ఐపీఎల్‌-11 ఎలిమినేటర్‌ మ్యాచ్‌
Spread the love
  • కోల్‌కతా, రాజస్తాన్‌ మధ్య నేడు ఎలిమినేటర్‌ మ్యాచ్‌
  • రాత్రి 7 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రసారం

కోల్‌కతా: ఐపీఎల్‌ ప్లేఆఫ్‌ దశలో కీలక మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ప్లేఆఫ్‌కు చేరిన నాలుగు జట్లలో ముందుగా ఇంటికెళ్లేదెవరో బుధవారం తేలనుంది. ఈడెన్‌ గార్డెన్స్‌లో జరిగే ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో దినేశ్‌ కార్తీక్‌ నేతృత్వంలోని కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో  రహానే సారథ్యంలోని రాజస్తాన్‌ రాయల్స్‌ ఎలిమినేటర్‌ సమరానికి తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్‌లో ఓడే జట్టు ఇంటిముఖం పడుతుంది. గెలిచే జట్టు శుక్రవారం రెండో క్వాలిఫయర్‌ ఆడుతుంది. ఇప్పటిదాకా ప్రదర్శన చూస్తే.. ఎలిమినేటర్‌లో కోల్‌కతానే ఫేవరెట్‌. ఆ జట్టు లీగ్‌ దశలో నిలకడగానే ఆడింది. 8 విజయాలు సాధించింది. అందులోనూ చివరి దశలో ఆ జట్టు అద్భుతంగా పుంజుకుని చెన్నై, సన్‌రైజర్స్‌ లాంటి బలమైన జట్లపై ఘనవిజయాలు సాధించింది. లీగ్‌ దశలో రాజస్థాన్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఆ జట్టు ఘనవిజయాలు సాధించింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్‌ తిరుగులేని ఫామ్‌లో ఉన్నారు. ఈ సీజన్లో ఆ జట్టు చాలా దూకుడుగా ఆడింది. ఎలిమినేటర్‌ మ్యాచ్‌ సొంతగడ్డ ఈడెన్‌గార్డెన్స్‌లో జరగబోతుండటం కూడా నైట్‌రైడర్స్‌కు మరో సానుకూలత. మరోవైపు రాజస్థాన్‌ ప్లేఆఫ్‌కు చేరడం అనూహ్యమే.

దినేశ్‌ కార్తీక్‌ సారథిగా నైట్‌రైడర్స్‌ను ముందుండి నడిపిస్తున్నాడు. అతను ఈ సీజన్‌లో54.78 సగటుతో 438 పరుగులు చేసి కోల్‌కతా టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. నరైన్‌ ఆల్‌రౌండర్‌ పాత్రలో ఒదిగిపోతున్నాడు. ఆరంభంలో అసాధారణ స్థాయిలో రాణిస్తున్న ఇతన్ని ప్రత్యర్థి బౌలర్లు పవర్‌ ప్లే వరకు ఉంచినా కష్టమే. ఓపెనింగ్‌లో నరైన్, లిన్‌ శుభారంభాలిచ్చిన మ్యాచ్‌ల్లో కోల్‌కతా తేలిగ్గా గెలిచింది. రసెల్‌ వీరవిహారం జట్టుకు మిసైల్‌ బలం కానుంది. ఆరంభ మ్యాచ్‌ల్లో అతను సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించిన వైనం అద్భుతం. బ్యాటింగ్‌లో వీరితో పాటు రాబిన్‌ ఉతప్ప, నితీశ్‌ రాణా, శుబ్‌మన్‌ గిల్‌లు జట్టు భారీస్కోరుకు బాటలు వేయగల సమర్థులు. బౌలింగ్‌లో సియర్లెస్, ప్రసిధ్‌లతో పాటు స్పిన్నర్లు కుల్దీప్, చావ్లాలు ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయగలరు.

రాయల్స్‌ నిలకడలేమితో సతమతమవుతోంది. ఆ జట్టు ఆరంభంలో పేలవంగా ఆడింది. ఐతే ప్లేఆఫ్‌కు దారులు మూసుకుపోతున్న స్థితిలో గొప్పగా పుంజుకుని మళ్లీ రేసులోకి వచ్చింది. మిగతా జట్ల వైఫల్యం కూడా కలిసొచ్చి ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టింది.  బట్లర్‌ వీరోచిత విన్యాసంతో నెగ్గుకొచ్చిన ఈ జట్టుకు అతను స్వదేశం చేరడం పెద్ద లోటు. పాక్‌తో టెస్టు కోసం బట్లర్‌ తిరిగి ఇంగ్లండ్‌ వెళ్లాడు. శామ్సన్‌ ఒకటి అర మినహా సీజన్‌ అంతా అకట్టుకోలేకపోయాడు. భారీ లక్ష్యాలను ఛేదించే సత్తా ఇప్పటి రాయల్స్‌ జట్టుకు లేదనే చెప్పాలి. ప్రస్తుతం నైట్‌రైడర్స్‌ను గెలవాలంటే తప్పకుండా జట్టంతా కలిసి సర్వశక్తులు ఒడ్డాల్సిందే. రహానే, షార్ట్, త్రిపాఠి సమష్టిగా రాణిస్తేనే ప్రత్యర్థి ముందు కష్టసాధ్యమైన లక్ష్యాన్ని నిర్దేశించగలదు. బౌలింగ్‌లో ఆర్చర్‌ వైవిధ్యం జట్టుకు కలిసివస్తోంది. శ్రేయస్‌ గోపాల్‌ గత మ్యాచ్‌లో బెంగళూరు భరతం పట్టాడు. అలాంటి ప్రదర్శనే ఇక్కడా పునరావృతం కావాలని జట్టు మేనేజ్‌మెంట్‌ ఆశిస్తోంది.

జట్లు (అంచనా)

కోల్‌కతా నైట్‌రైడర్స్‌: దినేశ్‌ కార్తీక్‌ (కెప్టెన్‌), సునీల్‌ నరైన్, లిన్, రాబిన్‌ ఉతప్ప, రసెల్, నితీశ్‌ రాణా, శుబ్‌మన్‌  గిల్, పియూష్‌ చావ్లా, కుల్దీప్‌ యాదవ్, సియర్లెస్, ప్రసిధ్‌ కృష్ణ.

రాజస్తాన్‌ రాయల్స్‌: రహానే (కెప్టెన్‌), రాహుల్‌ త్రిపాఠి, సంజూ శామ్సన్, షార్ట్, కృష్ణప్ప గౌతమ్, ఆర్చర్, క్లాసెన్, కులకర్ణి, శ్రేయస్‌ గోపాల్, ఉనాద్కట్, లాఫ్లిన్‌.