స్వాతంత్య్రం వచ్చి ఇన్ని రోజులైనా బాల్యం మాత్రం బడి బయటే !!
Spread the love

సాధారణంగా పిల్లలు అంటే పలకా, బలపం పట్టాలి కానీ పలుగూ, పారా పట్టి బండెడు చాకిరీ చేస్తున్నారు.. ఆటపాటలతో కాలం వెళ్లదీయాల్సిన పసి మొగ్గలు రెక్కలు ముక్కలు చేసుకుంటున్నారు.. పేదరికాన్ని ఆసరా చేసుకొని వెట్టిచాకిరీ చేయిస్తుండటంతో భవిత అంధకారమవుతోంది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇటుక బట్టీల్లో పని చేస్తున్న బాల కార్మికుల వ్యథలు అన్నీ ఇన్నీ కావు. చిన్న వయసులో పుట్టెడు కష్టాన్ని చేయలేక అప్పుడప్పుడూ తడబడితే యజమానులు వేసే శిక్షలతో బతుకును భారంగా వెళ్లదీస్తున్నారు. బాలల హక్కులు, చట్టాలు వీరి విషయంలో వర్తించడం లేదు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన ఉపన్యాసాలకే పరిమితమవుతోంది. బాలల దినోత్సవం సందర్భంగా జిల్లాలోని ఇటుక బట్టీల్లో పని చేస్తున్నారు. ఇటుకబట్టీలు నిర్వహించే ప్రాంతంలోనే గుడిసెలు వేసుకొని జీవిస్తున్నారు. వీరికి నెలకు రూ.5 వేల నుంచి రూ.7 వేలు కేటాయించి బండెడు చాకిరీ చేయిస్తున్నారు. స్థానిక కూలీలకు ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని బట్టీల యజమానులు ఒడిశాకు వెళ్లి అక్కడివారికి రూ.10 వేలు ఒకేసారి చెల్లించి ఏకంగా 12 నుంచి 16 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలను తెచ్చుకుంటున్నారు. ఏళ్లకు ఏళ్లు వారితో నిరంతరం పని చేయించుకుంటూ లాభాలు గడిస్తున్నారు. ముందుజాగ్రత్తగా వారి తల్లిదండ్రుల నుంచి ఒప్పంద హామీ పత్రాలను బలవంతంగా రాయించుకుంటూ చట్టాలతో ఆటలాడుకుంటున్నారు.

సాధారణంగా 18 సంవత్సరాల్లోపు బాల, బాలికల రక్షణకు బాలల న్యాయ చట్టం-2000 ప్రకారం దేశమంతటా సమగ్ర బాలల పరిరక్షణ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అంతేకాకుండా వీరి సంరక్షణ కోసం బాలకార్మికుల నిషేధ చట్టం-1986, బాలల హక్కుల పరిరక్షణ చట్టం-2005 వంటి చట్టాలు కాగితాలకే పరిమితమవుతున్నాయి. పని చేయడం లేదనే అక్కసుతో యజమానులు బాలలను హింసించే తీరు హృదయవిదారకంగా ఉంటోంది. 14 సంవత్సరాల్లోపు బాలలను ఇంట్లోవారైనా, బయటి వ్యక్తులైనా పనులు చేయిస్తే బాలకార్మిక చట్టాల ప్రకారం 2 సంవత్సరాల జైలు శిక్ష, రూ.50 వేల జరిమానా విధిస్తారు. వారిని యజమానులు శారీరకంగా గాయపరిస్తే 6 నెలల జైలు, నగదు జరిమానా విధించాలి. ఇన్ని చట్టాలు ఉన్నా ఏ ఒక్కటి సరిగ్గా అమలు కావడం లేదు. బాలల రక్షణకు ప్రభుత్వం శిశు సంక్షేమ శాఖ, కార్మిక శాఖ, బాలల సంక్షేమ కమిటీ, పోలీస్‌ శాఖలు ఎన్ని ఉన్నా ఎవరికి వారే అన్న చందంగా మారింది. బాలల హక్కులు కదా ఫలానా శాఖ చూసుకుంటుందిలే అంటూ నిర్లక్ష్యంగా మిన్నకుండిపోతున్నారు. ఇక్కడ పిల్లలు పని చేస్తున్నారని తెలిసినా కనీసం విద్యాశాఖ అధికారులు బడిబాట సందర్భంగా వీరిని బడికి తీసుకెళ్లిన సందర్భాలూ ఎక్కడ కనిపించడం లేదు.