ఐపీఎల్‌లో ఇషాన్‌ కిషాన్‌ అరుదైన రికార్డు
Spread the love

హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా బుధవారం రాత్రి కోల్‌కతా నైట్‌ రైడర్స్ తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ యువ బ్యాట్స్‌మన్ ఇషాన్‌ కిషాన్‌ చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ దినేశ్ కార్తీక్ ముంబై ఇండియన్స్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.

ఇషాన్‌ కిషన్‌.. ఆడిన రెండో బంతికే సిక్సర్‌ బాదిన ఈ కుర్రాడు.. ఉన్నంతసేపు కోల్‌కతా బౌలర్లకు చుక్కలు చూపించాడు. ముఖ్యంగా స్పిన్‌ బౌలింగ్‌ను  ఊచకోత కోస్తూ మైదానం నలుమూలలా ఫోర్లు, సిక్సర్ల మోత మోగించేశాడు. 17 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఈ సీజన్‌లో వేగవంతమైన హాఫ్ సెంచరీ సాధించిన మూడో బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు. ఈ సీజన్‌లో కింగ్స్‌ పంజాబ్‌ ఆటగాడు కేఎల్‌ రాహుల్‌ 14 బంతుల్లో హాఫ్‌ సెంచరీ సాధించి ఐపీఎల్‌ చరిత్రలోనే వేగవంతమైన సెంచరీ నమోదు చేయగా.. కోల్‌కతా ఆటగాడు సునీల్‌ నరైన్‌ 17 బంతుల్లో హాఫ్ సెంచరీని నమోదు చేశారు.

Mumbai Indians beat Kolkata Knight Riders

మొత్తంగా 21 బంతుల్లోనే 62 పరుగులు చేసిన కిషన్‌.. ముంబయి ఇన్నింగ్స్‌కు వాయు వేగాన్నందించాడు. కోల్‌కతా ముందు 211 పరుగుల భారీ లక్ష్యాన్ని నిలిపిన ముంబయి.. ప్రత్యర్థిని 108 పరుగులకే కుప్పకూల్చి, ఈ ఐపీఎల్‌లో పరుగుల పరంగా అత్యంత భారీ విజయాన్ని నమోదు చేసింది. వరుసగా మూడో విజయం సాధించిన ముంబయి.. నెట్‌రన్‌రేట్‌నూ భారీగా పెంచుకుని పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకడం విశేషం. వారం కిందటి వరకు ఎనిమిది మ్యాచ్‌ల్లో ఆరు ఓటములతో ప్లేఆఫ్‌ రేసు నుంచి నిష్క్రమించడానికి వడివడిగా అడుగులేస్తున్నట్లు కనిపించింది ముంబయి. కానీ అనూహ్యంగా పుంజుకున్న ఆ జట్టు హ్యాట్రిక్‌ విజయాలతో ఇప్పుడు ప్లేఆఫ్స్‌కు గట్టి పోటీదారుగా మారింది. రెండు రోజుల కిందటే తన సొంతగడ్డపై కోల్‌కతాను ఓడించిన ఆ జట్టు.. బుధవారం ఆ జట్టును వారి గడ్డపై చిత్తు చేసింది.

ఏకంగా 102 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ఇషాన్‌ కిషన్‌ (62; 21 బంతుల్లో 5×4, 6×6) మెరుపులతో ముంబయి 20 ఓవర్లలో 6 వికెట్లకు 210 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం కృనాల్‌ పాండ్య (2/12), హార్దిక్‌ పాండ్య (2/16)లతో పాటు మిగతా బౌలర్లూ సమష్టిగా సత్తా చాటడంతో కోల్‌కతా 18.1 ఓవర్లలో 108 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టు ఏ దశలోనూ లక్ష్యాన్ని ఛేదించేలా కనిపించలేదు. విధ్వంసక ఓపెనర్లు నరైన్‌ (4), లిన్‌ (21) విఫలమవడంతోనే కోల్‌కతా అవకాశాలకు గట్టి దెబ్బ పడింది. ఉతప్ప (14), నితీశ్‌ రాణా (21) కూడా ఎంతోసేపు క్రీజులో నిలవలేదు. రసెల్‌ (2), దినేశ్‌ కార్తీక్‌ (5) కూడా చేతులెత్తేయడంతో నైట్ రైడర్స్ కు భారీ ఓటమి ఖరారైంది. 67 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన ఆ జట్టు అతి కష్టం మీద వంద దాటగలిగింది. నాలుగేళ్లుగా ముంబయిపై కోల్‌కతా ఒక్క మ్యాచూ గెలవకపోవడం గమనార్హం. ఆ జట్టుపై ముంబయికిది వరుసగా ఎనిమిదో విజయం. పరుగుల పరంగా ఐపీఎల్‌లో ముంబయికి ఇదే అతి పెద్ద గెలుపు కావడం విశేషం. 11 మ్యాచ్‌ల్లో కోల్‌కతాకిది ఐదో ఓటమి. అన్నే విజయాలతో ఉన్న ముంబయి.. నెట్‌రన్‌రేట్‌ను భారీగా పెంచుకోవడం ద్వారా పాయింట్ల పట్టికలో ఆ జట్టును వెనక్కి నెట్టింది.