ఇక ఆధార్‌ తప్పనిసరి కాదు!
Spread the love

మొబైల్‌ ఫోన్‌ కనెక్షన్లు పొందేందుకు, బ్యాంకు ఖాతాలను తెరుచుకునేందుకు ఇక ఆధార్‌ తప్పనిసరికాకపోవచ్చు. ధ్రువీకరణ నిమిత్తం దీనిని స్వచ్ఛందంగానే సమర్పించుకునేందుకు వీలు కల్పించే ‘ఆధార్‌-ఇతర చట్టాల సవరణ బిల్లు-2018’ను బుధవారం కేంద్ర న్యాయ, ఐటీశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. దీని ప్రకారం- ఆధార్‌ లేదని బ్యాంకు ఖాతాలు, సిమ్‌ కార్డుల జారీకి ఆయా సంస్థలు నిరాకరించడం కుదరదు. ఇందుకు అనుగుణంగా ఆధార్‌, టెలికాం, బ్యాంకింగ్‌ నియంత్రణ చట్టాలకు ఈ బిల్లులో సవరణలను ప్రతిపాదించారు. వినియోగదారుడు క్యూఆర్ కోడ్ ద్వారా ఆఫ్‌లైన్ వెరిఫికేషన్‌ను ఎంపికచేసుకోవచ్చు. తాజా మార్పులకు సంబంధించిన ముసాయిదా బిల్లును శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.

ఆధార్‌ చట్టాన్ని అతిక్రమించే సంస్థలపై రూ.కోటి వరకూ, అదే తప్పులను పునరావృతం చేసిన పక్షంలో రోజుకు రూ.10 లక్షల వరకూ జరిమానా పడుతుందని ఈ బిల్లులో ప్రభుత్వం పేర్కొంది. వ్యక్తిగత గుర్తింపు సమాచారాన్ని అనధికారికంగా ఉపయోగించే వ్యక్తులకు మూడేళ్ల వరకూ జైలు శిక్ష, రూ.10 వేల వరకూ జరిమానా; అదే సంస్థలకైతే రూ.లక్ష వరకూ జరిమానా తప్పదు. ఆధార్‌ వ్యవస్థలోకి అనధికారికంగా చొరబడి, మార్పులు చేర్పులకు పాల్పడితే ప్రస్తుతమున్న మూడేళ్ల జైలు శిక్షను పదేళ్లకు పొడిగించే అవకాశం ఉంది. వ్యక్తుల అనుమతి లేకుండా వారి ఆధార్‌ సంఖ్యలను ఆఫ్‌లైన్‌లో పరిశీలించడాన్ని నిషేధించనున్నట్లు బిల్లులో ప్రభుత్వం పేర్కొంది.