నేడు వెస్టిండీస్‌తో రెండో వన్డే
Spread the love

భారత్‌-వెస్టిండీస్‌ మధ్య జరిగే రెండో వన్డేకు సాగర నగరం సిద్ధమైంది. భారత్‌ దూకుడు ముందు కరేబియన్‌ జట్టు నిలుస్తుందా..? లేదా పోరాడుతుందా..? అని క్రికెట్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారత్‌లో పర్యటించిన విదేశీ జట్లలో వెస్టిండీస్‌ మాత్రమే విశాఖలో మూడు మ్యాచ్‌లు ఆడింది. అందులో ఓ మ్యాచ్‌లో విజయం సాధించింది. విశాఖలో భారత్‌ను ఓడించిన ఏకైక జట్టు వెస్టిండీస్‌ మాత్రమే. ఈ సానుకూలతతో విండీస్‌ బరిలోకి దిగుతున్నా.. ప్రస్తుతం టీమిండియా జోరు ముందు అసలు పోటీలో ఉంటుందా? అన్న సగటు అభిమాని ప్రశ్న.

ఈ మ్యాచ్ కోసం మంగళవారమే జట్టును ప్రకటించిన టీమ్ మేనేజ్‌మెంట్ కొత్తవారిని బెంచ్‌కే పరిమితం చేసింది. దాంతో తొలి వన్డేలో ఆడిన జట్టునే యధావిధిగా కొనసాగించారు. బ్యాటింగ్‌లో ఫామ్ చూపెడుతున్నా.. బౌలింగ్‌పై దృష్టిసారించాల్సిన అవసరం ఏర్పడింది. డెత్ ఓవర్ స్పెషలిస్ట్ బుమ్రా, నమ్మకమైన సీమర్ భువనేశ్వర్ అందుబాటులో లేకపోవడంతో మొదటి వన్డేలో భారత్ బౌలింగ్ చాలా నాసిరకంగా కనిపించింది. షమీ, ఉమేశ్ అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయారు. 10 ఓవర్ల కోటాలో షమీ 81, ఉమేశ్ 64 పరుగులు సమర్పించుకున్నారు. కొత్త కుర్రాడు ఖలీల్ అహ్మద్ కూడా మెరుగుపడాల్సిందే. ప్రపంచకప్‌నకు తక్కువ సమయం ఉండటంతో పేస్ బౌలింగ్ పూల్‌ను మరింత పటిష్టం చేయాలని మేనేజ్‌మెంట్ లక్ష్యంగా పెట్టుకున్నది. కాబట్టి సిరాజ్, శార్దూల్‌లాంటి కుర్రాళ్ల నుంచి పోటీని తప్పించుకోవాలంటే తర్వాతి మ్యాచ్‌లోనైనా చెలరేగాల్సిందే. ఆల్‌రౌండర్‌గా జడేజా పాత్ర కూడా సరిపోలేదు. మిడిల్ ఓవర్లలో విండీస్ బ్యాట్స్‌మన్‌ను ఏమాత్రం కట్టడి చేయలేకపోయాడు. హెట్మెయర్ కొట్టిన షాట్లకు అతను చేష్టలుడిగిపోయాడు. ఆసియాకప్‌లో బంగ్లాపై అద్భుతంగా ఆడిన జడ్డూ తర్వాతి మ్యాచ్‌ల్లోనూ ఉండాలంటే బౌలింగ్‌లో మరింత దూసుకుపోవాలి. లోయర్ ఆర్డర్‌లో జడేజాను విలువైన బ్యాట్స్‌మన్‌గా పరిగణిస్తే జట్టులో కొనసాగుతాడు. చాహల్ ఫర్వాలేదనిపించాడు. టెస్ట్‌ల్లో హెట్మెయర్‌ను మూడుసార్లు ఔట్ చేసిన కుల్దీప్‌ను ఈ మ్యాచ్‌లో ఆడించే ఆలోచన చేస్తున్నారు. ఇక బ్యాటింగ్ టాప్-3లో రోహిత్, కోహ్లీ, రాయుడు పరుగుల వరద పారించడం కలిసొచ్చే అంశం. అయితే ఓపెనర్ ధవన్ పరిస్థితి ఆందోళన కలిగిస్తున్నది. మిడిలార్డర్‌లో రిషబ్, ధోనీలకు ఇది పరీక్షా సమయం. ఇందులో వీళ్లు సత్తా చాటితే వరల్డ్‌కప్ బెర్త్ దక్కినట్లే.

పిచ్‌, వాతావరణం

రాత్రి మంచు ప్రభావం ఉండడంతో టాస్‌ నెగ్గిన జట్టు ఫీల్డింగ్‌ తీసుకునే చాన్స్‌ ఉన్నాది. ఈ పిచ్‌పై మరోసారి పరుగుల వరద పారడం ఖాయంగా కనిపిస్తోంది. అలాగే వికెట్‌పై పచ్చిక లేకపోవడంతో స్పిన్నర్లూ కీలకమే.. ఇక్కడ అధిక వేడితో పాటు తేమ వాతావరణం ఉన్నా మధ్యాహ్నం ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నాది.

ఏసీఏ-వీడీసీఏ మైదానంలో భారత్‌ ఏడు మ్యాచ్‌లాడగా ఆరింట్లో నెగ్గింది. 2013లో ఎదురైన ఏకైక ఓటమి విండీస్ పైనే!

ఈ మైదానంలో టాస్‌ ఓడిన జట్టు ఇప్పటిదాకా ఒక్క మ్యాచ్‌ను కూడా గెలవలేదు.

అత్యంత వేగంగా 10 వేల పరుగులు సాధించిన వన్డే ఆటగాడిగా నిలిచేందుకు కోహ్లీ ఇంకా 81 పరుగుల దూరంలో ఉన్నాడు.

ఓపెనర్‌ రోహిత్‌ శర్మ మరో రెండు సిక్సర్లు బాదితే సచిన్‌ (195)ను అధిగమిస్తాడు. భారత్‌ నుంచి ధోనీ (217) అందరికంటే ముందున్నాడు.