బెంగళూరుకు తప్పని ఓటమి
Spread the love

ఐపీఎల్‌లో మరో అద్భుతం… పరుగుల వరద పారిన పోరులో ఆఖరి వరకు ఉత్కంఠ… అసాధ్యంగా కనిపించిన లక్ష్యాన్ని అసాధారణ ఆటతో ఛేదించి రాయుడు, ధోని చిన్నస్వామి మైదానానికి విజయంతో పసుపు రంగు పూత పూశారు. సిక్సర్ల సునామీ సాగిన మ్యాచ్‌లో చివరకు కోహ్లిపై ‘మిస్టర్‌ కూల్‌’దే పైచేయి అయింది.  డివిలియర్స్‌ సిక్సర్ల సునామీతో 205 పరుగులు చేసిన బెంగళూరు బౌలింగ్‌ వైఫల్యంతో దానిని నిలబెట్టుకోవడంలో విఫలమైంది. రాయుడు, ధోని కూడా పోటీ పడి సిక్సర్లు బాదడంతో భారీ లక్ష్యం కూడా చిన్నబోయింది. చివరి ఓవర్లో 16 పరుగులు అవసరం కాగా… బ్రేవో ఫోర్, సిక్సర్‌తో మొదలుపెట్టగా, తనదైన శైలిలో ధోని భారీ సిక్సర్‌తో ముగించాడు.

చెన్నై సూపర్‌ కింగ్స్‌ మరో అద్భుత విజయాన్ని ఖాతాలో వేసుకుంది. అంబటి రాయుడు(53 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్సర్లతో 82), ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ధోనీ (34 బంతుల్లో ఫోర్‌, 7 సిక్సర్లతో 70 నాటౌట్‌) అసమాన ఆటతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై ఐదు వికెట్లతో బెంగళూరుపై ఉత్కంఠ విజయం సాధించింది. ప్రత్యర్థి నిర్దేశించిన 206 పరుగుల లక్ష్యాన్ని మరో రెండు బంతులు మిగిలుండగా ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. తొలుత డివిల్లీర్స్‌ (30 బంతుల్లో 2 ఫోర్లు, 8 సిక్సర్లతో 68), క్వింటన్‌ డికాక్‌ (37 బంతుల్లో ఫోర్‌, 4 సిక్సర్లతో 53) మెరుపులతో 20 ఓవర్లలో 8 వికెట్లకు 205 పరుగులు చేసింది. కానీ, దాన్ని కాపాడుకోలేకపోయింది.

ధోని, రాయుడు.. బాదుడే బాదుడు: భారీ లక్ష్యఛేదనలో తొలి ఓవర్లోనే వాట్సన్‌ (7) వికెట్‌ చేజార్చుకున్నా.. చెన్నైధాటిగానే ఆరంభించింది. రాయుడు చెలరేగడంతో పవర్‌ ప్లే ముగిసేసరికి 55/2తో నిలిచింది. ఐతే ఈ లోపు రైనా (11) కూడా ఔటయ్యాడు. ఆ తర్వాత కూడా పతనం కొనసాగింది. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో చాహల్‌.. చెన్నైకి కళ్లెం వేశాడు. అతడి మాయాజాలానికి బిల్లింగ్స్‌ (9), జడేజా (3) కూడా త్వరగానే ఔట్‌ కావడంతో చెన్నై.. 9 ఓవర్లలో 74/4తో ఇబ్బందుల్లో పడింది. సాధించాల్సిన రన్‌రేట్‌ కూడా బాగా పెరిగిపోయింది. ఆ దశలో రాయుడుకు తోడైన ధోని విధ్వంసక బ్యాటింగ్‌తో స్కోరు బోర్డును ఉరకలు పెట్టించాడు. భారీ సిక్స్‌లతో అలరించాడు. అప్పటికే నిలదొక్కుకున్న రాయుడు కూడా ధాటైన బ్యాటింగ్‌ను కొనసాగించాడు. ఏమాత్రం వీలున్నా కళ్లు చెదిరే షాట్లతో బంతిని అమాంతం స్టాండ్స్‌లో పడేశాడు. ఏమాత్రం సమయం వృథా చేయకుండా వస్తూనే బాదుడు మొదలెట్టిన ధోని.. నేగి బంతిని డీప్‌ మిడ్‌వికెట్లోకి బాది సిక్సర్ల ఖాతా తెరిచాడు. అండర్సన్‌బౌలింగ్‌లోనూ ఓ సిక్స్‌ బాదిన అతడు.. మళ్లీ నేగి బౌలింగ్‌లో వరుసగా రెండు భారీ సిక్సర్లు దంచేశాడు. రాయుడు కూడా ఓ సిక్స్‌ కొట్టడంతో ఆ ఓవర్లో మొత్తం 19 పరుగుపరుగులొచ్చాయి. అదే జోరు కొనసాగించిన రాయుడు.. సిరాజ్‌ బౌలింగ్‌లో ఓ బంతిని స్టాండ్స్‌లోకి పంపాడు. ఉమేశ్‌ క్యాచ్‌ వదిలేయడంతో బతికిపోయిన రాయుడు.. అండర్సన్‌ బౌలింగ్‌లో వరుసగా రెండు బంతులకు గరిష్ట శిక్ష వేశాడు. మరోవైపు ధోని కూడా తగ్గలేదు. ఐతే 18వ ఓవర్లో రాయుడు రనౌట్‌ కావడంతో బెంగళూరుకు కాస్త ఊరట దక్కింది. ఆఖరి రెండు ఓవర్లలో 30 పరుగులు చేయాల్సిన నేపథ్యంలో మ్యాచ్‌ ఉత్కంఠభరితంగా మారింది. ఐతే జోరు కొనసాగించిన ధోని మరో హిట్టర్‌ డ్వేన్‌ బ్రావో (14 నాటౌట్‌)తో కలిసి ప్రశాంతంగా పని పూర్తి చేశాడు.