భారత్‌లో టీ20 ప్రపంచకప్‌
Spread the love

కోల్‌కతా: అంతర్జాతీయ క్రికెట్ (ఐసీసీ) నిర్వహించే ట్రోఫీల్లో చాంపియన్స్‌ ట్రోఫీ ఒకటి. మినీ ప్రపంచక్‌పగా భావించే చాంపియన్స్‌ ట్రోఫీ ఇకనుంచి కనిపించే అవకాశాలు లేనట్టే. 2021లో భారత్‌లో జరగాల్సి ఉన్న ఈ టోర్నీ స్థానంలో ప్రపంచ టీ20ని నిర్వహించాలని నిర్ణయించింది. ఇక్కడ జరిగిన ఐదు రోజుల ఐసీసీ ఎగ్జిక్యూటివ్‌ల బోర్డు మీటింగ్‌లో టోర్నీల మార్పును ఖరారు చేశారు. సభ్య దేశాలు ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నాయని ఐసీసీ ముఖ్య కార్యనిర్వాహక అధికారి డేవ్‌ రిచర్డ్‌సన్‌ చెప్పాడు. గేమ్‌ను అభివృద్ధి పరిచే మా వ్యూహంలో భాగంగా ఇలా నిర్ణయించాం. దీంతో వరుసగా రెండేళ్లలో రెండు టీ20 ప్రపంచకప్‌లు జరగనున్నాయి. ఆస్ట్రేలియాలో 2020లో ఐసీసీ వరల్డ్ టీ-20, 2021లో భారత్‌లో ఐసీసీ వరల్డ్ టీ-20 నిర్వహించనున్నారు.భారత్‌లో నిర్వహించే చాంపియన్ ట్రోఫీని ఇక ముందు వరల్డ్ టీ-20గా మారుతుందని రిచర్డ్‌సన్ పేర్కొన్నాడు. 2009, 2010లో కూడా ఇలానే రెండు టీ20 కప్‌లు వరుసగా ఇంగ్లాండ్‌, వెస్టిండీస్‌ల్లో జరిగాయి. 2019, 2023లో వన్డే ఇంటర్నేషనల్ కప్ జరుగుతుంది.

ICC converts 2021 Champions Trophy in India into World T20104 దేశాలకు టీ20 హోదా:  క్రికెట్‌ను ప్రపంచమంతా విస్తరించేందుకు మొత్తం 104 సభ్య దేశాలకూ టీ20 హోదా ఇవ్వాలని అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ)నిర్ణయించింది. అంటే అర్జెంటీనా, పపువా న్యూగినియా మధ్య జరిగే మ్యాచ్‌కు కూడా అంతర్జాతీయ హోదా ఉంటుందన్నమాట. సభ్య దేశాలకు అంతర్జాతీయ క్రికెట్‌ ఆడడం తేలిక చేసేందుకు కొత్త కనీస ప్రమాణాలను ప్రవేశపెట్టాలని కోల్‌కతాలో జరిగిన త్రైమాసిక సమావేశంలో ఐసీసీ నిర్ణయించింది. అన్ని దేశాల మహిళల జట్లకు 2018 జులై 1న, పురుషుల జట్లకు 2019 జనవరి 1న టీ20 హోదా ఇస్తారు. ప్రస్తుతం 18 దేశాలకు మాత్రమే టీ20 అంతర్జాతీయ హోదా ఉంది.

2028 ఒలింపిక్స్ లో క్రికెట్‌?  లాస్‌ ఏంజిల్స్‌ ఆతిథ్యమిచ్చే 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్‌ ఆటను చేర్చే అవకాశముంది. మెగా ఈవెంట్‌లో క్రికెట్‌ను చేర్చేందుకు అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌  (ఐసీసీ) కృషి చేస్తుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే లాస్‌ ఏంజిల్స్‌లో క్రికెట్‌ను చూడొచ్చని ఐసీసీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ డేవిడ్‌ రిచర్డ్‌సన్‌ వెల్లడించారు. పారిస్‌ (2024)లో జరిగే ఒలింపిక్స్‌లో కొత్త క్రీడలను చేర్చే తుదిగడువు ముగియడంతో తదుపరి ఈవెంట్‌ కోసం ప్రయత్నిస్తున్నట్లు ఆయన చెప్పారు.

ద్వైపాక్షిక సిరీస్‌పై భారత్‌, పాకిస్థాన్‌ బోర్డుల మధ్య నెలకొన్న వివాదం క్లిష్టమైందని ఐసీసీ సీఈవో డేవ్‌ రిచర్డ్‌సన్‌ వ్యాఖ్యానించారు. ‘ద్వైపాక్షిక సిరీస్‌ల్లో భారత్‌-పాక్‌లు ఆడాలని అందరూ ఆకాంక్షిస్తారు. కానీ అది చాలా కష్టం. ఇరు బోర్డులు అంగీకరిస్తే సాధ్యమయ్యేది కాదు. వెనుక ఎంతో తతంగం ఉంటుంద’ని అన్నారు.