కీలక సమరానికి భారత్, ఆస్ట్రేలియా సిద్ధం
Spread the love

భారత్‌-ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌ ఆరంభం కాబోతున్న నేపథ్యంలో ‘క్రిక్‌విజ్‌’ అనే వెబ్‌సైట్‌కు చెందిన ఒక విశ్లేషకుడు.. కోహ్లి బ్యాటింగ్‌ను విశ్లేషిస్తూ, అతడి బలాబలాల గురించి చర్చిస్తూ ఒక వ్యాసం రాశాడట ఇటీవల. కోహ్లి ఎక్కువగా ఎలాంటి బంతులకు పరుగులు రాబడతాడు.. తరచుగా ఏ బంతులకు ఔటవుతాడు.. అతడి టెక్నిక్‌ ఎలా ఉంటోంది.. ఇలాంటి అంశాలతో ఆ వ్యాసం సాగింది. ఆస్ట్రేలియా జట్టు కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ ఈ వ్యాసాన్ని ప్రింట్‌ తీసి.. జట్టు సభ్యులందరికీ పంచాడట. కంగారూ జట్టు విరాట్‌పై ఏ స్థాయిలో దృష్టిపెట్టింది.. అతడిని ఆపేందుకు ఎంతగా ప్రణాళికలు రచిస్తోంది.. అనడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే. రాబోయే సిరీస్‌లో ఎవరి అవకాశాలు ఎలా ఉంటాయో చెప్పమంటూ ఏ మాజీ ఆటగాడిని అడిగినా.. ప్రధానంగా కోహ్లి చుట్టూనే అభిప్రాయాలు తిరుగుతాయి.

క్రికెట్‌లో భారత్, ఆస్ట్రేలియా పోరు అంటే ఆ మజానే వేరు. దాయాదులు భారత్, పాకిస్థాన్ తర్వాత అంతటి ఆదరణ ఈ రెండు జట్లకు సొంతం. అది ఏ ఫార్మాట్ అన్నది సంబంధం లేకుండా ఇరు జట్లు విజయం కోసం ఆఖరిదాకా విశ్రమించకుండా పోరాడుతాయి. ముఖ్యంగా పట్టువదలకుండా పోరాడటంలో మనకంటే ఆసీస్ ముందంజలో ఉంటుంది. అయితే కాలానికి అనుగుణంగా టీమ్‌ఇండియాలోనూ విప్లవత్మాక మార్పులు వచ్చాయి. జట్టుకు దూకుడు నేర్పిన విరాట్ కోహ్లీ జట్టును నాయకుడై ముందుండి నడిపిస్తున్న వేళ..స్వదేశమైనా..విదేశమైనా గెలుపు లక్ష్యంగా మనోళ్లు బరిలోకి దిగుతున్నారు. సొంతగడ్డపై వరుస విజయాలతో భారత్ ఊపుమీదుంటే..స్మిత్, వార్నర్ గైర్హాజరీతో ఆసీస్ ఎన్నడూలేని రీతిలో వరుస ఓటములతో సతమమతమవుతున్నది. దక్షిణాఫ్రికాలో బాల్ ట్యాంపరింగ్ వివాదంతో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన కంగారూలు..భారత్‌ను నిలువరించి పరువుచాటుకోవాలన్న పట్టుదలతో కనిపిస్తున్నారు. ఇదిలా ఉంటే బలబలాల పరంగా చూస్తే..ఆసీస్ కంటే మెరుగ్గా కనిపిస్తున్న భారత్..ఈసారైనా టెస్ట్ సిరీస్ విజయాన్ని ఖాతాలో వేసుకునేందుకు పావులు కదుపుతున్నది. యువ ఓపెనర్ పృథ్వీషా రూపంలో సిరీస్‌కు ముందే ఎదురుదెబ్బ తగిలినా..రిజర్వ్ బెంచ్‌తో ఆసీస్ పటిష్ఠ పేస్‌బౌలింగ్‌కు దీటైన సమాధానమిచ్చేందుకు సిద్ధమంటున్నది. గెలుపు, ఓటములను ప్రభావితం చేసే కొన్ని జోడీలపై అభిమానుల్లో మరింత ఆసక్తినెలకొన్ని ఉన్నది. ఇందులో ముఖ్యంగా టీమ్‌ఇండియా కెప్టెన్ కోహ్లీ, ఆసీస్ స్పీడ్‌స్టర్ మిచెల్ స్టార్క్, పుజార, హాజిల్‌వుడ్, ఖవాజ, బుమ్రా, రహానే, లియాన్, టిమ్ పెన్, అశ్విన్ మధ్య రసవత్తర పోరుకు ఆస్కారముంది.