ధోనిని కూడా  దాటేసిన  పంత్‌ !!
Spread the love

ఇంగ్లండ్‌తో జరిగిన చివరి టెస్ట్‌లో టీమిండియా యువకెరటం, వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ అద్భుత శతకంతో రెచ్చిపోయిన విషయం తెలిసిందే. పంత్‌ ఆడుతోంది టెస్ట్‌ క్రికెటా లేక టీ20నా అన్నట్లు అతని బ్యాటింగ్‌ సాగింది. 14 ఫోర్లు, 3 సిక్స్‌లతో 114 పరుగులతో ఇంగ్లండ్‌ బౌలర్లకు చుక్కలు చూపించాడు. దీంతో ఇంగ్లండ్‌ గడ్డపై అత్యధిక పరుగులు, సెంచరీ సాధించిన తొలి భారత వికెట్‌ కీపర్‌గా పంత్‌ రికార్డు నమోదు చేశాడు. సీనియర్‌ వికెట్‌ కీపర్‌ ధోని(92)ని పంత్‌ అధిగమించాడు. అంతేకాకుండా సిక్స్‌తో సెంచరీ పూర్తి చేసి ఇలా తొలి టెస్టు సెంచరీని పూర్తి చేసుకున్న నాలుగో భారత క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు‌. గతంలో కపిల్‌ దేవ్, ఇర్ఫాన్‌ పఠాన్, హర్భజన్‌ సింగ్‌లు తమ తొలి సెంచరీని సిక్స్‌తో సాధించారు. టెస్టులోని 4వ ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన తొలి భారత వికెట్‌ కీపర్‌ కూడా రిషభ్‌ పంతే కావడం విశేషం‌.

వికెట్‌ కీపర్‌గా సెంచరీ సాధించిన రెండో పిన్నవయస్కుడిగా పంత్‌ నిలిచాడు. అతని అద్భుత ప్రదర్శనకు మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్‌, సచిన్‌ టెండూల్కర్‌ ముగ్దులయ్యారు. ‘సిక్స్‌తో సెంచరీ సాధించి ఆకట్టుకున్నావ్‌ పంత్‌’ అని సెహ్వాగ్‌ కొనియాడగా.. దూకుడుకు సరికొత్త నిర్వచనం చెప్పావని సచిన్‌ కితాబిచ్చాడు.