అక్షత్‌.. అదరగొట్టాడు!
Spread the love

కోల్‌కతాకు చెందిన డాన్సింగ్‌ స్టార్‌ 14 ఏళ్ల అక్షత్‌ సింగ్‌ మరోసారి వార్తల్లో నిలిచాడు. అద్భుత ప్రదర్శనతో అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకున్నాడు. టీవీల్లో డాన్స్‌ కార్యక్రమాలు వీక్షించే వారికి అక్షత్‌  సుపరిచితుడు. ఇండియా’స్‌ గాట్‌ టాలెంట్‌ టీవీ షోలో సల్మాన్‌ ఖాన్‌ పాటకు అతడు చేసిన డాన్స్‌ వీడియో వైరల్‌ కావడంతో 2014లో అక్షత్‌ పేరు మార్మోగిపోయింది. దాంతో అతడికి పలు టీవీ షోల్లో పాల్గొనే అవకాశాలు దక్కాయి. తాజాగా బ్రిటన్స్‌ గాట్‌ టాలెంట్‌ షోలో అక్షత్‌ అదరగొట్టాడు. తన డాన్స్‌, హావభావాలతో అందరినీ మంత్రముగ్ధులను చేశాడు. జడ్జిలతో పాటు ప్రేక్షకులంతా లేచి నిలబడి కరతాళ ధ్వనులతో అతడిని ప్రశంసించారు. కుమారుడి ప్రతిభను కళ్లారా చూసి అక్షత్‌ తల్లి ఆనంద భాష్పాలు రాల్చారు. అక్షత్‌ సింగ్‌ తాజా డాన్స్‌ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఎందుకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నావని జడ్జిలు అడిగిన ప్రశ్నకు అక్షత్‌ స్ఫూర్తిదాయక సమాధానం ఇచ్చాడు. ‘అందరిని సంతోషంగా ఉంచాలి. కష్టపడితే ఏదైనా సాధించగలమ’ని నిరూపించడానికి ఈ షోలో పాల్గొన్నానని జవాబిచ్చాడు. అక్షత్‌ మొదటిసారి బెంగాలీ రియాలిటీ షో ‘డాన్స్‌ బంగ్లా డాన్స్‌’లో పాల్గొన్నాడు. తర్వాత ఇండియా’స్‌ గాట్‌ టాలెంట్‌ షోతో బాగా పాపులర్ అయ్యాడు. దీంతో అతడి కుటుంబం ముంబైకి మారింది.