తండ్రి అయిన రోహిత్‌ శర్మ
Spread the love

టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ తండ్రి అయ్యాడు. రోహిత్ భార్య రితికా సజ్దే ఆదివారం ముంబైలోని ఓ హాస్పిట‌ల్‌లో పండంటి ఆడ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చారు. ఈ విషయాన్ని సొహైల్ ఖాన్ భార్య, రితికాకు బంధువు అయిన సీమా ఖాన్ త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ విష‌యాన్ని పోస్ట్ చేశారు. ‘రోహిత్ దంప‌తుల‌కు ఆడ‌బిడ్డ జ‌న్మించింది’ అంటూ సీమా తన సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న రోహిత్‌ శర్మ తన చిన్నారిని, భార్యను చూసేందుకు భారత్‌కు తిరుగుపయనమయ్యారు. దీంతో ఆస్ట్రేలియాతో జ‌రుగ‌నున్న నాలుగో టెస్ట్‌కు రోహిత్ శర్మ దూరం కానున్నాడు. 2015 డిసెంబరు 13న రోహిత్‌ తన స్నేహితురాలు, మేనేజర్‌ రితికాను వివాహం చేసుకున్నారు. ఇటీవల ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ మైఖెల్‌ క్లార్క్‌తో జరిపిన ఛాట్‌లో రోహిత్‌ తాను త్వరలో తండ్రవబోతున్న విషయాన్ని తొలిసారిగా వెల్లడించిన సంగతి తెలిసిందే.