ధోనీని టీ20ల నుంచి తప్పించడంపై సచిన్ ఏమన్నారంటే…
Spread the love

భారత మాజీ కెప్టెన్‌, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్‌ ధోనీని టీ20ల నుంచి తప్పించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న విషయం విదితమే. అభిమానులు సైతం ధోనీని తప్పించడంపై గుర్రుగా ఉన్నారు. మరోవైపు ఈ విషయంపై చీఫ్‌ సెలక్టర్ ఎంఎస్ కె ప్రసాద్‌, టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిలు స్పందించారు. ధోని టీ20 కెరీర్‌ ముగియలేదని, కేవలం యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే విశ్రాంతి ఇచ్చినట్లు తెలిపారు. ధోనీ ఇదే విషయమై తమతో చర్చించినట్లు తెలిపారు. యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ జట్టుతో ఎక్కువ సమయం ఉండడం ప్రస్తుతం అవసరమని మహీనే స్వయంగా అభిప్రాయపడినట్టు కోహ్లీ తెలిపారు.

నేనెప్పుడు ఏ విషయంలోను ఎలాంటి తీర్పులివ్వలేదు. ప్రస్తుత సెలక్టర్ల నిర్ణయంపై కూడా తీర్పునివ్వను. అన్ని ఫార్మాట్‌లో ధోని అద్భుతంగా రాణించాడు. చాలా ఏళ్లుగా తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తు వచ్చాడు. చాలా ఏళ్లుగా ఆడుతున్న ఆటగాళ్లకు ఏం జరగబోతుంది, ఏం చేయాలనే విషయం తెలుసుంటుంది. ఈ పరిస్థితుల్లో నేనైతే.. ఏం చేయాలో మొదలు తెలుసుకుంటాను. డ్రెస్సింగ్‌ రూంలో సహచర ఆటగాళ్లతో చర్చిస్తాను. కోచ్‌, కెప్టెన్ ఏం ఆశిసస్తున్నారో తెలుసుకుంటాను. ప్రస్తుతానికి ధోని చాలా రోజులు క్రికెట్‌ ఆడుతాడని నమ్ముతున్నాను.’ అని సచిన్‌ తెలిపాడు. ఇక ధోనిని వెస్టిండీస్‌, ఆస్ట్రేలియా టీ20 సిరీస్‌ల నుంచి పక్కన పెట్టిన విషయం తెలిసిందే. సెలక్టర్లు మాత్రం ధోనికి విశ్రాంతి ఇచ్చామని, ప్రత్యామ్నయ వికెట్‌ కీపర్‌ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతున్నారు. అభిమానులు మాత్రం ధోనిని తొలిగించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.