సచిన్‌కు దక్కని రికార్డును సొంతం చేసుకున్న పృథ్వీ
Spread the love

18 ఏళ్ల వయస్సు ఆడుతోంది తొలి టెస్టు. అయితేనేం.. తాను బరిలోకి దిగితే అది ఏస్థాయి క్రికెటైనా ఒకటే.. అన్నట్టుగా ‘వండర్‌ కిడ్‌’ పృథ్వీ షా అంతర్జాతీయ స్థాయిలో ఘనంగా అరంగేట్రం చేసాడు. ఇప్పటిదాకా స్కూల్‌ క్రికెట్‌ కావచ్చు.. దేశవాళీలు కావచ్చు.. తాను బ్యాట్‌ పడితే రికార్డుల మోతే అన్నట్టుగా సాగిన అతడి ఆటతీరు సీనియర్‌ జట్టులోనూ కనిపించింది. కొత్తదనం కనిపించకుండా, బెరుకుతనం లేకుండా మైదానంలో తలపండిన మేధావులతో సరిసమానంగా ఆడుతూ సరికొత్త రికార్డులను సృష్టించాడు. ఓవరాల్‌గా షా, పుజార కీలక భాగస్వామ్యాలతో తొలి టెస్టులో తొలి రోజే విరాట్‌సేన పట్టు బిగించింది.

వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత జట్టు తొలి రోజే పూర్తి ఆధిక్యాన్ని ప్రదర్శించింది. దేశవాళీ, ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌ల్లో దుమ్ము రేపినట్టుగానే టీనేజ్‌ సెన్సేషన్‌ పృథ్వీ షా (154 బంతుల్లో 19 ఫోర్లతో 134) తన తొలి అంతర్జాతీయ మ్యాచ్‌లోనే శతకంతో అహో అనిపించాడు. ఫలితంగా మొదటి రోజు గురువారం నాడు ఆట ముగిసే సమయానికి భారత్‌ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 89 ఓవర్లలో నాలుగు వికెట్లకు 364 పరుగులు చేసింది. విండీ్‌సతో జరిగిన టెస్టుల్లో తొలి రోజున భారత్‌కిదే అత్యధిక స్కోరు కావడం వి శేషం. ఓపెనర్‌ రాహుల్‌ డకౌట్‌గా వెనుదిరగ్గా చటేశ్వర్‌ పుజారా (130 బంతుల్లో 14 ఫోర్లతో 86), విరాట్‌ కోహ్లీ (137 బంతుల్లో 4 ఫోర్లతో 72 బ్యాటింగ్‌) హాఫ్‌ సెంచరీలు చేసారు. రహానె (41) ఫర్వాలేదనిపించాడు. క్రీజు లో కోహ్లీతో పాటు రిషభ్‌ పంత్‌ (17 బ్యాటింగ్‌) ఉన్నా డు. విండీస్‌ కెప్టెన్‌ జేసన్‌ హోల్డర్‌ మోకాలి గాయం కారణంగా మ్యాచ్‌కు దూరం కావడంతో బ్రాత్‌వైట్‌ సారథిగా వ్యవహరించాడు.

విరామం నుంచి వచ్చిన తర్వాత కూడా పృథ్వీ-పుజార భాగస్వామ్యం నిలకడగా కొనసాగింది. ఈ క్రమంలో పాయింట్‌లోకి బంతిని పంపి అంతర్జాతీయ కెరీర్‌లో తొలి పరుగు సాధించిన పృథ్వీ.. సరిగ్గా దానినే పునరావృతం చేసి కెరీర్‌లో తొలి సెంచరీ (99 బంతులు)ని సాధించాడు. శతకంలో సగానికిపైగా పరుగులు కేవలం బౌండరీల ద్వారానే వచ్చాయంటే ఈ ముంబై ప్లేయర్ ఎంత దూకుడు చూపెట్టాడో అర్థం చేసుకోవచ్చు. సెంచరీ తర్వాత కూడా పృథ్వీ జోరు తగ్గకపోయినా.. రెండో ఎండ్‌లో పుజార వికెట్ పారేసుకున్నాడు. 43వ ఓవర్‌లో లూయిస్ బంతి ని డ్రైవ్ చేయబోయి కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు. దాంతో రెండో వికెట్‌కు 206 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. కెప్టెన్ కోహ్లీ రాకతో పృథ్వీ మరింత మెరుగ్గా ఆడినా.. దురదృష్టవశాత్తు టీ విరామానికి నాలుగు బంతుల ముందు ఔటయ్యాడు. 51వ ఓవర్‌లో బిషూ వేసిన ఫుల్ లెంగ్త్ బంతిని స్ట్రెయిట్ డ్రైవ్ కొట్టబోయి అతనికే క్యాచ్ ఇచ్చాడు. విరాట్, షా మధ్య మూడో వికెట్‌కు 23 పరుగులు జతయ్యాయి. 232/3 స్కోరుతో మూడో సెషన్ మొదలుపెట్టిన కోహ్లీ, రహానే నిలకడగా ముందుకెళ్లారు. నాలుగో వికెట్‌కు 105 పరుగులు జోడించి భారీ స్కోరుకు బాటలు వేశారు. ఓవరాల్‌గా రెండు కీలక భాగస్వామ్యాలు జతకావడంతో తొలిరోజే భారత్ పటిష్టస్థితికి చేరుకుంది.