ఒక్క ఎమ్మెల్యే ఖరీదు 100 కోట్లు మాత్రమే..
Spread the love

తమ ఒక్కో ఎమ్మెల్యేలకు రూ.100 కోట్లు, క్యాబినెట్‌ మంత్రి పదవి ఇస్తామంటూ బీజేపీ ఆఫర్‌ చేస్తున్నదని జేడీఎస్‌ నేత కుమారస్వామి సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికల తర్వాత ప్రభుత్వ ఏర్పాటు కోసం ఎవరితో పొత్తు పెట్టుకోబోమని చెప్పిన బీజేపీ.. ఇప్పుడు చేస్తున్నదేంటని విమర్శించారు. దీనిపై బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. సరైన మెజార్టీ లేకుండానే గవర్నర్‌ బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడమేంటని ఆయన ప్రశ్నించారు.

117 ఎమ్మెల్యేల మద్దతు ఉన్నందున ప్రభుత్వ ఏర్పాటుకు తమకే అనుమతివ్వాలని జేడీ(ఎస్‌) శాసనసభాపక్ష నేత కుమారస్వామి గవర్నర్‌ వాజూభారు వాలాను కలిసి విన్నవించారు. కాంగ్రెస్‌, జేడీ(ఎస్‌) ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను ఆయన.. గవర్నర్‌కు సమర్పించారు.కానీ, చివరకు బీజేపీకి అనుకూలంగా గవర్నర్‌ నిర్ణయం తీసుకున్నాడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీ శాసనసభాపక్ష నేత యడ్యూరప్పను గవర్నర్‌ వాజూభారు వాలా ఆహ్వానించారు. యడ్యూరప్ప సర్కారు.. 15 రోజుల్లోగా బల నిరూపణ చేసుకోవాల్సి ఉంది. బల పరీక్షలో నెగ్గాలంటే బీజేపీ ప్రభుత్వానికి 113 మంది ఎమ్మెల్యేలు మద్దతు కావాలి. 104 మంది ఎమ్మెల్యేలనే కలిగి ఉన్న బీజేపీ.. ఇప్పుడు బల పరీక్ష నెగ్గడానికి బయటివారిని తమ వైపునకు తిప్పుకునే చర్యలు ముమ్మరం చేసినట్టు సమాచారం.

ప్రస్తుత బీజేపీ ప్రభుత్వ హయాంలో నియమితులైన రాష్ట్రాల గవర్నర్లు ఇప్పటి వరకూ ఎన్నికల అనంతరం మెజార్టీ సాధనకు ఆయా పార్టీల మధ్య కుదిరిన సయోధ్య ఆధారంగా ప్రభుత్వ ఏర్పాటు కు ఆహ్వానించారు. గత ఏడాది మార్చిలో మొత్తం 40 మంది సభ్యులున్న గోవా అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 17, బీజేపీకి 13 స్థానాలు లభించినప్పటికీ, ఇతర పార్టీలతో ఎన్నికల అనంతర సయోధ్య కుదుర్చుకున్న బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారని పొలిట్‌బ్యూరో తన ప్రకటనలో గుర్తు చేసింది. అదే విదంగా మణిపూర్‌ ఎన్నిక ల్లో కాంగ్రెస్‌కు 28, బీజేపీకి 21 స్థానాలు లభించినప్పటికీ, ఎన్నికల అనంతర పొత్తు ఆధారంగా ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీకే తొలి అవకాశం ఇచ్చారు, అలాగే ఈ ఏడాది మార్చిలో జరిగిన మేఘాలయ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 21 స్థానాలు, బీజేపీకి రెండు స్థానాలు మాత్రమే లభించినప్పటికీ గవర్నర్‌ ఎన్నికల అనంతర పొత్తుతో మెజార్టీ సాధించిన బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో తన ప్రకటనలో తెలిపింది.

కర్ణాటక రాజకీయ పరిణామంపై గోవా కాంగ్రెస్ మండిపడుతోంది. కర్ణాటకలో వర్తించిన నిబంధన తమకు ఎందుకు వర్తింపజేయలేదని గోవా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు.గోవాలో కాంగ్రెస్‌కు చెందిన 17 మంది ఎమ్మెల్యేలు రేపు రాజ్‌భవన్‌కు వెళ్లి.. తమది కూడా అతిపెద్ద పార్టీనేనని.ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాలని గవర్నర్‌ను కోరనున్నారు.గోవా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శుక్రవారం రాజ్‌భవన్ వరకూ మార్చ్ నిర్వహించనున్నారు. ఇదిలా ఉంటే, బీహార్‌లో కూడా సేమ్ సీన్ కనిపిస్తోంది. అత్యధిక సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా ఉన్న తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆదేశించాలని గవర్నర్‌ను కోరనున్నట్లు లాలూ తనయుడు, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ట్వీట్ చేశారు.