సచిన్‌ రికార్డును సమం చేయనున్న కోహ్లి, ధోనీ!
Spread the love

టీమిండియాలో సచిన్ టెండూల్కర్ తర్వాత ఆ స్థాయి క్రేజ్ సంపాదించిన క్రికెటర్లు ఇద్దరే. అందులో మొదటి వ్యక్తి ధోనీ కాగా.. మరొకరు విరాట్ కోహ్లి. ప్రపంచంలోనే బెస్ట్ ఫినిషర్‌గా, ధోనీ స్పెషల్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక రన్‌మెషీన్‌గా సచిన్ సాధించిన ప్రతి రికార్డునూ విరాట్ కోహ్లి వేటాడే పనిలో ఉన్నాడు. అయితే ఈ ఇద్దరూ ప్రస్తుతం ఒకే రికార్డు వేటలో ఉన్నారు. వెస్టిండీస్‌తో విశాఖపట్నంలో బుధవారం జరగబోయే రెండో వన్డేలోనే ఈ ఇద్దరూ రికార్డు అందుకుంటే చూడాలని అభిమానులు ఆశ పడుతున్నారు. తొలి వన్డేలో 140 పరుగులు చేసిన విరాట్.. ప్రస్తుతం వన్డేల్లో పది వేల పరుగులు మైలురాయిని అందుకోవడానికి కేవలం 81 పరుగుల దూరంలో ఉన్నాడు. అతను ఈ మార్క్ చేరుకుంటే వన్డేల్లో పది వేల పరుగులు చేసిన నాలుగో ఇండియన్‌గా, ఓవరాల్‌గా 13వ బ్యాట్స్‌మన్‌గా నిలుస్తాడు.

కోహ్లి ప్రస్తుతం 204 ఇన్నింగ్స్ ఆడాడు. ప్రస్తుతం 259 ఇన్నింగ్స్‌తో సచిన్ పేరిట ఈ రికార్డు ఉంది. ఆ రికార్డు తెరమరుగవడం ఖాయంగా కనిపిస్తున్నది. ఇక వెస్టిండీస్‌పై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మన్‌గా నిలవడానికి కోహ్లి 47 పరుగుల దూరంలో ఉన్నాడు. ఇక్కడా సచిన్ రికార్డును అతను బ్రేక్ చేయనున్నాడు. అటు ధోనీ ఇప్పటికే వన్డేల్లో పది వేల మార్క్‌ను అందుకున్నా.. అందులో 174 పరుగులు ఆసియా ఎలెవన్ తరఫున సాధించినవి ఉన్నాయి. అతడు కేవలం ఇండియా తరఫున పది వేల మార్క్ అందుకోవడానికి ఇంకా 51 పరుగుల దూరంలో ఉన్నాడు. మరి తనకు ఎంతగానో అచ్చొచ్చిన వైజాగ్‌లో ధోనీ ఈ మార్క్ అందుకుంటాడేమో చూడాలి.