బెంగళూరుపై కోల్‌కతా విజయం
Spread the love

ఆదివారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరుపై కోల్‌కతా విజయం సాధించింది.  15 ఓవర్లకు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు స్కోరు 109/3. అప్పటిదాకా ఇన్నింగ్స్‌ సాగిన తీరు చూస్తే ఆ జట్టు మహా అయితే 160 పరుగులు చేస్తుందనుకున్నారంతా. కానీ నెమ్మదైన పిచ్‌పై కట్టుదిట్టమైన కోల్‌కతా బౌలింగ్‌ను ఎదుర్కొని విరాట్‌ కోహ్లి (68 నాటౌట్‌; 44 బంతుల్లో 5×4, 3×6) శక్తివంచన లేకుండా కష్టపడ్డాడు. చివరి ఓవర్లలో మెరుపులు మెరిపించి జట్టు స్కోరును 175కి తీసుకెళ్లాడు. కోల్‌కతా ఓపెనర్‌ క్రిస్‌ లిన్‌ (62 నాటౌట్‌; 52 బంతుల్లో 7×4, 1×6) ఛేదనను ముందుండి నడిపించాడు. కానీ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు చేసిన కృషి కి అనుకున్నఫలితం దక్కలేదు. చివరికి లిన్‌ లక్ష్యాన్ని సులువుగా అధిగమించి రాయల్‌ చాలెంజర్స్‌ పై నైట్‌రైడర్స్‌ విజయం సాధించింది. లిన్‌కు మ్యాన్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ దక్కింది.

బెంగళూరు : ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. బెంగళూరుపై కోల్‌కతా విజయం సాధించిన ఘటన పై మీడియాతో మాట్లాడిన కోహ్లి తమ జట్టు ఓటమికి ప్రధాన కారణం ఫీల్డింగేనని అసహనం వ్యక్తం చేశాడు. ‘ప్రతీ మ్యాచ్‌ నన్ను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అనుకున్న దాని కన్నా మంచి స్కోర్‌ సాధిస్తున్నాం. కానీ ఓటమి తప్పడం లేదు. ఈ మ్యాచ్‌లో వికెట్లు కోల్పోతున్న తరుణంలో 165 పరుగులు చేసినా ఎక్కువే అనుకున్నాం. కానీ అదనంగా పది పరుగులు లభించాయి. మంచి స్కోర్‌ సాధించినప్పటికీ మ్యాచ్‌ కాపాడుకోలేకపోయామని’  కోహ్లి ఆవేదన వ్యక్తం చేశాడు. ‘మా ఫీల్డింగ్‌ సరిగా లేదు. సింగిల్స్‌ను బౌండరీలుగా మార్చడాన్ని ఆపలేకపోయాం. అందుకే బెంగళూరుపై కోల్‌కతా విజయం సాధించింది. బౌలింగ్‌, ఫీల్డింగ్‌ విభాగాల్లో మరింత శ్రమించాల్సి ఉందని’  ఆర్సీబీ కెప్టెన్‌ అభిప్రాయపడ్డాడు.

ఏడు మ్యాచ్‌ల్లో బెంగళూరుకిది ఐదో ఓటమి కాగా.. ఎనిమిదో మ్యాచ్‌ ఆడిన కోల్‌కతా నాలుగో విజయం ఖాతాలో వేసుకుంది.