20 బంగారు పతకాలతో అగ్రస్థానం
Spread the love

కొలంబో: శ్రీలంక రాజధాని కొలంబో వేదికగా నిర్వహిస్తున్న దక్షిణాసియా జూనియర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శన చేశారు. మొదటి రోజు 11 స్వర్ణాలతో మెరిసిన అథ్లెట్లు రెండో రోజు 9 బంగారు పతకాలతో సత్తా చాటింది. ఏడు దేశాలు తలపడిన ఈ మీట్‌ ఆదివారంతో ముగిసింది. మొత్తం 20 స్వర్ణాలు, 22 రజతాలు, 8 కాంస్యాలతో భారత్‌ పతకాల పట్టికలో మొదటి స్థానం దక్కించుకుంది. 12 స్వర్ణాలు, 10 రజతాలు, 19 కాంస్యాలతో ఆతిథ్య శ్రీలంక ద్వితీయ స్థానంలో నిలిచింది. పాకిస్తాన్ ఒక కాంస్య, ఒక రజత పతకం సాధించి వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. పురుషుల జావెలిన్‌ త్రోలో 71.47 మీటర్లు విసిరిన అర్షదీప్‌ సింగ్‌ భారత్‌కు తొలి బంగారు పతకం అందించాడు. మహిళల షాట్‌పుట్‌లో కిరణ్‌ బలియన్‌ 14.77 మీటర్లు విసిరి స్వర్ణం నెగ్గింది.

వీరిద్దరూ ఈ క్రీడల్లో కొత్త రికార్డు నెలకొల్పడం విశేషం. ఇదే విభాగంలో అనామికా దాస్‌ రజతం (14.54 మీ.) సాధించింది. పురుషుల లాంగ్‌ జంప్‌లో లోకేశ్‌ సత్యనాథన్‌ (7.74 మీ.), మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో సప్నా కుమారి 14.19 సెకన్ల టైమింగ్‌తో, 1500 మీటర్ల ఈవెంట్‌లో దుర్గా డోరె 4.31.38 టైమింగ్‌తో కొత్త రికార్డులు సృష్టించి స్వర్ణాలు అందుకున్నారు. 4గీ100 మీ. రిలే రేసులో పురుషుల బృందం బంగారు పతకం, మహిళల జట్టు రజతం దక్కించుకున్నాయి.

ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన భారత క్రీడాకారులు జపాన్‌లోని జిఫులో వచ్చే నెల 7 నుంచి 10 వరకు నిర్వహించే  ఆసియా జూనియర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తారు.