కోహ్లీకి కోపం వచ్చింది… దేశం విడిచి వెళ్లిపో…
Spread the love

క్రికెటర్ విరాట్ కోహ్లీ ఎప్పుడు తన అభిమానులతో సరదాగా వుండేవాడు , అయితే ఒక్కసారిగా అభిమానులపై కోపం వచ్చినట్టుంది. ‘దేశం విడిచి వెళ్లిపో’ అని ఫైర్ అయ్యాడు. అంత మాటన్నాక ఊరుకుంటారా సోషల్ మీడియా యూజర్లు. ఆటగాడితో ఆడుకోరు ? ఆటలో షార్ప్‌గా, బయట మిస్టర్ కూల్‌గా వుండే కోహ్లీకి ఎందుకంత కోపం వచ్చిందంటే… 2018 నవంబరు 5 నాటికి 30వ పడిలోకి అడుగుపెడుతున్న కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ హరిద్వార్ ఆశ్రమంలో తన పుట్టినరోజు వేడుకలను భార్య అనుష్క శర్మ సమక్షంలో జరుపుకున్నాడు.ఈ సందర్భంగా కోహ్లి తన పేరుతో ఉన్న యాప్‌ను ప్రారంభించాడు. ఈ యాప్‌లో ఓ క్రికెట్‌ ప్రేమికుడు భారత క్రికెటర్లపై కామెంట్లు చేశాడు. ‘కోహ్లి ఆటలో ప్రత్యేకత ఏం లేదు. ఇలాంటి ఇండియన్‌ క్రికెటర్ల కన్నా ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా క్రికెటర్ల ఆటతీరే నాకు ఎంతో ఇష్టం’ అని కోహ్లీ యాప్‌లో కామెంట్ చేయడం జరిగింది.

అయితే ఇక అతని కామెంట్‌తో కోహ్లీకి చిర్రెత్తుకొచ్చినట్టుంది. వెంటనే అతనికి తన ఘాటు కామెంటుతో సమాధానం ఇచ్చాడు. ‘నువ్వు భారత్‌లో ఉండాల్సినవాడివి కాదు. ఇంగ్లండ్ లేదా ఆస్ట్రేలియాలు మాత్రమే నీకు సరైనవి. దేశం విడిచి వెళ్లిపో. ఈ దేశంలో ఉంటూ పరదేశాలపై ప్రేమ చాలానే ఉంది. నీవు నన్ను అభిమానించనంత మాత్రాన నాకేం ఒరగదు. నీకు ఈ దేశం సరైంది కాదు’ అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో వివాదం చుట్టుముట్టుకుంది. కోహ్లీ వ్యాఖ్యలపై నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. ‘విదేశాల్లో పెళ్లి చేసుకుని, విదేశీ వస్తువులను కొనుగోలు చేయండనే ప్రకటనల్లో పాల్గొంటూ.. దేశం గురించి మాట్లాడటం ఏంటని ?’ కోహ్లిపై కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. ‘సెలెబ్రిటీలు అన్నవాళ్ళు ఇలాంటి కామెంట్లను చూసీ చూడనట్టు వదిలెయ్యాలి.. అంతేగానీ సమాధానం ఇవ్వకూడదు. ఇచ్చినా ఇంత ఘాటుగా స్పందించకూడదు’ అనే కామెంట్లతో ట్రోల్ చేస్తున్నారు.