తొలి టీ20లో భారత్‌ విజయం
Spread the love

ఆదివారం పరుగులు కష్టంగా వచ్చిన మొదటి టీ20లో టీమ్‌ ఇండియా 5 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌పై విజయం సాధించింది. కుల్‌దీప్‌ యాదవ్‌ (3/13), కృనాల్‌ పాండ్య (1/15), ఖలీల్‌ అహ్మద్‌ (1/16)ల పదునైన బౌలింగ్‌తో మొదట విండీస్‌ 8 వికెట్లకు 109 పరుగులే చేయగలిగింది. 27 పరుగులతో అలెన్‌ టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. లక్ష్యం చిన్నదే అయినా భారత్‌ తడబడింది. కానీ దినేశ్‌ కార్తీక్‌ (31 నాటౌట్‌; 34 బంతుల్లో 3×4, 1×6), కృనాల్‌ పాండ్య (21 నాటౌట్‌; 9 బంతుల్లో 3×4) నిలబడడంతో భారత్‌ 17.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మనీష్‌ పాండే (19; 24 బంతుల్లో 2×4) విలువైన పరుగులు చేశాడు.  కుల్‌దీప్‌ యాదవ్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది. రెండో టీ20 మంగళవారం లఖ్‌నవూలో జరుగుతుంది.

అరంగేట్రం మ్యాచ్‌లోనే ఒషానె థామస్ సత్తాచాటాడు. ఇన్నింగ్స్ మొదటి ఓవర్ ఆఖరి బంతికి కెప్టెన్ రోహిత్‌శర్మ(6)ను ఔట్ చేశాడు. వేగంగా దూసుకొచ్చిన బంతిని ఆడే క్రమంలో కీపర్ రామ్‌దిన్ చేతికి రోహిత్ చిక్కాడు. ఫీల్డ్ అంపైర్ నిరాకరణతో డీఆర్‌ఎస్‌కు వెళ్లిన విండీస్‌కు అనుకూల ఫలితం దక్కింది. ఆ తర్వాత క్రీజులోకొచ్చిన కేఎల్ రాహుల్(16)..ధవన్(3)కు జతకలిశాడు. మళ్లీ బౌలింగ్‌కు దిగిన థామస్..ఈసారి ధవన్‌ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన రిషబ్ పంత్(1) అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ధోనీ లేని అవకాశాన్ని అందిపుచ్చుకోవడంలో విఫలమయ్యాడు. బ్రాత్‌వైట్ వేసిన ఐదో ఓవర్లో భారీ షాట్ ఆడబోయిన పంత్..బ్రావోకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. పది పరుగుల తేడాతో రాహుల్ కూడా ఔట్ కావడంతో భారత్ 45 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కార్తీక్, మనీశ్ పాండే(19) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వీరిద్దరు చెత్తషాట్లకు పోకుండా విండీస్ బౌలింగ్‌ను ఆచితూచి ఎదుర్కొంటూ పరుగులు రాబట్టారు. క్రీజులో కుదురుకున్నారన్న క్రమంలో పాండే..పియరీకి రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఐదో వికెట్‌గా పెవిలియన్ వెళ్లాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా…కార్తీక్ తన అనుభవంతో బౌండరీలతో ఆకట్టుకున్నాడు. 30 బంతుల్లో 27 పరుగులు అవసరమైన దశలో బ్యాటింగ్‌కు వచ్చిన కృనాల్ పాండ్యా..దూకుడు కనబరిచాడు. ఎక్కడా తొణకుండా కార్తీక్ సహకారంతో బౌండరీలు బాదాడు. మెండైన ఆత్మవిశ్వాసం కనబరుస్తూ..అలవోకగా పరుగులు సాధిస్తూ..కార్తీక్‌తో కలిసి జట్టును గెలుపు తీరాలకు చేర్చి తన అరంగేట్రాన్ని మరుపురానిదిగా మలుచుకున్నాడు.

స్కోరుబోర్డు

వెస్టిండీస్‌: షాయ్‌ హోప్‌ (రనౌట్‌) 14; దినేశ్‌ రామ్‌దిన్‌ (సి) దినేశ్‌ కార్తీక్‌ (బి) ఉమేశ్‌ యాదవ్‌ 2; హెట్‌మయెర్‌ (సి) దినేశ్‌ కార్తీక్‌ (బి) బుమ్రా 10; పొలార్డ్‌ (సి) మనీశ్‌ పాండే (బి) పాండ్యా 14; డారెన్‌ బ్రావో (సి) శిఖర్‌ ధవన్‌ (బి) కుల్దీప్‌ యాదవ్‌ 5; రోవ్‌మన్‌ పావెల్‌ (సి) దినేశ్‌ కార్తీక్‌ (బి) కుల్దీప్‌ యాదవ్‌ 4; బ్రాత్‌వైట్‌ (ఎల్బీ) కుల్దీప్‌ యాదవ్‌ 4; ఆలెన్‌ (సి) ఉమేశ్‌ యాదవ్‌ (బి) ఖలీల్‌ అహ్మద్‌ 27; కీమో పాల్‌ (నాటౌట్‌) 15; పియెర్‌ (నాటౌట్‌) 9: ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: 20 ఓవర్లలో 109/8. వికెట్ల పతనం: 1-16, 2-22, 3-28, 4-47, 5-49, 6-56, 7-63, 8-87. బౌలింగ్‌: ఉమేశ్‌ యాదవ్‌ 4-0-36-1; ఖలీల్‌ అహ్మద్‌ 4-1-16-1; బుమ్రా 4-0-27-1; క్రునాల్‌ పాండ్యా 4-0-15-1; కుల్దీప్‌ యాదవ్‌ 4-0-13-3.

భారత్‌: రోహిత్‌ (సి) రామ్‌దిన్‌ (బి) థామస్‌ 6; ధవన్‌ (బి) థామస్‌ 3; రాహుల్‌ (సి) బ్రావో (బి) బ్రాత్‌వైట్‌ 16; రిషభ్‌ పంత్‌ (సి) బ్రావో (బి) బ్రాత్‌వైట్‌ 1; మనీష్‌ పాండే (సి అండ్‌ బి) పియెర్‌ 19; దినేష్‌ కార్తీక్‌ (నాటౌట్‌) 31; క్రునాల్‌ పాండ్యా (నాటౌట్‌) 21; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం : 17.5 ఓవర్లలో 110/5. వికెట్ల పతనం: 1-7, 2-16, 3-35, 4-45, 5-83. బౌలింగ్‌: థామస్‌ 4-0-21-2; కీమో పాల్‌ 3.5-0-30-0; బ్రాత్‌వైట్‌ 4-1-11-2; పియెర్‌ 4-0-16-1; పొలార్డ్‌ 1-0-12-0; ఆలెన్‌ 1-0-11-0.