ఇక మిగిలింది తెలుగు రాష్ట్రాలు మాత్రమే..!
Spread the love

బీజేపీకి దక్షిణాదిలో తొలి లక్ష్యం నెరవేరింది. కర్నాటకను గెలుచుకొని, జేడీఎస్‌ మద్దతు లేకుండానే సర్కారును ఏర్పాటు చేయగలిగే సామర్థ్యం సాధించింది. ఈ పార్టీ తరువాతి లక్ష్యం రెండు తెలుగు రాష్ట్రాలు. ఇప్పటికే  ముఖ్యమంత్రులు కేసీఆర్‌, చంద్రబాబు నాయుడుకు దిమ్మ తిరిగిపోయి నోట మాట రాక అవాక్కైవుండొచ్చు. కర్నాటకలో బీజేపీ విజయం కేసీఆర్‌ కంటే చంద్రబాబుకు ఎక్కువ షాక్‌.

అక్కడ వంద శాతం బీజేపీ ఓడిపోతుందనే విశ్వాసంతో ఉన్నారాయన. టీడీపీ నేతలు భారీగా ప్రచారం చేశారు కూడా. కేసీఆర్‌ చంద్రబాబంత షాక్‌ తినకపోయుండొచ్చు. ఆయనకు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం, విడిపోవడంవంటి జంజాటాలు లేవు.  కర్నాటక విజయం ప్రభావం తెలుగు రాష్ట్రాలపై తప్పనిసరిగా పడుతుందా? అక్కడ జరిగినట్లే ఈ రాష్ట్రాల్లోనూ జరుగుతుందా? జరగదనే చెప్పొచ్చు.

కర్నాటకలో బీజేపీ అధికారంలోకి రాబోతుండటం ఇదే మొదటిసారి కాదు. గతంలో పరిపాలించిన చరిత్ర ఉంది. త్వరలో ముఖ్యమంత్రి కాబోయే బీఎస్‌ ఎడ్యూరప్ప గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొని, చివరకు క్లీన్‌ చిట్‌తో బయటపడ్డారు. కాని తెలుగు రాష్ట్రాల్లో కమలం పార్టీకి అధికార చరిత్ర లేదు. దానికి కొంత బలం ఉంటే గింటే తెలంగాణలో ఉందిగాని, ఆంధ్రాలో లేదు. గత ఎన్నికల్లో టీడీపీతో పొత్తు కారణంగా అధికారంలో భాగస్వామి కాగలిగింది. రేపటి నుంచి ఈ రెండు రాష్ట్రాల్లో ఏం జరగబోతుంది? ఇదే ఇప్పుడు కీలక ప్రశ్న.

కర్నాటక ఫలితాల తరువాత చంద్రబాబుకు చుక్కలు చూపిస్తామని రాష్ట్ర బీజేపీ నేతలు సవాల్‌ చేశారు. కర్నాటకలో విజయం సాధించకపోయినా ఆ పని జరుగుతుందన్నట్లుగా మాట్లాడారు. ఇప్పుడు విజయం సిద్ధించింది కాబట్టి, కేంద్ర, రాష్ట్ర నాయకులు బాబు పని పట్టేందుకు రంగంలోకి దిగుతారేమో…! ఇక కర్నాటక ఫలితాలకు ఒక్కరోజు ముందు రాష్ట్ర అధ్యక్షుడిగా వలస నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ నియామకం పార్టీలో పెనుదుమారం రేపింది. ఎన్నికల నిర్వహణ కమిటీ కన్వీనర్‌గా నియమితుడైన సోము వీర్రాజు వీరంగం వేశారు. కాని నిన్న రాత్రికల్లా దుమారం తగ్గిపోయింది. ఇప్పుడు విజయభేరీ మోగింది కాబట్టి ఎవ్వరూ నోరెత్తేందుకు అవకాశం లేదు. అధ్యక్షుడు కావాలనే కన్నా కోరిక నెరవేరినా, ప్రస్తుతం విజయంతో ఆయనపై  పెనుభారం పడిందనే చెప్పాలి.

తెలుగు రాష్ట్రాల్లో సాధ్యమైనంత ఎక్కువమంది నేతలను ఇతర పార్టీల నుంచి పట్టుకురావాలని జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ఆదేశించారు. త్వరలోనే  తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తారని నేతలు చెబుతున్నారు. బీజేపీ బలం, అధికార పార్టీలతో సహా ఇతర పార్టీల బలాలు ఎలావున్నాయో నివేదికలు ఇవ్వాలన్నారు. ఎస్టీ, ఎస్సీ నియోజకవర్గాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు

కేసీఆర్‌, చంద్రబాబు బీజేపీ దూకుడుకు ఎలా అడ్డుకట్ట వేస్తారు? ఏపీలో చంద్రబాబు బీజేపీకి పూర్తి వ్యతిరేకంగా ఉన్నట్లు స్పష్టంగా కనబడుతోంది. ప్రజల్లోనూ ఆ పార్టీ పట్ల వ్యతిరేకత ఉంది. కాని తెలంగాణ సీఎం కేసీఆర్‌ కమలం పార్టీకి అప్రకటిత మిత్రుడిగా ఉన్నారంటున్నారు. ఆయన ఫెడరల్‌ ఫ్రంట్‌ ప్రయత్నాలు కూడా బీజేపీకి అనుకూలంగానే ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.

ఫ్రంట్‌పై చర్చలు జరపడానికి కాంగ్రెసు (యూపీఏ) అనుకూల పార్టీలనే కలిశారు తప్ప, ఎన్‌డీఏలోని పార్టీలను కలుసుకోలేదనే విమర్శ ఉంది. ఈ వైఖరి అనుమానాలకు తావిస్తోంది. తెలంగాణ బీజేపీ మాత్రం కేసీఆర్‌ను ప్రత్యర్థిగానే చూస్తోంది. ఆయన్ని ఓడించి తీరుతామంటోంది. కర్నాటకలో కమలం విజయం తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.