన వ్యక్తమవుతున్నాయి.ఆదివారం ఉదయం నుంచి రకరకాల వార్తలతో కావేరీ ఆస్పత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తీవ్ర జ్వరం, మూత్రనాళంలో ఇన్పెక్షన్‌ కారణంగా మూడు రోజుల క్రితం స్థానిక ఆళ్వారుపేటలోని కావేరీ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆయన కోలుకుంటున్నట్టు ఆస్పత్రి వర్గాలు చెబుతూ వచ్చాయి. ఈ సమయంలో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పరామర్శతో విడుదలైనఫొటో ఆ కరుణ సేనల్లో ఆనందాన్ని నింపింది. సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా తమ ముందుకు అధినేత వస్తారన్న ఆశాభావంతో కరుణ వర్ధిలాల్లి అన్న నినాదాల్ని మార్మోగింది. సాయంత్రం వరకు ఉన్న ఈ ఆనందం రాత్రి 9గంటల సమయంలో ఒక్కసారిగా మారింది. ఉత్కంఠ భరిత వాతావరణం నెలకొనడంతో కరుణ ఆరోగ్యం విషమించిందా? అన్న ఆందోళన నెలకొంది. ఇందుకు తగ్గట్టుగా కుటుంబసభ్యులు అందరూ ఆస్పత్రికి చేరుకోవడంతో అనుమానాలు బయలుదేరాయి. చివరకురాత్రి 9.50 గంటలకు ఆస్పత్రి వర్గాలు బులిటెన్‌ విడుదల చేయడంతోఉత్కంఠకు తెరపడింది. వెంకయ్య నాయుడు, గవర్నర్‌ బన్వరిలాల్‌ పురోహిత్, కేంద్ర సహాయ మంత్రి పొన్‌ రాధాకృష్ణన్, మత్స్యశాఖ మంత్రి జయకుమార్‌ కావేరి ఆస్పత్రికి వచ్చారు. డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, ఎంపీ కనిమొళిలతో వెంకయ్య నాయుడు కాసేపు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కరుణ ఆరోగ్యం గురించి వైద్యులు ఆయనకు వివరించారు. అలాగే, స్టాలిన్, కనిమొళి, కరుణ సతీమణి రాజాత్తి అమ్మాల్‌లతో కలసి ఐసీయూలోకి వెంకయ్య నాయుడు, బన్వరిలాల్‌ వెళ్లి మరీ కరుణానిధిని పరామర్శించారు.