నువ్వు సిక్స్ కొడితే..నేను  ముంబైకి పోతా..!
Spread the love

ఆసీస్‌ క్రికెటర్లు మేం మారిపోయామని ఎంత చెప్పుకున్నా అది వాస్తవంలో కనిపించదనేది మరోసారి తెలిసింది. టీమిండియాతో మూడో టెస్టులో సైతం ఆసీస్‌ కెప్టెన్‌ టిమ్‌ పైన్‌ తన నోటికి పని చెప్పాడు. భారత ఆటగాడు రోహిత్‌ శర్మ బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు అతన్ని కవ్వించే యత్నం చేశాడు పైన్‌. రోహిత్‌ అంటేనే సిక్సర్లకు మారుపేరు. అటువంటిది రోహిత్‌ను ఇక్కడ సిక్స్‌ కొట్టి చూడు అంటూ స్లెడ్జింగ్ దిగాడు. రోహిత్ శర్మ అర్ధ శతకం పూర్తి చేశాడు. టెస్టు కెరీర్‌లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకోవాలనే తాపత్రయంతో చాలా ఓపికగా ఆడుతున్నాడు.

అయితే రోహిత్ ఏకాగ్రతను దెబ్బతీసేందుకు ఆసీస్ కెప్టెన్, వికెట్ కీపర్ టిమ్ పైన్ వికెట్ల వెనకాల నుంచి ప్రయత్నించాడు. లయాన్‌ బౌలింగ్‌లో రోహిత్‌ను టీజ్ చేయడం మొదలుపెట్టాడు. దీనికి ఐపీఎల్‌ను ముడిపెడుతూ రోహిత్‌‌కు సవాల్ విసిరాడు. రోహిత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో షార్ట్ లెగ్‌లో అరోన్ ఫించ్ ఫీల్డింగ్ చేస్తున్నాడు. ఇక‍్కడ ఫించ్‌కు రోహిత్‌కు పోటీ పెట్టాడు. ‘ఫించ్‌ నువ్వు ఐపీఎల్లో దాదాపు అన్ని జట్ల తరపున ఆడావు కదా. బెంగళూరు తప్ప మిగతా జట్లకు ఆడా’ అంటూ పైన్‌కు బదులిచ్చాడు. దీన్ని రోహిత్‌కు ఆపాదిస్తూ … నువ్వు ఇప్పుడు సిక్స్‌ కొడితే.. నేను ముంబైకి మారిపోతా’ అంటూ సవాల్‌ విసిరాడు. అయితే రోహిత్‌ మాత్రం ఆ వ్యాఖ్యలను పట్టించుకోకుండా తన బ్యాటింగ్‌ను నిలకడగా కొనసాగించాడు. రోహిత్‌ను టిమ్ పైన్ టీజ్ చేసిన మాటలు వికెట్ల దగ్గర మైక్‌లో స్పష్టంగా రికార్డయ్యాయి. తన తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 443/7 వద్ద డిక్లేర్‌ చేయగా, రోహిత్‌ 63 పరుగులతో అజేయంగా నిలిచాడు.