ముంబై.. ఇంకోటి
Spread the love

ముంబై:

ప్లే ఆఫ్‌ దిశగా ముంబై ఇండియన్స్‌  మరోసారి చక్కటి ప్రదర్శన చేసింది. ముంబైకి ఇది వరుసగా రెండో గెలుపు. తప్పక గెలవాల్సిన స్థితిలో సత్తా చాటడం ముంబయి ఇండియన్స్‌కు అలవాటు. గతంలోనూ కొన్ని సీజన్లలో అలాగే లీగ్‌ ద్వితీయార్ధంలో వరుస విజయాలు సాధించి ప్లేఆఫ్‌ దశకు అర్హత సాధించింది. ఈసారి కూడా ఆ జట్టు అదే స్ఫూర్తిని కొనసాగిస్తోంది. మరో మ్యాచ్‌ ఓడితే ప్లేఆఫ్‌ అవకాశాలు చాలా సంక్లిష్టంగా మారే స్థితిలో ఆ జట్టు సత్తా చాటుతోంది. మొన్న పంజాబ్‌ను ఓడించిన ముంబై.. తాజాగా కోల్‌కతాపై నెగ్గింది. ఆదివారం బ్యాటింగ్‌, బౌలింగ్‌లో సత్తాచాటి నైట్‌రైడర్స్‌కు చెక్‌ పెట్టింది. 10 మ్యాచ్‌ల్లో ఇది ముంబై కి నాలుగో విజయం కాగా.. కోల్‌కతాకు ఐదో పరాజయం.

మొదట ముంబై భారీ స్కోరు చేసేలా కనిపించింది! కానీ కోల్‌కతా కట్టడి చేసి మ్యాచ్‌లోకి వచ్చింది. ఆ తర్వాత నైట్‌రైడర్స్‌ గెలిచేస్తుందేమో అనిపించింది. కానీ, ముంబై పుంజుకుని విజయాన్ని చేజిక్కించుకుంది. రెండు జట్లకూ సమాన అవకాశాలు వచ్చిన ఈ మ్యాచ్‌లో పరిస్థితులకు తగినట్లు ఆడలేక కోల్‌కతా ఓటమి పాలైంది.

ఆదివారం ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ హార్దిక్‌ పాండ్య (35 నాటౌట్‌; 2/19) ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చేయడంతో ముంబై 13 పరుగుల తేడాతో కోల్‌కతాపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై.. సూర్యకుమార్‌ (59; 39 బంతుల్లో 7×4, 2×6), లూయిస్‌ (43; 28 బంతుల్లో 5×4, 2×6), హార్దిక్‌ల మెరుపులతో 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. కోల్‌కతా బౌలర్లలో నరైన్‌ (2/35), రసెల్‌ (2/12) రాణించారు. అనంతరం నైట్‌రైడర్స్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 168 పరుగులే చేయగలిగింది. ఛేదనలో రాబిన్‌ ఉతప్ప (35 బంతుల్లో 54; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడు, నితీశ్‌ రాణా (27 బంతుల్లో 31; 3 ఫోర్లు, 1 సిక్స్‌) రాణింపుతో సులువుగా గెలిచేలా కనిపించిన కోల్‌కతా… చివరి ఓవర్లలో రన్‌రేట్‌కు తగ్గట్లు పరుగులు చేయలేక 168/6కే పరిమితమైంది. కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌ (26 బంతుల్లో 36 నాటౌట్‌; 5 ఫోర్లు, 1 సిక్స్‌) చివరి వరకు క్రీజులో నిలిచినా ఫలితం లేకపోయింది. దీంతో తమ సొంతగడ్డపై ముంబై ఇండియన్స్‌ 13 పరుగులతో మరో కీలక విజయాన్ని గెలుపొందింది.

స్కోరు వివరాలు

ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌: సూర్యకుమార్‌ (సి) కార్తీక్‌ (బి) రసెల్‌ 59; లూయీస్‌ (సి) లిన్‌ (బి) రసెల్‌ 43; రోహిత్‌ శర్మ (సి) సబ్‌–రింకూ సింగ్‌ (బి) నరైన్‌ 11; హార్దిక్‌ నాటౌట్‌ 35; కృనాల్‌ (సి) శుబ్‌మన్‌ గిల్‌ (బి) నరైన్‌ 14; డుమిని నాటౌట్‌ 13; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం: (20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి ) 181.

వికెట్ల పతనం: 1–91, 2–106, 3–127, 4–151.

బౌలింగ్‌: రాణా 2–0–17–0, ప్రసిద్ధ్‌ క్రిష్ణ 4–0–39–0, జాన్సన్‌ 3–0–25–0, నరైన్‌ 4–0–35–2, చావ్లా 3–0–35–0, కుల్దీప్‌ 2–0–17–0, రసెల్‌ 2–0–12–2.

 

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఇన్నింగ్స్‌: క్రిస్‌ లిన్‌ (సి) బుమ్రా (బి) మెక్లీనగన్‌ 17; శుబ్‌మన్‌ గిల్‌ (సి) కృనాల్‌ (బి) హార్దిక్‌ 7; ఉతప్ప (సి) కటింగ్‌ (బి) మార్కండే 54; రాణా (సి) బుమ్రా (బి) హార్దిక్‌ 31; కార్తీక్‌ నాటౌట్‌ 36; రసెల్‌ (సి) కృనాల్‌ (బి) బుమ్రా 9; నరైన్‌ (సి) రోహిత్‌ (బి) కృనాల్‌ 5; చావ్లా నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి) 168.

వికెట్ల పతనం: 1–28, 2–28, 3–112, 4–115, 5–131, 6–163.

బౌలింగ్‌: మెక్లీనగన్‌ 4–0–30–1, బుమ్రా 4–0–34–1, హార్దిక్‌ పాండ్యా 4–0–19–2, కృనాల్‌ 3–0–29–1, మార్కండే 3–0–25–1, కటింగ్‌ 2–0–23–0.