విద్య, ఉద్యోగాల్లో క్రీడాకారులకు 2% రిజర్వేషన్‌
Spread the love

రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు 

ఉద్యోగ నియామకాల్లో క్రీడాకారులకు 2 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ శాఖల డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌లో ఈ రిజర్వేషన్లు వర్తించనున్నాయి. ఈ మేరకు క్రీడలశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవానికి ఈ రిజర్వేషన్లు ఉమ్మడి రాష్ట్రంలోనే ఉన్నప్పటికీ తెలంగాణ ఏర్పాటు తర్వాత అమలు కాలేదు. వీటిని అమలు చేయాలంటే రూల్‌–22లో సవరణలు చేయాలని టీఎస్‌పీఎస్సీ సూచించింది. దీంతో ప్రభుత్వం అందుకు సంబంధించిన సవరణలు చేసింది. తాజా రిజర్వేషన్లు 29 రకాల క్రీడాకారులకు, 90 రకాల క్రీడల్లో పాల్గొన్న వారికి, పతకాలు సాధించిన వారికి వర్తించనున్నాయి.

ఇకపై అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ఎయిడెడ్‌ సంస్థల్లోని ప్రత్యక్ష నియామకాలకు ఇది వర్తిస్తుందని పేర్కొంది. క్రీడా రిజర్వేషన్లు మహిళా రిజర్వేషన్ల మాదిరిగా సమాంతరంగా అమలవుతాయి. రోస్టర్‌ ప్రకారం 48, 98 పాయింట్లను దీనికి కేటాయించారు. అంటే ఈ విధానంలో ప్రతి వంద పోస్టుల భర్తీలో 48వ, 98వ పోస్టులు క్రీడాకారులకు చెందుతాయి.  ముఖ్యమంత్రి కేసీఆర్‌ క్రీడాకారులకు ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకుని ఉత్తర్వులు జారీ చేశామని క్రీడల శాఖ మంత్రి పద్మారావు తెలిపారు.

క్రీడాకారులకు వరం: మంత్రి పద్మారావుగౌడ్‌

Telangana announces 2% quota for sports persons in govt jobs

ఇటీవల కామన్వెల్త్‌కు వెళ్లిన క్రీడాకారులను అభినందిస్తూ సీఎం కేసీఆర్‌ క్రీడాకారులకు 2% రిజర్వేషన్లను అమలు చేస్తామని ప్రకటించారని, ఆయన సూచనలకు అనుగుణంగా రిజర్వేషన్ల అమలుకు సన్నాహాలు చేశామని చెప్పారు. ‘గతంలో క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు ఉత్తర్వులు ఇచ్చినా రాష్ట్ర సబార్డినేట్‌ నిబంధనల్లో దాన్ని చేర్చనందువల్ల అమలు కాలేదు. పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌, ఇతర ఉద్యోగాల్లోనూ దీన్ని వర్తింపజేయలేదు. ప్రస్తుతం రిజర్వేషన్లను సబార్డినేట్‌ రూల్స్‌లో చేర్చాం.ఎలాంటి సమస్యలు లేకుండా న్యాయశాఖ, జీఏడీల సలహాలు తీసుకున్నాం.క్రీడా రిజర్వేషన్లు మహిళా రిజర్వేషన్ల మాదిరిగా సమాంతరంగా అమలవుతాయి. రోస్టర్‌ ప్రకారం 48, 98 పాయింట్లను దీనికి కేటాయించారు. అంటే ఈ విధానంలో ప్రతి వంద పోస్టుల భర్తీలో 48వ, 98వ పోస్టులు క్రీడాకారులకు చెందుతాయి. అన్ని నియామకాలకూ, విద్యాసంస్థల్లో ప్రవేశాలకు విధిగా అమలవుతాయి’ అని మంత్రి చెప్పారు. బుర్రా వెంకటేశం మాట్లాడుతూ క్రీడాకారులకు 2% రిజర్వేషన్ల అమలు సాహసోపేత నిర్ణయమన్నారు. మెడిసిన్‌ సీట్ల భర్తీ సందర్భంగా క్రీడాకేటగిరీ సీట్ల భర్తీపై వచ్చిన ఫిర్యాదులపై విచారణ చేపట్టామని నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. త్వరలోనే ఆబ్కారి సెస్సు వసూలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోందని వెంకటేశ్వర్‌రెడ్డి వెల్లడించారు.

రిజర్వేషన్లు వర్తించే క్రీడలివే..

ఫుట్‌బాల్‌, హాకీ, వాలీబాల్‌, హ్యాండ్‌బ్యాల్‌, బాస్కెట్‌బాల్‌, టెన్నిస్‌, టేబుల్‌టెన్నిస్‌, షటిల్‌ బ్యాడ్మింటన్‌, కబడ్డీ, అథ్లెటిక్స్‌, ఈత, జిమ్నాస్టిక్స్‌, వెయిట్‌లిఫ్టింగ్‌, రెజ్లింగ్‌, బాక్సింగ్‌, సైక్లింగ్‌, త్రోయింగ్‌, షూటింగ్‌, ఫెన్సింగ్‌, రోలర్‌ స్కేటింగ్‌, సెయిలింగ్‌/ యాచింగ్‌, ఆర్చరీ, క్రికెట్‌, చెస్‌, ఖోఖో, జూడో, తైక్వాండో, సాఫ్ట్‌బాల్‌, బాడీ బిల్డింగ్‌.

క్రీడాకారులకు రెండుశాతం రిజర్వేషన్లపై హర్షం

ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రీడాకారులకు రెండుశాతం రిజర్వేషన్లు కల్పిస్తూ సోమవారం తెలంగాణ ప్రభుత్వం జీవో జారీచేయడంపై ఉపాధ్యాయసంఘాలు హర్షం వ్యక్తంచేశాయి. టీటీఎఫ్ రాష్ట్ర నాయకుడు రఘనందన్, టీజీ పీఈటీఏ నాయకులు టీ విజయ్‌సాగర్, పలు ఉపాధ్యాయుల సంఘాల నాయకుడు రాష్ట్రప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశంసించారు.