మూడో టీ20లో 6 వికెట్ల తేడాతో భారత్ గెలుపు
Spread the love

– మూడో టీ20లో విండీస్‌ ఓటమి

రాణించిన ధవన్‌, పంత్‌

3-0తో సిరీస్ క్లీన్‌స్వీప్

-దంచికొట్టిన ధవన్

క్రికెట్‌లో విజయం ఎవరివైపు వెళ్తుందో ఆఖరి బంతి వరకు చెప్పలేమని..! చెపాక్‌లో భారత్‌ను ఆఖరి ఓవర్‌లో వెస్టిండీస్ చెడుగుడు ఆడుకున్న తీరు చూస్తే.. ఇది నిజమేనని అనిపించక మానదు..! ఉత్కంఠ కూడా ఊపిరితీసుకోలేనంత స్థాయిలో జరిగిన చివరి ఓవర్ థ్రిల్లర్‌లో భారత్ ఎట్టకేలకు గట్టెక్కి హమ్మయ్యా అనుకుంది..! మూడో టీ20లో భారత్‌ గెలవాలంటే 12 బంతుల్లో 8 పరుగులే చేయాలి.. చేతిలో ఎనిమిది వికెట్లు ఉన్నాయి.. ధావన్‌ (92; 62 బంతుల్లో 10×4, 2×6), రిషబ్‌ పంత్‌ (58; 38 బంతుల్లో 5×4, 3×6) జోరు మీదున్నారు.

                                                                          చెన్నై

వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌ను భారత్‌ ఊడ్చేసింది. ఆదివారం నాడు ఉత్కంఠభరితంగా సాగిన మూడో మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో విండీస్‌ను ఓడించిన టీమ్‌ఇండియా సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసింది. మొదట బ్యాటింగ్‌ చేసిన విండీస్‌ 3 వికెట్లకు 181 పరుగులు చేయగా.. ఛేదనలో భారత్‌ 4 వికెట్లు కోల్పోయి ఆఖరి బంతికి విజయాన్ని అందుకుంది. డ్వేన్‌ బ్రావో (37 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) 43 రన్స్‌తో అజేయంగా నిలిచాడు. చాహల్‌ 2 వికెట్లు పడగొట్టగా, వాషింగ్టన్‌ సుందర్‌ ఓ వికెట్‌ తీశాడు. అనంతరం ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ధవన్‌, పంత్‌ విజృంభణతో.. భారత్‌ ఓవర్లన్నీ ఆడి 4 వికెట్లకు 182 రన్స్‌ చేసి విజయం సాధించింది.

ఓపెనర్లు హెట్‌మైర్‌ (21 బంతుల్లో 26; 4 ఫోర్లు, 1 సిక్స్‌), హోప్‌ (22 బంతుల్లో 24; 3 ఫోర్లు, 1 సిక్స్‌) విండీస్‌కు శుభారంభం అందించారు. వీరిద్దరూ దూకుడైన ఆటను ప్రదర్శిస్తూ బౌండరీలతో చెలరేగారు. సుందర్‌ ఓవర్లో హెట్‌మైర్‌ రెండు ఫోర్లు కొట్టగా, కృనాల్‌ పాండ్యా మొదటి ఓవర్లో ఇద్దరూ చెరో సిక్సర్‌ బాదారు. పవర్‌ ప్లే ముగిసేసరికి విండీస్‌ 36 బంతుల్లో 51 పరుగులు చేసింది. అయితే ఏడో ఓవర్‌ వేసిన చహల్‌ మొదటి బంతికే హోప్‌ను ఔట్‌ చేయడంతో మొదటి వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది.

ధవన్, రిషబ్ జోరు

భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్‌కు సరైన ఆరంభం లభించలేదు. మూడో ఓవర్‌లోనే కెప్టెన్ రోహిత్ (4) ఔటయ్యాడు. రాహుల్ (17) మరోసారి నిరాశపర్చాడు. తక్కువ వ్యవధిలోనే రెండు వికెట్లు పడినా.. అవతలివైపు ధవన్ మాత్రం దంచికొట్టాడు. బ్రాత్‌వైట్, థామస్, పొలార్డ్‌ను లక్ష్యంగా చేసుకుని ధవన్, పంత్ చేసిన ఊచకోత ముందు భారీ లక్ష్యం కొండలా కరిగిపోయింది. పవర్‌ప్లేలో 50/2 స్కోరుతో ఉన్న టీమ్‌ఇండియాకు 7, 8 ఓవర్లలో కేవలం 10 పరుగులే వచ్చాయి. మొదటి 10 ఓవర్లలో భారత్ 76 పరుగులే చేసినా.. తర్వాతి 10 ఓవర్లలో ఈ ఇద్దరు విశ్వరూపం చూపెట్టారు. థామస్ వేసిన 11వ ఓవర్‌లో చెరో సిక్సర్ బాదడంతో 18 పరుగులు వచ్చాయి. 13వ ఓవర్‌లో పొలార్డ్‌కు 4, 4, 6 చూపెట్టడంతో మరో 18 పరుగులు సమకూరాయి. ఈ ఇద్దరి జోరుతో కేవలం 5 ఓవర్లలో 63 పరుగులు రావడంతో భారత్ లక్ష్యం 30 బంతుల్లో 43 పరుగులుగా మారింది.

వెస్టిండీస్‌ ఇన్నింగ్స్‌: హోప్‌ (సి) వాషింగ్టన్‌ సుందర్‌ (బి) చాహల్‌ 24; హెట్‌మెయర్‌ (సి) కృనాల్‌ (బి) చాహల్‌ 26; డారెన్‌ బ్రావో నాటౌట్‌ 43; రామ్‌దిన్‌ (బి) వాషింగ్టన్‌ సుందర్‌ 15; పూరన్‌ నాటౌట్‌ 53; ఎక్స్‌ట్రాలు 20; మొత్తం: (20 ఓవర్లలో 3 వికెట్లకు) 181; వికెట్ల పతనం: 1-51, 2-62, 3-94; బౌలింగ్‌: ఖలీల్‌ అహ్మద్‌ 4-0-37-0; వాషింగ్టన్‌ సుందర్‌ 4-0-33-1; భువనేశ్వర్‌ 4-0-39-0; కృనాల్‌ పాండ్య 4-0-40-0; చాహల్‌ 4-0-28-2

భారత్‌ ఇన్నింగ్స్‌: ధావన్‌ (సి) పొలార్డ్‌ (బి) అలెన్‌ 92; రోహిత్‌ (సి) బ్రాత్‌వైట్‌ (బి) పాల్‌ 4; రాహుల్‌ (సి) రామ్‌దిన్‌ (బి) థామస్‌ 17; రిషబ్‌ పంత్‌ (బి) పాల్‌ 58; మనీష్‌ పాండే నాటౌట్‌ 4; కార్తీక్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం: (20 ఓవర్లలో 4 వికెట్లకు) 182; వికెట్ల పతనం: 1-13, 2-45, 3-175, 4-181; బౌలింగ్‌: పియర్‌ 2-0-13-0; థామస్‌ 4-0-43-1; కీమో పాల్‌ 4-0-32-2; కార్లోస్‌ బ్రాత్‌వైట్‌ 4-0-41-0; పొలార్డ్‌ 3-0-29-0; అలెన్‌ 3-0-23-1