‘స్మిత్ ఈజ్ బ్యాక్’: గ్లోబల్ టీ20లో హాఫ్ సెంచరీ
Spread the love

హైదరాబాద్: బాల్‌ ట్యాంపరింగ్‌ వివాదంలో చిక్కుకుని ఏడాది పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన ఆసీస్‌ క్రికెటర్‌ స్టీవ్‌ స్మిత్‌ కెనడాలో ప్రారంభమైన గ్లోబల్‌ టీ20 లీగ్‌లో చెలరేగాడు. భారత్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) మాదిరి కెనడాలో గ్లోబల్‌ టీ20 పేరిట ఓ లీగ్‌ ప్రారంభించారు. ఈ లీగ్‌లో స్టీవ్ స్మిత్ టోరంటో నేషనల్స్‌ జట్టు తరుపున ఆడుతున్నాడు. టోర్నీలో భాగంగా గురువారం టొరొంటో నేషనల్స్‌-వాంకోవర్‌ నైట్స్‌ జట్ల మధ్య తొలి మ్యాచ్‌ జరిగింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన వాంకోవర్‌ నైట్స్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 227 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టొరొంటో నేషనల్స్‌ ఆదిలోనే వికెట్‌ కోల్పోయింది.

మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన స్టీవ్ స్మిత్‌ 41 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్సర్‌ సాయంతో 61 పరుగులు జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఏపీ డెవిసిచ్‌(92) కూడా రాణించడంతో నేషనల్స్ జట్టు విజయం సాధించింది. సుదీర్ఘ విరామం తర్వాత బ్యాట్‌పట్టిన స్మిత్‌ ఈ మ్యాచ్‌లో ఎలా ఆడతాడో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. అభిమానులు కూడా స్మిత్‌ను తిరిగి మైదానంలో చూడటంతో సంతోషం వ్యక్తం చేశారు. స్టీవ్ స్మిత్‌ బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌లో చురుకుగా కదులుతూ కనిపించడంతో సోషల్ మీడియాలో ఈ మ్యాచ్‌లో స్మిత్‌కు సంబంధించిన ఫొటోలను, వీడియోలను పంచుకుంటూ ‘స్మిత్‌ ఈజ్‌ బ్యాక్‌’ అని కామెంట్లు పెడుతున్నారు.

“ప్రస్తుతం ఆసీస్‌ క్రికెట్‌ నుంచి కొంత బ్రేక్‌ తీసుకోవడం నాకు లాభిస్తుందనే అనుకుంటున్నా. నా పునరాగమనాన్ని ఘనంగా చాటుకుంటానని, మళ్లీ పూర‍్వపు ఫామ్‌తో జట్టుకు సేవలందిస్తానన్న నమ్మకం ఉంది” అని స్టీవ్ స్మిత్‌ పేర్కొన్నాడు. ఈ ఏడాది మార్చిలో సఫారీ గడ్డపై దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో బాల్‌ టాంపరింగ్‌కు పాల్పడిన స్మిత్, వార్నర్‌లపై క్రికెట్ ఆస్ట్రేలియా ఏడాది పాటు నిషేధం విధించిన సంగతి తెలిసిందే.