కోల్‌కతా కమాల్‌…  టాప్ లేపిన శుభ్‌మన్ గిల్
Spread the love

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ అదరగొట్టింది. ప్లేఆఫ్స్‌లో స్థానం కోసం పోటీ పెరుగుతున్న సమయంలో చక్కని ప్రదర్శన చేసింది. యువ బ్యాట్స్‌మన్‌ శుభ్‌మన్‌ గిల్‌, సునీల్‌ నరైన్‌, దినేశ్‌ కార్తీక్‌ మెరిసిన వేళ.. బలమైన చెన్నైని ఓడించింది. కోల్‌కతాకు ఇది ఐదో విజయం. చెన్నై మూడో  పరాజయాన్ని చవిచూసింది. ధోని మెరుపు ఇన్నింగ్స్‌ వృథా అయింది.

కోల్‌కతా : ఐపీఎల్‌ చరిత్రలో సొంతగడ్డపై ఛేదనలో తమ గెలుపును కట్టడిచేయడం అంత సులువు కాదని కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టు మరోసారి నిరూపించింది. గురువారం ఈడెన్‌ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో పటిష్టమైన జట్టుగా గుర్తింపు పొందిన చెన్నై సూపర్‌కింగ్స్‌పై కేకేఆర్‌ చక్కటి ఆటతీరుతో 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ప్రతీకారం తీర్చుకుంది. తమ తొలి మ్యాచ్‌లో 202 పరుగుల భారీ స్కోరు సాధించినా ఓటమి రుచి చూపించిన చెన్నై సూపర్‌ కింగ్స్‌పై ఈసారి సమష్టిగా రాణించి దెబ్బతీసింది. ముందుగా బౌలర్ల రాణింపునకు తోడు బ్యాటింగ్‌లో శుబ్‌మన్‌ గిల్‌ (36 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 57 నాటౌట్‌) అజేయ అర్ధసెంచరీ, దినేశ్‌ కార్తీక్‌ (18 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 45 నాటౌట్‌) మెరుపు ఆట కారణంగా 6 వికెట్ల తేడాతో నెగ్గింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్లకు 177 పరుగులు చేసింది. ధోనీ (25 బంతుల్లో 1 ఫోర్‌, 4 సిక్సర్లతో 43 నాటౌట్‌) టాప్‌ స్కోరర్‌గా నిలవగా వాట్సన్‌ (25 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 36) ఫర్వాలేదనిపించాడు. చావ్లా, సునీల్‌ నరైన్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 17.4 ఓవర్లలో 4 వికెట్లకు 180 పరుగులు చేసింది. నరైన్‌ (20 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 32) రాణించాడు. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ నరైన్‌కు దక్కింది..

ipl kkr vs csk live score

గిల్‌ అదుర్స్‌: కోల్‌కతా ఇన్నింగ్స్‌లో టీనేజ్‌ స్టార్‌ శుబ్‌మన్‌ గిల్‌ మెరిశాడు. ఎలాంటి తడబాటు లేకుండా అతడాడిన ఇన్నింగ్స్‌ ఆకట్టుకుంది. దినేశ్‌ కార్తీక్‌ ఎప్పటిలాగే ఆకట్టుకోవడంతో కోల్‌కతా సులువుగానే టార్గెట్‌ను అందుకుంది. ఓపెనర్‌ క్రిస్‌ లిన్‌ (12) తొలి ఓవర్‌లోనే రెండు సిక్సర్లతో మోత మోగించినా అదే ఓవర్‌లో వాట్సన్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. ఇక రెండో ఓవర్‌లో మరో ఓపెనర్‌ నరైన్‌.. ఆసిఫ్‌ బౌలింగ్‌లో వరుసగా వైడ్‌ మిడా్‌ఫలో ఇచ్చిన రెండు సులువైన క్యాచ్‌లను అద్భుత ఫీల్డర్‌గా పేరున్న జడేజా వదిలేశాడు. దీన్ని సద్వినియోగం చేసుకుంటూ అతడు మరుసటి ఓవర్‌లోనే రెండు ఫోర్లతో విజృంభించగా ఊతప్ప మరో బౌండరీ తీశాడు. ఆసిఫ్‌ ఈసారి ఊతప్ప (6)ను అవుట్‌ చేయడంతో బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందుగానే క్రీజులోకి వచ్చిన శుబ్‌మన్‌ గిల్‌ ఆరో ఓవర్‌లో మూడు ఫోర్లతో అలరించాడు.దీంతో కేకేఆర్‌ పవర్‌ప్లేలో 56 పరుగులు సాధించింది.

చెన్నై ఇన్నింగ్స్‌లో దాదాపు  ప్రతి బ్యాట్స్‌మన్‌ బ్యాటు ఝళిపించాడు. కానీ ఎవరి నుంచి మరీ పెద్ద ఇన్నింగ్స్‌ జాలువారలేదు. కోల్‌కతా స్పిన్నర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో చెన్నై ఎక్కువ వేగంతో పరుగులు రాబట్టలేకపోయింది. ఐతే 12వ ఓవర్లో క్రీజులోకి వచ్చిన కెప్టెన్‌ ధోని మెరుపు బ్యాటింగ్‌తో అజేయంగా నిలిచి జట్టు మెరుగైన స్కోరు సాధించడంతో కీలక పాత్ర పోషించాడు. లేదంటే చెన్నై కాస్త తక్కువ స్కోరుతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చేది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నైకి ఓపెనర్లు వాట్సన్‌, డుప్లెసిస్‌ (27; 15 బంతుల్లో 4×4, 1×6) మెరుపు ఆరంభాన్నిచ్చారు. 5 ఓవర్లలో స్కోరు  48/0. వాట్సన్‌ వీలైనప్పుడల్లా బంతిని బౌండరీ దాటిస్తూ అలరించాడు. ఐతే ఎక్కువ దూకుడు డుప్లెసిస్‌దే..ఐతే అద్భుత ఫామ్‌లో ఉన్న ధోని తనదైన శైలిలో విరుచుకుపడడంతో ఆఖరి ఐదు ఓవర్లలో 56 పరుగులు పిండుకుంది. శివమ్‌ మావి బౌలింగ్‌లో మిడ్‌వికెట్లో బలమైన సిక్స్‌ బాదిన ధోని.. జాన్సన్‌కు రెండు సార్లు చుక్కలు చూపించాడు. కుల్‌దీప్‌ బౌలింగ్‌లోనూ ఓ సిక్స్‌ కొట్టాడు. జడేజా (12 బంతుల్లో 12) భారీ షాట్లు ఆడలేకపోయాడు.