ఇకపై మొబైల్ ఫోన్ నుంచే పాసుపోర్టు దరఖాస్తు చేసుకోవచ్చు.
Spread the love

పాస్‌పోర్టు దరఖాస్తు ప్రక్రియ మరింత సులభతరమైంది. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ ప్రారంభించిన ‘పాస్‌పోర్టు సేవా యాప్‌’ ద్వారా ఇకపై మొబైల్‌ ఫోన్‌ నుంచే దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ యాప్‌లో దరఖాస్తు ఫారాన్ని నింపి.. పాస్‌పోర్టు సేవా కేంద్రాన్ని సందర్శించే తేదీ, సమయాన్ని ఎంచుకుని, అప్‌లోడ్‌ బటన్‌ నొక్కితే చాలు. నిశ్చింతగా.. అనుకున్న సమయానికి పాస్‌పోర్టు కార్యాలయానికి వెళ్లి.. ధ్రువపత్రాల పరిశీలన, ఫొటో దిగే తంతును పూర్తిచేయొచ్చు. దీంతోపాటు..ఒక ప్రాంతంలో నివసించే పౌరుడు.. దేశంలోని ఏ పాస్‌పోర్టు సేవా కేంద్రం నుంచైనా దరఖాస్తు చేసుకోవచ్చు.

మంగళవారం ‘6వ పాస్‌పోర్టు దివస్‌’ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశం అనంతరం సుష్మా స్వరాజ్‌ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ మార్పులను ఆమె ‘పాస్‌పోర్టు విప్లవం’గా అభివర్ణించారు. ఇకపై పాస్‌పోర్టు దరఖాస్తుకు వివాహ ధ్రువీకరణ పత్రం అవసరం లేదని పేర్కొన్నారు. ‘వితంతువుల విషయంలోనూ ఆ నిబంధన వర్తించదు. విడాకులు తీసుకున్న దంపతులు తమ పూర్వ భాగస్వామి వివరాలు తెలియపర్చాల్సిన అవసరం లేదు. ఇక వారి పిల్లలు కేవలం తల్లి లేదా తండ్రి పేరును పాస్‌పోర్టు దరఖాస్తులో పేర్కొనవచ్చు’ అని వివరించారు.

మొబైల్యాప్‌: పాస్‌పోర్టు సేవా యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్న వారు.. అందులోని నిర్ణీత ఫారాన్ని పూర్తి చేసి, అప్‌లోడ్‌ బటన్‌ నొక్కితే చాలు.. సంబంధిత పాస్‌పోర్టు సేవా కేంద్రం అధికారులకు దరఖాస్తు చేరుతుంది. ఈ యాప్‌లో పాస్‌పోర్టు తత్కాల్‌, జనరల్‌ ఫీజులను చెల్లించడం.. విద్యార్హత, నివాస, వయోధ్రువీకరణ పత్రాలను అప్‌లోడ్‌ చేయవచ్చు.

ఎక్కడి నుంచైనా దరఖాస్తుఈ ప్రక్రియలో ఒక పౌరుడు దేశంలోని ఏ కేంద్రం నుంచైనా పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఉదాహరణకు.. ఢిల్లీకి చెందిన వ్యక్తి హైదరాబాద్‌లో తాత్కాలికంగా నివసిస్తున్నట్లయితే.. సికింద్రాబాద్‌లోని ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయంలో లేదా..బేగంపేట, టోలిచౌకీల్లోని పాస్‌పోర్టు సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అవసరాన్ని బట్టి ఢిల్లీ పోలీసులు వెరిఫికేషన్‌ వివరాలను హైదరాబాద్‌ అధికారులకు అందజేస్తారు.