ఉత్కంఠ పోరులో దిల్లీ విజయం
Spread the love

ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో ఆరింటిలో ఓడి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ కీలక మ్యాచ్‌లో జూలు విదిల్చింది. యువ త్రయం రిషభ్‌ పంత్‌, శ్రేయాస్‌ అయ్యర్‌, పృథ్వీ షా మెరుపులతో పాటు బౌలర్ల కృషితో రాజస్థాన్‌పై ఉత్కంఠ విజయం సాధించి ప్లే ఆఫ్‌ అవకాశాల్ని సజీవంగా ఉంచుకుంది. జోస్‌ బట్లర్‌, డిఆర్సీ షార్ట్‌ ధనాధన్‌ బ్యాటింగ్‌తో చెలరేగినా.. రాయల్స్‌ ఓటమి తప్పించుకోలేకపోయింది.

సొంతగడ్డపై ఢిల్లీ అద్భుత విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ప్లే ఆఫ్‌ రేసులో నిలవాలంటే కచ్చితంగా నెగ్గాల్సిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టింది. బుధవారం వర్షం రెండుసార్లు అంతరాయం కలిగించిన మ్యాచ్‌లో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో నాలుగు పరుగుల తేడాతో రాజస్థాన్‌ రాయల్స్‌ను ఓడించింది. వర్షం కారణంగా 18 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ 17.1 ఓవర్లలో 6 వికెట్లకు 196 పరుగులు చేసింది. రిషభ్‌ పంత్‌ (29 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 69), శ్రేయాస్‌ అయ్యర్‌ (35 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 50), పృథ్వీ షా (25 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 47) మెరుపు ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకున్నారు. అయితే, మరో ఐదు బంతుల్లో ఢిల్లీ బ్యాటింగ్‌ ముగుస్తుందనగా.. వర్షం మరోసారి అంతరాయం కలిగించింది. దాంతో, ఢిల్లీ ఇన్నింగ్స్‌ ముగిసినట్టు ప్రకటించిన అంపైర్లు డక్‌వర్త్‌ పద్ధతి ప్రకారం రాజస్థాన్‌ లక్ష్యాన్ని 12 ఓవర్లలో 151 పరుగులుగా లెక్కగట్టారు. అనంతరం ఛేదనలో జోస్‌ బట్లర్‌ (26 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్లతో 67), డిఆర్సీ షార్ట్‌ (25 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 44) భారీ షాట్లతో చెలరేగినా.. రాజస్థాన్‌ 12 ఓవర్లలో ఐదు వికెట్లకు 146 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. కీలకమైన రెండు వికెట్లు తీయడంతో పాటు ఆఖరి ఓవర్లో అద్భుతంగా బౌలింగ్‌ చేసిన ట్రెంట్‌ బౌల్ట్‌ ఢిల్లీని గెలిపించాడు. రిషభ్‌ పంత్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది.

ఈ లక్ష్యఛేదనలో రాజస్తాన్‌ అనూహ్యంగా జోస్‌ బట్లర్‌ను ఓపెనర్‌గా పంపింది. బట్లర్‌, డీఆర్కీషార్ట్‌తో కలిసి ఆకాశమే హద్దుగాచెలరేగిపోయాడు. రాజస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో డక్‌వర్త్‌ లూయిస్‌ ఢిల్లీని ఆరంభంలో కొంపముంచింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బ్యాట్స్‌మెన్‌లు దూకుడుగా ఆడే క్రమంలో వరుసగా పెవిలియన్‌ బాట పట్టారు. నిర్ణీత ఓవర్లలో రాజస్తాన్‌ రాయల్స్‌ 5వికెట్లు కోల్పోయి 146 పరుగులే చేసింది. ఢిల్లీ బౌలర్లలో బౌల్ట్‌ రెండు వికెట్లు.. అమిత్‌ మిశ్రా, మ్యాక్స్‌వెల్‌లకు చెరో వికెట్‌ దక్కాయి.

భారీ లక్ష్యంతో బరిలో దిగిన రాజస్థాన్‌కు బట్లర్ మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన బట్లర్ (26 బంతుల్లో 67; 4×4, 7×6) ఔటయ్యాక డార్సీ షార్ట్ (25 బంతుల్లో 44) దూకుడుగా ఆడాడు. చివరి ఓవర్లో 15 పరుగులు చేయాల్సిన దశలో బౌల్ట్ 10 పరుగులు మాత్రమే ఇచ్చి త్రిపాఠి వికెట్ పడగొట్టాడు. చివరి రెండు బంతుల్లో రాజస్థాన్ విజయానికి పది పరుగులు అవసరం కాగా.. ఐదో బంతిని బౌండరీకి తరలించిన కృష్ణప్ప గౌతమ్.. ఆరో బంతికి సింగిల్ మాత్రమే తీశాడు. దీంతో నాలుగు పరుగుల తేడాతో ఢిల్లీ గెలుపొందింది.

.