ఢిల్లీపై సన్‌రైజర్స్‌ విజయం
Spread the love
  • ప్లే ఆఫ్‌కు సన్‌రైజర్స్‌ అర్హత
  • ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై 9 వికెట్లతో విజయం
  • ఈ సీజన్‌లో తొమ్మిదో గెలుపు
  • ధవన్‌, విలియమ్సన్‌ అదుర్స్‌
  • రిషభ్‌ ‘సౌ’రభం వృథా

హైదరాబాద్: ఐపీఎల్‌ 11వ సీజన్‌లో ఇప్పటి వరకూ 11మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. 9 విజయాలతో హైదరాబాద్ జట్టు ప్లేఆఫ్‌ చేరుకున్న తొలి జట్టుగా ఘనతను నమోదు చేసుకుంది. గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. బదులుగా హైదరాబాద్ జట్టు 18.5 ఓవర్లలో కేవలం ఒక వికెట్ మాత్రమే నష్టపోయి లక్ష్యాన్ని చేధించింది.

ధావన్‌ ధనాధన్‌ ముందు రిషభ్‌ పంత్‌ మెరుపులు వెలవెలబోయాయి. ఇప్పటిదాకా బౌలింగ్‌ సత్తాతో గెలిచిన సన్‌రైజర్స్‌ ఈసారి బ్యాట్‌తో పరుగుల వాన కురిపించింది. లీగ్‌ కీలక సమయంలో బ్యాటింగ్‌ కూడా బలపడటం హైదరాబాద్‌ ఆల్‌రౌండ్‌ సామర్థ్యాన్ని పరిపూర్ణం చేసింది. సన్‌రైజర్స్ తరఫున అత్యధిక పార్టనర్‌షిప్ నెలకొల్పిన (176) ధావన్-విలియమ్సన్ జోడి. వార్నర్-ధావన్ జోడి గతేడాది కోల్‌కతా మీద 139 పరుగులు జోడించారు. అంతకు ముందే ఏడాది గుజరాత్‌పై వీరిద్దరూ 137 జోడించారు. 2017లో ధావన్-విలియమ్సన్ జోడి ఢిల్లీపైనే 136 పరుగులు జోడించడం గమనార్హం.

వరుసగా ఆరో విజయాన్ని నమోదు చేసిన హైదరాబాద్:

హైదరాబాద్‌కు ఇది వరుసగా ఆరో విజయం. గత రెండేళ్లు ఆ జట్టు వరుసగా ఐదేసి చొప్పున విజయాలు సాధించింది. కానీ కోచ్ టామ్ మూడీ నమ్మకాన్ని నిలబెడుతూ ధావన్ ఢిల్లీపై చెలరేగి ఆడాడు. సొంత గడ్డ మీద సిక్స్‌‌లు, ఫోర్లతో సత్తా చాటాడు. 184 సగటుతో.. విలియమ్సన్‌తో కలిసి జట్టుకు విజయాన్ని అందించాడు. కీలకమైన ప్లేఆఫ్ ముంగిట ధావన్ తిరిగి సత్తా చాటడంతో సన్‌రైజర్స్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. గబ్బర్ ఈజ్ బ్యాక్ అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఢిల్లీ బ్యాట్స్‌మన్‌ రిషబ్‌ పంత్‌ సన్‌రైజర్స్ బౌలర్లపై అద్భుతంగా బ్యాటింగ్‌ చేశాడు. కళ్లు చెదిరే విన్యాసాలతో అలరించిన అతడు.. ఐపీఎల్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు. అయినా ఫలితం లేకపోయింది. అతడు అభిమానుల మనసులు గెలిచినా.. మ్యాచ్‌ గెలిచింది మాత్రం సన్‌రైజర్స్‌ హైదరాబాదే. పంత్‌ శ్రమతో ఢిల్లీ చేసిన స్కోరును.. శిఖర్‌ ధావన్‌, విలియమ్సన్‌ల సూపర్‌ బ్యాటింగ్‌తో సన్‌రైజర్స్‌ అలవోకగా ఛేదించింది. ఢిల్లీ ఎనిమిదో ఓటమితో నాకౌట్‌ రేసు నుంచి నిష్క్రమించిన మొదటి జట్టయింది. . అనంతరం క్రీజులోకి వచ్చిన విలియమ్సన్ (83) శిఖర్ ధావన్‌ (92)లు కలిసి జట్టుకు విజయాన్ని అందించారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 176 పరుగులు జోడించారు. ఈ ఐపీఎల్ సీజన్లో ఇదే అత్యుత్తమ పార్టనర్‌షిప్ కాగా, సన్‌రైజర్స్ తరఫున అత్యధిక భాగస్వామ్యం ఇదే కావడం విశేషం.

సన్‌రైజర్స్‌కు ఇదే అత్యధిక లక్ష్య చేధన కావడం గమనార్హం. 2014లో చెన్నై సూపర్ కింగ్స్‌పై 186 పరుగులు చేసి గెలవడమే ఛేజింగ్‌లో హైదరాబాద్‌కు అత్యధికం. సన్‌రైజర్స్ నెలకొల్పిన నాలుగు అత్యుత్తమ భాగస్వామ్యాల్లో ధావన్‌ పాత్ర ఉండటం విశేషం.