బెంగళూరుపై సన్‌రైజర్స్‌ గెలుపు
Spread the love
  • ఆర్‌సీబీపై రైజర్స్‌ అద్భుత విజయం
  • గెలిపించిన బౌలర్లు
  • ఎనిమిదో విజయంతో ప్లేఆఫ్‌నకు చేరువ
  • ప్లే ఆఫ్స్‌ నుంచి ఆర్‌సీబీ అవుట్‌

ఐదు ఓవర్లకు పైగా వికెట్‌ పడలేదు. క్రీజులో బాగా కుదురుకున్న బ్యాట్స్‌మెన్‌ ఉన్నారు. అందులో ఒకడు అప్పుడే రెండు సిక్సర్లు బాది ప్రమాదకరంగా కనిపిస్తున్నాడు. మరో బ్యాట్స్‌మన్‌ కూడా సమర్థుడే. 3 ఓవర్లలో చేయాల్సింది 25 పరుగులే. టీ20ల్లో ఇది పెద్ద సవాలేమీ కాదు! మామూలుగా అయితే ఇలాంటి స్థితిలో బ్యాటింగ్‌ జట్టు ఇంకా కొన్ని  బంతులుండగానే గెలిచేయొచ్చు! కానీ చివరికి బౌలింగ్‌ జట్టు 5 పరుగుల తేడాతో నెగ్గింది.

ఈరోజు హైదరాబాద్

సన్‌రైజర్స్‌ మరోసారి అదరగొట్టింది. అద్భుతమైన బౌలింగ్‌తో వరుసగా ఐదో విజయం సాధించింది. సీజన్లో ఎనిమిదో విజయంతో 16 పాయింట్లు సాధించి, ప్లేఆఫ్‌ బెర్తును దాదాపుగా ఖాయం చేసుకుంది.  టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 20 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌటైంది. సోమవారం ఉప్పల్‌ స్టేడియంలో ఆఖరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ 5 పరుగుల తేడాతో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుపై విజయం సాధించింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో చివరి మెట్టుపై తడబడి ఓటమి పాలైన బెంగళూరు.. ప్లేఆఫ్‌ అవకాశాల్ని సంక్లిష్టం చేసుకుంది. పేసర్లు మహ్మద్‌ సిరాజ్‌ (3/25), సౌథీ (3/30) సన్‌రైజర్స్‌ను కట్టడి చేశారు. 18 బంతుల్లో 25 పరుగులు, చేతిలో 5 వికెట్లు… ఐపీఎల్‌ ప్రమాణాలపరంగా చూస్తే ఇది సునాయాసంగా చేయాల్సిన స్కోరు. కానీ బెంగళూరు చేతులెత్తేసింది. ఒకే బౌండరీతో 19 పరుగులు మాత్రమే చేయగలిగింది. భువనేశ్వర్, సిద్ధార్థ్‌ కౌల్‌ కలిసి ప్రత్యర్థిని కట్టిపడేయడంతో ఆర్‌సీబీకి మరో ఓటమి తప్పలేదు. అనంతరం బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్లకు 141 పరుగులు మాత్రమే చేయగలిగింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి (39; 30 బంతుల్లో 5×4, 1×6), గ్రాండ్‌హోమ్‌ (33; 29 బంతుల్లో 1×4, 2×6) పోరాడినా ఫలితం లేకపోయింది.

200 లక్ష్యాల్ని కూడా ఉఫ్‌మనిపించేసే ఐపీఎల్‌లో 120, 130, 140 స్కోర్లతోనూ ప్రత్యర్థికి ముచ్చెమటలు పట్టించి మ్యాచ్‌లు గెలవగల జట్టుగా తనకున్న పేరును సన్‌రైజర్స్‌ మరోసారి నిలబెట్టుకుంది. బ్యాట్స్‌మెన్‌ మరోసారి పేలవ ప్రదర్శన చేసినా.. ప్రత్యర్థి ముందు 147 పరుగుల లక్ష్యమే నిలిచినా.. బౌలర్లు బెదరలేదు. ఎప్పట్లాగే కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను ఉక్కిరిబిక్కిరి చేసి జట్టుకు విజయాన్నందించారు. ఐపీఎల్‌-11లో అందరి కంటే ముందుగా ఎనిమిదో విజయం సాధించిన సన్‌రైజర్స్‌ ప్లేఆఫ్‌ బెర్తును దాదాపుగా ఖాయం చేసుకోగా.. ఏడో పరాజయంతో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు దాదాపుగా లీగ్‌ నుంచి నిష్క్రమించే స్థితికి చేరుకుంది.

కోహ్లి, డివిలియర్స్‌ లాంటి ఆటగాళ్లున్న జట్టు ముందు 147 పరుగుల లక్ష్యం ఏమంత పెద్దగా అనిపించదు! ఐతే భీకరమైన బౌలింగ్‌తో సత్తా చాటుతున్న సన్‌రైజర్స్‌కు మ్యాచ్‌ కాపాడుకోడానికి ఆ స్కోరు సరిపోయింది. ఆ జట్టు బౌలర్లు అద్భుతమైన బంతులతో విజృంభించారు. మొదట బెంగళూరు బౌలర్లు కుదురైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నారు. హైదరాబాదీ పేసర్‌ సిరాజ్‌ అలరించాడు. అతడికి సౌథీ, ఉమేశ్‌ తోడవటంతో సన్‌రైజర్స్‌ బ్యాటింగ్‌ ప్రయాణం భారంగా సాగింది. వేగంగా పరుగులు రాబట్టాలన్న ఒత్తిడిలో హేల్స్‌ (5), ధావన్‌ (13), మనీష్‌ పాండే (5)లు వికెట్లు పారేసుకున్నారు.