ఉత్కంత రేపుతున్నఉప ఎన్నికల ఫలితాలు…యూపీలో బీజేపీ వెనుకంజ
Spread the love

దేశవ్యాప్తంగా నాలుగు లోక్‌సభ స్థానాలు, 9 శాసనసభ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు‌ కొనసాగుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని కైరానా, నూర్‌పూర్‌ నియోజవవర్గాలతో పాటు నాగాలాండ్‌ లోక్‌సభ స్థానానికి, మహారాష్ట్రలోని పాల్‌ఘర్‌, భండారా-గోండియా లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి.

మేఘాలయలోని అంపతి, ఝార్ఖండ్‌లోని గోమియా, సిల్లి, పశ్చిమబెంగాల్‌లోని మహేస్థల, బిహార్‌లోని జోకిఖాట్‌, కర్ణాటకలోని రాజరాజేశ్వరి నగర్‌, పంజాబ్‌లోని షాకోట్‌, కేరళలోని చెన్‌గన్నూర్‌ శాసనసభ స్థానాలకూ ఉప ఎన్నికలు జరిగాయి.

* ఉత్తరప్రదేశ్‌లోని కైరానా నియోజకవర్గంలో భాజపా వెనుకంజలో ఉంది. ఇక్కడ రాష్ట్రీయ లోక్‌దళ్‌(ఆర్‌ఎల్‌డీ) అభ్యర్థి తబస్సుమ్‌ హసమ్‌ ముందంజలో ఉన్నారు. భాజపా ఎంపీ హుకుమ్‌ సింగ్‌ మరణంతో కైరానా నియోజవకర్గం ఖాళీ అవ్వగా ఉప ఎన్నిక నిర్వహించారు. భాజపా తరఫున హుకుమ్‌ సింగ్‌ కుమార్తె మృగాంక సింగ్‌ పోటీ చేశారు. అయితే ఇక్కడ భాజపా వెనుకంజలో ఉండడం రాష్ట్రంలోని భాజపా ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితి. ఆర్‌ఎల్‌డీ అభ్యర్థి తబస్సుమ్‌ హసమ్‌కు ఎస్పీ, బీస్పీ, కాంగ్రెస్‌ పార్టీలు కూడా మద్దతిస్తున్నాయి. నూర్‌పూర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో సమాజ్‌వాదీ పార్టీ ముందంజలో ఉంది. ఇది కూడా గతంలో భాజపా స్థానమే.

*మహారాష్ట్రలోని పాల్‌ఘర్‌ లోక్‌సభ నియోజకవర్గంలో భాజపా ముందంజలో ఉంది. బహుజన్‌ వికాస్‌ అఘాది పార్టీ అభ్యర్థి రెండోస్థానంలో ఉండగా, శివసేన మూడో స్థానంలో కొనసాగుతోంది. మరో లోక్‌సభ స్థానం భండారా-గోండియాలోనూ భాజపా ముందంజలో ఉంది. పలుస్‌ కడేగావ్‌ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్‌ విజయం సాధించింది.

* కర్ణాటకలోని రాజరాజేశ్వరి నగర్‌ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్‌ ముందంజలో కొనసాగుతోంది. కాంగ్రెస్‌ అభ్యర్థి మునిరతన్‌కు ఇప్పటికి సుమారు 16వేల ఓట్లు పోలవగా రెండో స్థానంలో ఉన్న భాజపా అభ్యర్థి మునిరాజు గౌడకు 7వేలకు పైగా ఓట్లు పోలయ్యాయి.

* పంజాబ్‌లోని షాకోట్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ ముందంజలో ఉంది. అకాళీ దళ్‌ వెనుకబడి పోయింది.

* ఝార్ఖండ్‌లోని గోమియా అసెంబ్లీ నియోజకవర్గంలో భాజపా అభ్యర్థి ముందంజలో ఉన్నారు. సిలి అసెంబ్లీ స్థానంలో ఏజేఎస్‌యూ లీడింగ్‌లో ఉంది.

* కేరళలోని చెన్‌గన్నూర్‌ అసెంబ్లీ స్థానంలో సీపీఎం ఆధ్వర్యంలోని ఎల్‌డీఎఫ్‌ ముందంజలో ఉంది. రెండో స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థి ఉన్నారు.

*బిహార్‌లోని జోకిఖాట్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆర్జేడీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు.

*పశ్చిమ్‌బంగాలోని మహేస్థల అసెంబ్లీ స్థానంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ముందంజలో కొనసాగుతున్నారు.

* నాగాలాండ్‌ లోక్‌సభ స్థానంలో ఎన్డీపీపీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు.

*మేఘాలయలోని అంపతి అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్‌ పార్టీ లీడింగ్‌లో ఉంది.

* ఉత్తరాఖండ్‌లోని థరాలి అసెంబ్లీ నియోజకవర్గంలో భాజపా ముందంజలో ఉంది.