ట్విటర్‌  పాస్‌వర్డ్‌లు వెంటనే మార్చుకోండి!
Spread the love

ట్విటర్‌ యూజర్లు వెంటనే తమ పాస్‌వర్డ్‌లను మార్చేసుకోవాలని మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ఆదేశించింది. కొద్ది రోజుల క్రితం ట్విటర్‌లో ఉన్నట్టుండి సమస్యలు తలెత్తిన నేపథ్యంలో ఆ సంస్థ అంతర్గత దర్యాప్తు చేపట్టింది. పాస్‌వర్డ్‌ల చోరీ జరిగిందా?, మరేదైనా సమాచార దుర్వినియోగం జరిగిందా? అనే అంశంపై విచారణ చేసింది.తమ ఇంటర్నల్‌ కంప్యూటర్‌ సిస్టమ్‌లో ఒక బగ్‌ గుర్తించినట్టు ట్విటర్‌ పేర్కొంది. గురువారం నుంచి కంపెనీ ఈ బగ్‌పై పలు పోస్టులు, ట్వీట్లు చేసింది. ప్రస్తుతం సమస్యను పరిష్కరించామని, అయితే పాస్‌వర్డ్‌లను ఇన్‌సైడర్లు దొంగలించినట్టు, దుర్వినియోగ పరిచినట్టు ఎలాంటి సంకేతాలు లేవని పేర్కొంది. అయినప్పటికీ పాస్‌వర్డ్‌ను మార్చుకోవడం వల్ల మరింత జాగ్రత్తగా ఉండొచ్చని సూచించింది.

ప్రస్తుతం తమ ప్లాట్‌ఫామ్‌ నుంచి స్టోర్‌ చేసిన పాస్‌వర్డ్‌లన్నింటిన్నీ తొలగించామని, ఎవరికీ పాస్‌వర్డ్‌లు ఇక కనిపించవని ట్విటర్‌ తన బ్లాగ్‌ పోస్టులో పేర్కొంది. ట్విటర్ సీఈవో జాక్ డోర్సీ కూడా తాజా బగ్‌పై ట్వీట్ చేశారు. తమ నెట్‌వర్క్‌ లోపం వల్ల ఎన్ని పాస్‌వర్డ్‌లు ప్రభావితమయ్యాయో మాత్రం ట్విటర్ వెల్లడించలేదు. ప్రస్తుతం ట్విటర్‌ ప్లాట్‌ఫామ్‌పై 300 మిలియన్‌ మంది యూజర్లున్నారు. ప్రతి ఒక్కరినీ ఈ పాస్‌వర్డ్‌ను మార్చుకోవాలని ట్విటర్‌ ఆదేశిస్తోంది. ప్రభావితమైన పాస్‌వర్డ్‌ల సంఖ్య గణనీయంగానే ఉంటుందని.. కొన్ని నెలల కిందటి నుంచే వాటిని దుర్వినియోగం చేసి ఉంటారని భావిస్తున్నారు.

ట్విటర్ బ్లాగ్ ప్రకారం… హ్యాషింగ్ (పాస్‌వర్డ్‌లను గుర్తులుగా మార్చే ప్రక్రియ)లో సమస్య వచ్చింది. అయితే హ్యాషింగ్ ప్రక్రియకు ముందుగానే ఒక బగ్ పాస్‌వర్డ్‌లను అంతర్గత కంప్యూటర్‌లలో స్టోర్ చేస్తున్నట్లు గుర్తించారు. దీనికి తాము చాలా చింతిస్తున్నట్లు ట్విటర్ తన బ్లాగ్‌లో వెల్లడించింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరుగకుండా చర్యలు తీసుకుంటామని ట్విటర్‌ చెప్పింది. మీ అకౌంట్లను సురక్షితంగా ఉంచుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ట్విటర్‌ యూజర్లకు సూచించింది.