ఫిట్నెస్ టెస్టు కోసం సతీమణితో కలిసి బయల్దేరిన విరాట్ కోహ్లీ
Spread the love

హైదరాబాద్: ఫిట్‌నెస్‌ టెస్టులో పాల్గొనేందుకు టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ బెంగళూరుకు ప్రయాణమైనట్లు కనిపించాడు. ఐపీఎల్‌లో హైదరాబాద్‌తో మ్యాచ్ సందర్భంగా కోహ్లీ మెడ భాగంలో గాయమైంది. దీంతో ఇంగ్లాండ్‌ వెళ్లి కౌంటీ క్రికెట్‌లో ఆడాలనుకున్న ఆశలకు గండిపడింది. చికిత్స నిమిత్తం ముంబైలో బీసీసీఐ వైద్యుల పర్యవేక్షణలో కోలుకున్న కోహ్లీ ఫిట్‌నెస్‌ టెస్టులో పాల్గొనేందుకు బెంగళూరు చేరుకున్నాడు.

జాతీయ క్రికెట్‌ అకాడమీ(ఎన్‌సీఏ)లో శుక్రవారం కోహ్లీ ఫిట్‌నెస్‌ పరీక్షలో పాల్గొననున్నాడు. జూన్‌ 14 నుంచి అఫ్గాన్‌తో జరగబోయే టెస్టు కోసం ఎంపిక చేసిన భారత బృందం సోమవారం ఫిట్‌నెస్‌ పరీక్షలో పాల్గొంది. కోహ్లీ ఫిట్‌నెస్‌ పరీక్ష పాసైతే జూన్‌ చివరి వారంలో రెండు టీ20 మ్యాచ్‌ల కోసం భారత జట్టుతో కలిసి ఐర్లాండ్‌ వెళ్తాడు. కోహ్లీ ఫిట్‌నెస్‌ ఫలితం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సీనియర్‌ ఫాస్ట్‌ బౌలర్‌ మహమ్మద్‌ షమి యో యో టెస్టులో ఫెయిలవ్వడంతో జట్టులో స్థానం కోల్పోయిన  సంగతి  తెలిసిందే.  అంతకంటే ముందు సంజూ శాంసన్  ఫెయిలవడంతో ఇంగ్లాండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌కు టీమిండియా నుంచి తప్పుకున్నాడు.

సోమవారం  రాత్రి  కోహ్లీ భార్య అనుష్క శర్మతో కలిసి ముంబై నుంచి బెంగళూరు బయల్దేరాడు. ప్రయాణం కోసం ముంబై ఎయిర్‌పోర్టుకు చేరుకున్న వీరిద్దరూ కెమెరా  కళ్లకు  కనిపించారు. ఈ ఫొటోలు ఇప్పుడు  నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. అప్పుడప్పుడు ఒకే రకం షర్టు లేదా ప్యాంటుతో కనిపించే  ఈ జంట ఇప్పుడు మాత్రం తెలుపు రంగు బూట్లు వేసుకుని కనిపించింది.

కొత్తగా  కాపురం  పెట్టిన  విరాట్‌ కోహ్లీ, అనుష్క శర్మ తమ ఇంట్లో ఓ కుక్కపిల్లను పెంచుకుంటున్నారు. దానిని  ముద్దు చేస్తూ ఇద్దరూ ఆనందిస్తున్న ఫొటోను అనుష్క ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. సింబాలిక్‌గా హార్ట్‌ ఎమోజీని క్యాప్షన్‌గా పెట్టింది.