ఫ్లయింగ్‌ కిస్‌తో సెండాఫ్‌ పలికిన కోహ్లీ
Spread the love

టీమ్‌ఇండియా విదేశీ పర్యటనలకు వెళ్లిన ప్రతిసారీ మాజీలు, విశ్లేషకులు చెప్పే మాట ఒకటే. తొలి టెస్టు కీలకం. అందులోనూ ఆ మ్యాచ్‌ తొలి రోజు ఆట మరింత కీలకం. ఆ రోజు శుభారంభం చేస్తే.. సానుకూలంగా సిరీస్‌ను ఆరంభిస్తే సగం పనైపోయినట్లే. ఇంగ్లాండ్‌లో ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్‌కు అదిరే ఆరంభం లభించింది. బౌలర్లు అనూహ్యంగా చెలరేగిపోవడంతో తొలి టెస్టు తొలి రోజు ఇంగ్లాండ్‌ చతికిలబడింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 88 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 285 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ పేలవరీతిలో రనౌటయ్యాడు. ఇన్నింగ్స్ 63వ ఓవర్ వేసిన రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో కోహ్లీ చేతుల మీదుగా రనౌట్ అయి పెవిలియన్‌ చేరడం హైలైట్‌గా నిలిచింది.

ఇన్నింగ్స్ 63వ ఓవర్‌లో భాగంగా అశ్విన్‌ వేసిన ఒక బంతిని బెయిర్‌ స్టో లెగ్ గల్లీ దిశగా కొట్టాడు. అక్కడ ఫీల్డర్ ఎవరూ లేకపోవడంతో బెయిర్‌ స్టో రెండో పరుగు కోసం జో రూట్‌ను పిలిచాడు. అయితే.. అప్పటికే విరాట్ కోహ్లి బంతిని సమీపిస్తుండటంతో తొలుత తటపటాయించిన జో రూట్ ఆ తర్వాత పరుగుకు యత్నించాడు.వేగంగా బంతిని అందుకున్న కోహ్లి తనను తాను అదుపు చేసుకుంటూ గురిచూసి నాన్‌ స్ట్రైక్ ఎండ్‌లోని వికెట్లపైకి బంతిని విసిరాడు. అక్కడే ఉన్న బౌలర్ అశ్విన్ తొలుత బంతిని అందుకునేందుకు ప్రయత్నించి.. అది నేరుగా వికెట్ల వైపు వెళ్తుండటాన్ని గమనించి చేతులను వెనక్కి తీశాడు. దీంతో.. వేగంగా వెళ్లిన బంతి బెయిల్స్‌ను పడగొట్టింది.తొలి సెషన్‌ నుంచి భారత బౌలర్లకు పరీక్షగా నిలిచిన జో రూట్ పేలవ రీతిలో రనౌట్‌ కావడం, అదీ తాను రనౌట్ చేయడంతో కోహ్లి మైదానంలో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నాడు. పెవిలియన్‌కి వెళ్తున్న జో రూట్ వైపు చూస్తూ సంతోషంగా ఫ్లయింగ్ కిస్‌లు ఇచ్చి సెండాఫ్‌ పలికాడు.