బుమ్రా  బౌలింగ్ ను ఎదుర్కోవడం చాలా కష్టం :  కోహ్లి
Spread the love

మూడో టెస్టు :

ఆసీస్‌తో ఇక్కడ జరిగిన మూడో టెస్టులో విజయం సాధించి సిరీస్‌లో ఆధిక్యంలో నిలవడం పట్ల టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి సంతోషం వ్యక్తం చేశాడు. టీమిండియా సమష్టిగా రాణించడంతోనే మూడో టెస్టు మ్యాచ్ గెలిచామని పేర్కొన్నాడు. మ్యాచ్‌ ముగిసిన తర్వాత ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన కోహ్లి.. తన జట్టు ప్లేయర్లను ప్రోత్సహించాడు. బాక్సింగ్ డే టెస్టులో భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని కట్టబెట్టిన స్పీడ్‌స్టర్ జస్‌ప్రీత్ బుమ్రాను కెప్టెన్ విరాట్ కోహ్లి ప్రత్యేకంగా ప్రశంసలతో ముంచెత్తాడు. ప్రస్తుత ప్రపంచ క్రికెట్‌లో బుమ్రా అత్యుత్తమ బౌలర్ అంటూ చెప్పుకొచ్చారు.

అయితే ‘ప్రపంచంలో బుమ్రా బెస్ట్ బౌలర్. అతనో మ్యాచ్ విన్నర్, అందులో ఎలాంటి సందేహం లేదు. కేవలం 12నెలల్లోనే టెస్టుల్లో బుమ్రా ఈ స్థాయికి చేరుకోవడం నిజంగా అద్భుతం. పెర్త్‌లాంటి పేస్ పిచ్‌పై గనుక అతని బౌలింగ్‌ను ఎదుర్కొవడం నాకైతే చాలా కష్టమని నిజాయతీ చెప్పగలను. వైవిధ్యమైన బంతులు ఎదుర్కొవాలంటే అంత సులువు కాదు. మిగతా బౌలర్లతో పోల్చుకుంటే వేగానికి తోడు బంతి బంతిని వైవిధ్యంగా సంధిస్తాడు. పిచ్‌ను ఓసారి పరిశీలించాడంటే.. అందుకు అనుగుణంగా వ్యూహాలు రచించుకుని బౌలింగ్‌కు దిగుతాడు. అత్యుత్తమ ఫిట్‌నెస్ లక్షణాలకు తోడు కష్టపడే తత్వం బుమ్రా సొంతం. అతను ఈస్థాయికి చేరుకోవడానికి వెనుక ఎంతో శ్రమ దాగుంది. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌కు పరిమితం గాకుండా టెస్ట్‌ల్లోనూ సత్తాచాటాలన్న పట్టుదలే టెస్ట్‌ల్లో బుమ్రాను ప్రమాదకర బౌలర్‌గా మార్చింది. కెప్టెన్ ఆలోచనలు, వ్యూహాలకు అనుగుణంగా ప్రత్యర్థిని కట్టడి చేయడంలో ఈ యువ బౌలర్ ఎప్పుడూ ముందుంటాడు. అతని ఫామ్‌ను చూస్తుంటే… ప్రపంచంలో ఏ బ్యాట్స్‌మెన్ అయినా భయపడాల్సిందే’ అని కోహ్లి తెలియజేశాడు.