దుమ్ము  రేపిన కోల్‌కతా
Spread the love

28 పరుగులతో పంజాబ్‌ చిత్తు

రసెల్‌ 17 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 48

రాబిన్‌ ఉతప్ప, నితీశ్‌ రాణా అర్ధ సెంచరీలు

కోల్‌కతా కోటలో నైట్‌రైడర్స్‌ మళ్లీ చెలరేగింది. తొలి మ్యాచ్‌లో భారీ లక్ష్యాన్ని ఛేదించి విజయాన్ని నమోదు చేసిన కార్తీక్‌ సేన ఈసారి భారీ స్కోరుతో గెలుపును ఖాయం చేసుకుంది. ఆండ్రీ రసెల్‌ తనకే సాధ్యమైన రీతిలో భీకర బ్యాటింగ్‌ ప్రదర్శన కనబర్చగా… రాబిన్‌ ఉతప్ప, నితీశ్‌ రాణా సెంచరీ భాగస్వామ్యం జట్టును గెలిపించింది. బౌలర్ల సమష్టి వైఫల్యంతో ముందే మ్యాచ్‌పై కింగ్స్‌ ఎలెవన్‌ ఆశలు కోల్పోగా… మయాంక్, మిల్లర్‌ మెరుపులు ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించగలిగాయి.

కోల్‌కతా: సొంతగడ్డపై కోల్‌కతా నైట్‌రైడర్స్‌ వరుసగా రెండో విజయం సాధించింది. బుధవారం ఈడెన్‌ గార్డెన్స్‌ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌ 28 పరుగుల తేడాతో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ను చిత్తు చేసింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. రాబిన్‌ ఉతప్ప (50 బంతుల్లో 67 నాటౌట్‌; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), నితీశ్‌ రాణా (34 బంతుల్లో 63; 2 ఫోర్లు, 7 సిక్సర్లు) మూడో వికెట్‌కు 66 బంతుల్లో 110 పరుగులు జోడించి భారీ స్కోరుకు పునాది వేయగా…చివర్లో ఆండ్రీ రసెల్‌ (17 బంతుల్లో 48; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగిపోయాడు. అనంతరం పంజాబ్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 190 పరుగులే చేయగలిగింది. డేవిడ్‌ మిల్లర్‌ (40 బంతుల్లో 59 నాటౌట్‌; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) మయాంక్‌ అగర్వాల్‌ (34 బంతుల్లో 58; 6 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధసెంచరీలు చేసినా జట్టును గెలిపించేందుకు అవి సరిపోలేదు.

రసెల్‌ విధ్వంసం…
కోల్‌కతా ఇన్నింగ్స్‌లో మరో 5.3 ఓవర్లు మిగిలి ఉన్న సమయంలో రసెల్‌ బ్యాటింగ్‌కు వచ్చాడు. తాను ఆడిన తొలి 7 బంతుల్లో అతను చేసింది 5 పరుగులే! అయితే ఆ తర్వాత అతని వీర విధ్వంసం మొదలైంది. టై వేసిన ఓవర్లో వరుసగా నాలుగు బంతులను 6, 4, 4, 6లుగా మలచి రసెల్‌ చెలరేగిపోయాడు. తర్వాతి ఓవర్లో షమీ బాధితుడయ్యాడు. అతని ఓవర్లో కూడా వరుసగా 6, 6, 6, 4 బాదాడు. సరిగ్గా చెప్పాలంటే తాను ఆడిన వరుస ఎనిమిది బంతుల్లో రసెల్‌ 5 సిక్సర్లు, 3 ఫోర్లతో 42 పరుగులు రాబట్టాడు. టై బౌలింగ్‌లో మరో భారీ షాట్‌కు ప్రయత్నించగా… బౌండరీ వద్ద మయాంక్‌ పట్టిన చక్కటి క్యాచ్‌తో రసెల్‌ అద్భుత ఇన్నింగ్స్‌ ముగిసింది.