వన్డే సిరీస్‌లో రాయుడు, అయ్యర్‌కు చోటు
Spread the love

బెంగళూరు: టీమిండియా త్వరలో జరుగనున్న వివిధ సిరీస్‌లలో పాల్గొనే జట్లను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సెలక్షన్ కమిటీ మంగళవారం ప్రకటించింది. ఆఫ్ఘానిస్థాన్‌తో జరిగే ఏకైక టెస్ట్ మ్యాచ్, ఐర్లాండ్‌తో జరుగనున్న రెండు టీ-20ల సిరీస్, ఇంగ్లాండ్‌తో జరుగనున్న మూడు టీ-20ల సిరీస్, మూడు వన్డేల సిరీస్‌లకుగాను టీమిండియా జట్టు సభ్యులను చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ఇంగ్లాండ్ వన్డే సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో అంబటి రాయుడు, అయ్యర్‌లకు చోటు దక్కగా, టీ-20లో సిద్ధార్థ కౌల్‌కు భారత జట్టులో చోటు దక్కింది. ఆఫ్ఘానిస్థాన్‌తో జరుగనున్న చారిత్రక టెస్ట్ మ్యాచ్‌కు భారత రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ కౌంటీ మ్యాచ్‌ల్లో పాల్గొనేందుకు ఇంగ్లాండ్ వెళుతున్న సందర్భంగా ఆయన స్థానంలో జట్టు కెప్టెన్‌గా అజింక్య రహానేను ఎంపిక చేసింది.

ఐర్లాండ్‌తో జరిగే రెండు టీ-20ల సిరీస్‌తో పాటు ఇంగ్లాండ్‌తో జరిగే వన్డే, టీ-20 సిరీస్‌ల్లో సిద్ధార్థ కౌల్‌కు బెర్త్ ఖాయమైంది. గతంలో శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో కౌల్‌కు చోటుదక్కినప్పటికీ మ్యాచ్‌లో ఆడే అవకాశం రాలేదు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడుతున్న కౌల్ అద్భుతంగా రాణిస్తుండటంతో టీమిండియా జట్టులోకి మరోసారి పిలుపు అందింది. పరిమిత ఓవర్ల సిరీస్‌లో తలపడే భారత జట్టుకు విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. జూన్ 14న బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో భారత్- ఆఫ్ఘానిస్థాన్‌ జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. జూలై 3 నుంచి ఇంగ్లాండ్‌తో టీ-20 సిరీస్ నిర్వహించనున్నారు. విధంగా వన్డే సిరీస్ జూలై 12వ తేదీ నుంచి ప్రారంభం కానున్నది.

Karun Nair Ambati Rayudu returns to Test squad

ఐపీఎల్‌లో అదరగొడుతున్న తెలుగు తేజం అంబటి తిరుపతి రాయుడును మరోసారి భారత జట్టు అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. ఇంగ్లండ్‌తో జరిగే వన్డే సిరీస్‌లో తలపడే జట్టులోకి రాయుడును సెలక్టర్లు ఎంపిక చేశారు. దాదాపు రెండేళ్ల తర్వాత అతను టీమిండియాలోకి పునరాగమనం చేయడం విశేషం. కేదార్‌ జాదవ్‌ గాయపడటం, మనీశ్‌ పాండే వరుస వైఫల్యాలతో మిడిలార్డర్‌లో ఒక ప్రధాన బ్యాట్స్‌మన్‌ అవసరం జట్టుకు కలిగింది. ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు సరైన ఆటగాడిగా రాయుడును ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ గుర్తించింది. 2017–18 దేశవాళీ వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీలో రాయుడు 5 మ్యాచ్‌లలో (నిషేధం కారణంగా 2 మ్యాచ్‌లు ఆడలేదు) 43.20 సగటుతో 216 పరుగులు చేశాడు. తాజాగా ఐపీఎల్‌లో అతని ప్రదర్శన సెలక్టర్లను ఆకర్షించింది. ఇప్పటివరకు చెన్నై తరఫున 10 మ్యాచ్‌లలో 151.61 స్ట్రైక్‌రేట్‌తో 423 పరుగులు చేసిన రాయుడు, అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. అయితే అనూహ్యంగా రాయుడుకు టి20 టీమ్‌లో మాత్రం స్థానం లభించలేదు. గత ఏడాది శ్రీలంకతో వన్డే సిరీస్‌ తర్వాత జట్టులో చోటు కోల్పోయిన లోకేశ్‌ రాహుల్‌కు మళ్లీ అవకాశం లభించింది. రాహుల్‌ భారత్‌ తరఫున ఇప్పటి వరకు 10 వన్డేలు ఆడాడు. ఇప్పటి వరకు టెస్టు జట్టులో రెగ్యులర్‌గా ఉన్న ఉమేశ్‌ యాదవ్‌కు తాజాగా వన్డే, టి20 జట్లలో కూడా స్థానం లభించింది. ఐపీఎల్‌లో చక్కటి ప్రదర్శన కనబర్చడం అతనికి అనుకూలంగా మారింది. గత ఏడాది సెప్టెంబర్‌లో తన ఆఖరి వన్డే ఆడిన ఉమేశ్‌… టి20ల్లో ఒకే ఒక మ్యాచ్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఇప్పటికే టి20 జట్టులో ఉన్న సుందర్‌కు వన్డేల్లో మరోసారి పిలుపొచ్చింది.