ఎలిమినేటర్‌లో కోల్‌కతా విజయం, సన్‌రైజర్స్‌తో క్వాలిఫయర్‌-2
Spread the love

హైదరాబాద్: ఈడెన్ గార్డెన్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌‌నైడర్స్ 25 పరుగుల తేడాతో విజయం సాధించింది. కోల్‌కతా నిర్దేశించిన 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 144 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇరు జట్లకూ ఈ మ్యాచ్ ప్రతిష్టాత్మకం కావడంతో హోరాహోరీగా తలపడ్డాయి. కోల్‌కతా జట్టు ఈనెల 25న జరిగే రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడుతుంది.

170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్‌కు ఓపెనర్లు రాహుల్‌ త్రిపాఠి, రహానేలు మంచి శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు 47 పరుగుల భాగస్వామ్యం జోడించిన అనంతరం చావ్లా బౌలింగ్‌ త్రిపాఠి(20: 13 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్స్‌లు) రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చి  పెవిలియన్‌ చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన సంజూ శాంసన్‌తో రహానే ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. జట్టు స్కోర్‌ 109 పరుగుల వద్ద రహానే 46(41 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌) కుల్దీప్‌కు రిటర్న్‌క్యాచ్‌ ఇచ్చి తృటిలో హాఫ్‌సెంచరీ చేజార్చుకున్నాడు. దీంతో రెండో వికెట్‌కు నమోదైన 62 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వచ్చిన క్లాసెన్‌తొ శాంసన్‌ వేగంగా ఆడే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో 37 బంతుల్లో 4 ఫోర్లు 2 సిక్స్‌లతో శాంసన్‌ అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే ఆ మరుసటి బంతికే భారీషాట్‌కు ప్రయత్నించి క్యాచ్‌ఔట్‌గా వెనుదిరిగాడు. చివర్లో కోల్‌కతా బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో పరుగులు తీయలేక ఇబ్బంది పడ్డారు. దీంతో రాజస్తాన్‌  నిర్ణీత 20 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 144 పరుగులు మాత్రమే చేయగలిగింది.

బ్యాటింగ్‌లో కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌(52; 38 బంతుల్లో 4×4, 2×6), రస్సెల్‌(49; 25 బంతుల్లో 3×4, 5×6)  రాణించగా.. బౌలర్లందరు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసి విజయంలో కీలక పాత్ర పోషించారు. అయితే మధ్య ఓవర్లలో దినేష్‌ కార్తీక్‌ నిలబడగా ఆఖర్లో రస్సెల్‌ హవా సాగించాడు. గౌతమ్‌ వేసిన ఇన్నింగ్స్‌ తొలి బంతినే బౌండరీగా మలిచిన నరైన్‌ (4) రెండో బంతికే అవుటయ్యాడు. ఆ తర్వాత తన రెండో ఓవర్‌లో ఊతప్ప (3)ను రిటర్న్‌ క్యాచ్‌తో పంపాడు. ఇక రాణా (3)ను ఆర్చర్‌ అవుట్‌ చేయగా ఈ సమయంలో లిన్‌ (18)తో దినేష్‌ కార్తీక్‌ కలిసి కొద్దిసేపు వికెట్ల పతనాన్ని ఆపగలిగాడు. ఆరో ఓవర్‌లో కార్తీక్‌ రెండు ఫోర్లు బాదగా లిన్‌ మరో ఫోర్‌ బాదడంతో పవర్‌ప్లేలో 46 పరుగులు చేయగలిగింది. అయితే లిన్‌ను గోపాల్‌ రిటర్న్‌ క్యాచ్‌తో అవుట్‌ చేశాడు. ఈ దశలో కార్తీక్‌కు గిల్‌ సహకారం అందించాడు. 14వ ఓవర్‌లో గిల్‌ 4,6 బాదగా కెప్టెన్‌ మరో ఫోర్‌ తీయడంతో 20 పరుగులు వచ్చాయి. కానీ గిల్‌ను ఆర్చర్‌ అవుట్‌ చేయడంతో ఐదో వికెట్‌కు 55 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. 17 ఓవర్‌లో కార్తీక్‌ ఓ సిక్సర్‌, రస్సెల్‌ 6,4తో చెలరేగగా 19 పరుగులు వచ్చాయి. కానీ 18వ ఓవర్‌లో లాగ్లిన్‌.. కార్తీక్‌ను అవుట్‌ చేసినా అటు రెండు సిక్సర్లతో రస్సెల్‌ ధాటి కొనసాగించాడు. తుదికంటా నిలిచిన అతడు జట్టుకు పటిష్ట స్కోరును అందించాడు.

ఈ విజయంతో కోల్‌కతా నైట్‌రైడర్స్ శుక్రవారం ఇదే వేదికగా క్వాలిఫయిర్-2లో సన్ రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ముంబైలోని వాంఖడె వేదికగా ఆదివారం జరిగే ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. చెన్నై ఇప్పటికే ఐపీఎల్ ఫైనల్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే.