రాజస్తాన్‌ రాయల్స్‌ నెగ్గింది
Spread the love

ప్లే ఆఫ్‌ రేసులో తామూ ఉన్నామని రాజస్థాన్‌ రాయల్స్‌ నిరూపించుకుంది. మూడు వరుస పరాజయాల అనంతరం ఓ విజయంతో ప్లేఆఫ్స్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. పంజాబ్‌ చేతిలో వారి సొంతగడ్డపై ఎదురైన పరాజయానికి రాజస్థాన్‌ రాయల్స్‌ తమ సొంతగడ్డపై ప్రతీకారం తీర్చుకుంది. జోస్‌ బట్లర్‌ సూపర్‌ బ్యాటింగ్‌, గౌతమ్‌, సోధిల చక్కని బౌలింగ్‌తో..  కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ను రాజస్థాన్‌ ఓడించింది. టోర్నీలో నాలుగో విజయం సాధించిన రహానెసేన.. పాయింట్ట పట్టికలో అట్టడుగు స్థానం నుంచి ఆరో స్థానానికి ఎగబాకింది. పంజాబ్‌కు ఇది నాలుగో ఓటమి. కేఎల్‌ రాహుల్‌ 95 పరుగులతో అజేయంగా నిలిచినా..  ఆ జట్టును గెలిపించలేకపోయాడు. రాహుల్‌ కాకుండా పంజాబ్‌ ఇన్నింగ్స్‌లో ఒక్క స్టాయినిస్‌ (11) మాత్రమే రెండంకెల స్కోరు చేశాడు. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ బట్లర్‌ కు దక్కింది.

జైపుర్‌

ప్లే ఆఫ్‌ చేరాలంటే మిగిలిన ఐదు మ్యాచ్‌ల్లోనూ గెలుపు అత్యవసరమని భావించిన రాజస్థాన్‌ రాయల్స్‌ అద్భుత ప్రదర్శన చేసింది. స్టార్‌ లైన్‌పతో కూడిన పంజాబ్‌ను అద్భుత బౌలింగ్‌తో కట్టడి చేసి 15 పరుగుల తేడాతో పంజాబ్‌ను ఓడించింది. ఈ స్టేడియంలో పంజాబ్‌పై రాజస్థాన్‌కిది వరుసగా ఐదో విజయం. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా రాజస్థాన్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 158 పరుగులు చేసింది.  జోస్‌ బట్లర్‌ (82; 58 బంతుల్లో 9×4, 1×6) మెరవడంతో రాజస్థాన్‌ గెలుపు బాట పట్టింది. ఛేదనలో పంజాబ్‌ అత్యంత పేలవ ప్రదర్శన చేసింది. గౌతమ్‌ (2/12), ఇష్‌ సోధి (1/14) కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో 7 వికెట్లకు 143 పరుగులే చేయగలిగింది. కేఎల్‌ రాహుల్‌ (95 నాటౌట్‌; 70 బంతుల్లో 11×4, 2×6) పోరాడినా లాభం లేకపోయింది.

ఇంతపెద్ద టోర్నీలో ఒకటో రెండో మ్యాచ్‌లు ఓడిపోవడం పెద్ద విషయం కాదంటున్నాడు రవిచంద్రన్‌ అశ్విన్‌. ఐపీఎల్‌ 2018లో భాగంగా మంగళవారం రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్‌ లెవెన్‌ పంజాబ్‌ 15 పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. పవర్‌ చూపెడదామనుకున్నా: ‘‘మేము పర్‌ఫెక్ట్‌ టీమ్‌ కాదన్న సంగతి మాకు తెలుసు. ప్రయోగాలు చేయకతప్పడంలేదు. వికెట్‌ టఫ్‌గా ఉంది. పోనుపోను బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది. కాబట్టి పవర్‌ ప్లేలో ప్రత్యర్థిని అటాక్‌ చేద్దామనుకున్నాం. అందుకే నేను 3వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగాను. వాస్తవానికి మేం బౌలింగ్‌, ఫీల్డింగ్‌ సరిగా చెయ్యలేదు. కీలకమైన క్యాచ్‌లు పట్టిఉంటే రాజస్తాన్‌ స్కోరు ఓ 20 పరుగులు తగ్గిఉండేది. అప్పుడు ఫలితం మరోలా ఉండేది. అఫ్‌కోర్స్‌, ఈ ఓటమి ఈ రోజుకు మాత్రమే పరిమితం. మున్ముందు కూడా ప్రయోగాలు చేస్తాం..’’ అని అశ్విన్‌ వివరించాడు.

ప్రత్యర్థి జట్టును బాగానే కట్టడి చేశామన్న ఆనందంతో లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌కు ఆరంభంలోనే అష్టకష్టాలు ఎదురయ్యాయి. గేల్‌తో మొదలైన పతనం అక్షర్‌ వికెట్‌ దాకా క్రమం తప్పకుండా సాగింది. పంజాబ్‌ ఇన్నింగ్స్‌కు లోకేశ్‌ రాహుల్‌ వెన్నెముకగా నిలిచినప్పటికీ… రాయల్స్‌ బౌలర్లు తెలివిగా అవతలి ఎండ్‌లో వికెట్లు పడగొట్టడంతో ఓటమి తప్పలేదు.