డేవిడ్‌ ఒంటరి పోరాటం
Spread the love

 కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసిన పంజాబ్‌
                  మొహాలీ: సన్‌రైజర్స్‌ బ్యాట్స్‌మన్‌ డేవిడ్‌ వార్నర్‌ మరోసారి స్ఫూర్తిదాయక ఇన్నింగ్స్‌ ఆడాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో భాగంగా ఐఎస్‌ బృందా స్టేడియం వేదికగా కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్టుతో మ్యాచ్‌లో బెయిర్‌స్ట్రో విఫలమవ్వడంతో సన్‌రైజర్స్‌ 7 పరుగులకే తొలి వికెట్‌ కోల్పోయి కష్టాల్లో పడింది. దీంతో వార్నర్‌ విధ్వంస ఇన్నింగ్స్‌ ఫుల్‌స్టాప్‌పెట్టి ఆచితూచి ఆడుతూ చివరి బంతి వరకూ క్రీజ్‌లో నిలిచి జట్టు గౌరవప్రద స్కోర్‌ చేయడానికి దోహదపడ్డాడు. విజయ‌శంకర్‌, మనీష్‌పాండే సాయంతో సన్‌రైజర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 150 పరుగులు చేయగల్గింది.
టాస్‌ గెలిచిన పంజాబ్‌ ఫీల్డింగ్‌ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌కు ఆరంభంలోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. ముజీబ్‌ వేసిన రెండో ఓవర్‌ 4వ బంతికి బెయిర్‌స్టో(1) అశ్విన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత డేవిడ్‌ వార్నర్‌, విజరు శంకర్‌లు కలిసి వికెట్‌ కాపాడుకుంటూ బ్యాటింగ్‌ చేశారు. భారీ షాట్‌లు, బౌండరీల కోసం ప్రయత్నం చేయకుండా.. సింగిల్స్‌, డబుల్స్‌తో సరిపెట్టుకున్నారు. అయితే అశ్విన్‌ వేసిన 11వ ఓవర్‌ నాలుగో బంతికి శంకర్‌(26) రాహుల్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కి వచ్చిన మహ్మద్‌ నబీ(12) దురదృష్టవశాత్తు రనౌట్‌ అయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కి వచ్చిన మనీశ్‌ పాండే(19) స్కోర్‌ పెంచేందుకు కృషి చూశాడు. ఈ క్రమంలో డేవిడ్‌ వార్నర్‌(70) అర్థశతకం కూడా సాధించాడు. అయితే మహ్మద్‌ షమీ వేసిన 20వ ఓవర్‌ తొలి బంతికి మనీశ్‌ ఔట్‌ అయ్యాడు. చివర్లో దీపక్‌ హుడా(14) బౌండరీలు బాదడంతో సన్‌రైజర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. పంజాబ్‌ బౌలింగ్‌లో ముజీబ్‌, షమీ, అశ్విన్‌ తలో వికెట్‌ తీశారు.

పంజాబ్‌ బౌలర్ల హవా…
పంజాబ్‌ బౌలర్ల ధాటికి సన్‌రైజర్స్‌ బ్యాట్స్‌మన్లు పెద్దగా పరుగులు రాబట్టలేకపోయారు. బెయిర్‌స్ట్రో త్వరగా పెవీలియన్‌కు చేరడంతో భారమంతా వార్నర్‌పైనే పడింది. ఈ క్రమంలో సన్‌రైజర్స్‌ 12 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్ల నష్టానికి 69 పరుగులు మాత్రమే చేయగల్గింది. రాజ్‌పుత్‌ 4 ఓవర్లలో వికెట్లేమీ తీయకపోయినా కేవలం 21 పరుగులు మాత్రమే ఇచ్చాడు. మిగతా బౌలర్లు 30కు పైగా పరుగులు సమర్పించుకున్నాడు. సన్‌రైజర్స్‌ 12 ఓవర్ల అనంతరం దూకుడు పెంచడంతో చివరి 8 ఓవర్లలో 81 పరుగులు రావడం విశేషం. డేవిడ్‌ వార్నర్‌ ఈ ఐపీఎల్‌ సీజన్‌లో 300 పరుగుల మైలురాయి అధిగమించాడు.

సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌ : వార్నర్‌ (నాటౌట్‌) 70, బెయిర్‌స్ట్రో (సి) అశ్విన్‌ (బి) ముజీబ్‌ 1, విజరుశంకర్‌ (సి) రాహుల్‌ (బి) అశ్విన్‌ 26, నబి (రనౌట్‌) అశ్విన్‌ 12, మనీష్‌ పాండే (సి) నాయర్‌ (బి) షమి 19, హుడా (నాటౌట్‌) 14, అదనం 8. (20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 150 పరుగులు)
వికెట్ల పతనం : 1/7, 2/56, 3/80, 4/135
బౌలింగ్‌: రాజ్‌పుత్‌ 4-0-21-0, ముజీబ్‌ 4-0-34-1, షమి 4-0-30-1, అశ్విన్‌ 4-0-30-1, కుర్రన్‌ 4-0-30-o